
కూకట్పల్లి, వెలుగు: సైన్స్ పునాదిగా ఉంటేనే టెక్నాలజీ డెవలప్మెంట్ సాధ్యమవుతుందని జేఎన్టీటీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి అన్నారు. సమాజాభివృద్ధికి సైన్స్ ఎంతో అవసరమనే అంశాన్ని టెక్నికల్ స్టూడెంట్లు గుర్తించాలన్నారు. ‘రసాయన శాస్త్రం ప్రాధాన్యత’ అంశంపై జేఎన్టీయూ ఆడిటోరియంలో మూడ్రోజుల పాటు జరగనున్న ఇంటర్నేషనల్ సెమినార్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కొంతకాలంగా స్టూడెంట్లు ఇంజినీరింగ్‌పై దృష్టిపెడుతూ సైన్స్ ను నిర్లక్ష్యం చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు.
సైన్స్ ప్రాధాన్యతను గుర్తించి, అందుకు అనుగుణంగా చదువును కొనసాగించాలని సూచించారు. చీఫ్‌గెస్టుగా హాజరైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(సీఎస్ఐర్) డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మనిషి జీవితం రసాయన శాస్త్రంతో ముడిపడి ఉందన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ప్రిన్సిపల్ జయలక్ష్మి, సెమినార్కన్వీనర్ ప్రొఫెసర్రమాదేవి తదితరులు పాల్గొన్నారు.