
అనువైన స్థలమంటూ నేడో, రేపో సర్కారు కమిటీ రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు కానుంది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో, మోడల్ ఇంజినీరింగ్ కాలేజీని ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన కమిటీ రెండు రోజుల క్రితం సిరిసిల్ల శివారులోని వెంకటాపూర్ పరిసర ప్రాంతాలను పరిశీలించింది. ఆ ప్రాంతంలో సుమారు 88 ఎకరాల సర్కార్ ల్యాండ్ ఉందనీ, అక్కడ కాలేజీ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని కమిటీ నిర్ధారించింది. కాలేజీల ఏర్పాటుకు సంబంధించి అక్కడి జిల్లా అధికారులతోనూ కమిటీ ప్రతినిధులు చర్చించారు. నేడో, రేపో కమిటీ నివేదికను ప్రభుత్వానికి అందివ్వనున్నది. అయితే జేఎన్టీయూహెచ్‌కు అనుబంధంగా మూడు ఇంజినీరింగ్ కాలేజీలు ఉంటే, వాటిలో రెండు ఉమ్మడి కరీంనగర్‌లోని మంథని, జగిత్యాలలో ఉన్నాయి.
మూడోది ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో ఉంది. తాజాగా మరో కాలేజీనీ కూడా అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సిరిసిల్లకు 40 కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డి జిల్లాలో జేఎన్టీయూ ఈ కాలేజీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. హైదరాబాద్ నుంచి రైల్వేలైన్‌తో పాటు నేషనల్ హైవే కూడా ఉండటంతో అక్కడ ఏర్పాటు చేస్తే ఆ జిల్లానూ విద్యాపరంగా అభివృద్ధి చేయవచ్చనే అభిప్రాయం జేఎన్టీయూ అధికారుల్లో వ్యక్తమైంది. అయితే ఆ జిల్లా ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టకపోవడం… సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కోరిక మేరకు అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.