రాంచీ: జార్ఖండ్‌లో నువ్వానేనా అనేలా తొలుత ఫలితాల ట్రెండ్ కనిపించినప్పటికీ చివరకు ఇండియా కూటమే పైచేయి సాధించింది. శనివారం(నవంబర్ 23, 2024) ఉదయం 11.15 సమయానికి జార్ఖండ్‌లోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గానూ 49 స్థానాల్లో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి లీడ్‌లో ఉంది. జార్ఖండ్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 41.
ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఇండియా కూటమి దాటేసింది. 30 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, 2 స్థానాల్లో ఇతరులు ముందంజలో ఉన్నారు. ఇక.. పార్టీల వారీగా లీడ్ గమనిస్తే.. జేఎంఎం 30 స్థానాల్లో, కాంగ్రెస్ 14 స్థానాల్లో, బీజేపీ 26 స్థానాల్లో, ఇతరులు 11 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. అధికారం నిలబెట్టుకోవాలని జేఎంఎం, ఈసారి ఎలాగైనా జార్ఖండ్‌లో పాగా వెయ్యాలని బీజేపీ చూశాయి.
Also Read :- మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
ప్రస్తుతం ఫలితాల సరళిని గమనిస్తే.. జేఎంఎంకు పూర్తి స్థాయి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. జార్ఖండ్‌లో బీజేపీ పప్పులు ఉడకలేదు. ఎన్డీయేనే ఈసారి అధికారం దక్కించుకుంటుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఇండియా కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని కొన్ని ఎగ్జిట్‌పోల్స్ చెప్పిన విషయమే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
2019 ఎన్నికల్లో జేఎంఎంకు 30 సీట్లురాగా, బీజేపీ 25 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్, ఆర్జేడీతో జతకట్టిన జేఎఎం అధికారం చేపట్టింది. 2024 జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అత్యధిక పోలింగ్ (67.74%) నమోదైంది. జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి హోరాహోరీగా తలపడ్డాయి.