విశ్లేషణ: ఉద్యోగ ప్రకటనలు ఎన్నికలప్పుడేనా

ఏడేండ్ల నుంచి పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యని రాష్ట్ర సర్కారు.. ఇప్పుడు ఒకేసారి 91 వేల నియామకాలు పూర్తి చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్​కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ తో కలిపి 91 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెబుతోంది. మిగిలిన లక్ష ఉద్యోగాలు ఎటు పోయినయని ప్రతిపక్షాలతోపాటు నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. నియామకాలకు సంబంధించి స్థానిక అభ్యర్థులకు సంపూర్ణ న్యాయం జరగడానికి కావాల్సిన పటిష్ట వ్యవస్థను రూపొందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. రిక్రూట్​మెంట్​ప్రాసెస్ ​స్టార్ట్​అయితేగానీ చెప్పలేం న్యాయం ఎవరికి జరుగుతుందనేది. కొత్త జోనల్ వ్యవస్థపై 2018 ఆగస్టులో రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే ఉత్తర్వులు జారీ చేసిన 36 నెలల్లోగా కొత్త జోనల్ వ్యవస్థను అమలు చేయాలని గడువు పెడితే.. 40 నెలలు దాటినా ఆ ఉత్తర్వుల గురించి ప్రభుత్వంపట్టించుకున్న దాఖలాలు లేవు. 

తొలగించిన వారి పరిస్థితి..
నిరుడు డిసెంబర్ 6న 317 జీవో తీసుకొచ్చిన సర్కారు.. ఉద్యోగులను మానసిక ఇబ్బందులకు గురిచేసింది. ఆ జీవో రాష్త్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా, ఉద్యోగుల స్థానికతకు భంగం కలిగించేలా ఉందని ఉద్యోగు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే ముందు12 వేల మంది విద్యా వలంటీర్లను, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, 22 వేల మంది స్కావెంజర్లను,1700 మంది నర్సులను మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ కూడా ఉంది. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్య సేవలందించిన కాంట్రాక్టు డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాల్సిన ప్రభుత్వం వారి గురించి పట్టించుకోలేదు. కేవలం విద్యాశాఖలోనే 25 నుంచి 30 వేల ఉద్యోగాలు ఉన్నాయని నిరుద్యోగులకు ఆశలు కల్పించడం కొత్తేమి కాదు. ఏ నిరుద్యోగి కూడా  సర్కారు మాటలు నమ్మే పరిస్థితి కనబడటం లేదు.

ప్రాసెస్ ​పేరుతో కాలయాపన..
నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు శాఖల వారీగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం రోస్టర్ తయారు చేయడానికి సమయం పడుతుంది. ఆయా పరీక్షల కోసం సిలబస్ రూపకల్పన చేయించడానికి సమయం పడుతుంది. ఏమైనా న్యాయ సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించడానికి సమయం పడుతుంది. నోటిఫికేషన్ తర్వాత అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి, దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యాక ప్రిపరేషన్, పరీక్ష నిర్వహించిన తర్వాత ఫలితాలకు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇలా ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాదిన్నర పట్టే చాన్స్​ఉంది. ఇలా ప్రాసెస్​పేరుతో కాలయాపన చేస్తే.. నిరుద్యోగులకు మళ్లీ అన్యాయం జరిగే ఆస్కారం ఉంది. అప్పటిలోగా ఎన్నికల కోడ్ వస్తే.. నియామకాలు ఎక్కడియక్కడే ఆగిపోతాయి. టీఎస్ పీఎస్సీ నిర్వహించిన గ్రూప్​2, గ్రూప్​4 పోస్టుల భర్తీకి ఐదేండ్లు పట్టింది. టీఆర్టీలో కొన్ని పోస్టుల భర్తీకి ఆరేండ్ల వరకు సమయం పట్టింది. ఈ ఏడాది ఒకవేళ ఉద్యోగాల భర్తీ జరిగినా.. వారు డ్యూటీల్లో చేరుడు సందేహమే. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాలకు నిధులు ఏమీ కేటాయించలేదు. 

టీచర్ల రిక్రూట్​మెంట్​ ఆలస్యమే..
విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్ ఉద్యోగార్థులు తప్పనిసరిగా టెట్ అర్హత కలిగి ఉండాలి. టెట్ పరీక్షను ప్రభుత్వం ప్రతి ఆరునెలలకు ఒకసారి నిర్వహించాలి. కానీ ఐదేండ్ల నుంచి ఇప్పటి దాకా టెట్ నిర్వహించలేదు. ఎట్టకేలకు ఇప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ​విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ సహా ఎగ్జామ్​నిర్వహణ, ఫలితాల వెల్లడికి మూడు నుంచి నాలుగు నెలల టైమ్​పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత డీఎస్సీ లేదంటా టీఎస్​పీఎస్సీ ద్వారా టీచర్ల రిక్రూట్​మెంట్ ​కోసం ప్రకటన వెలువడే ఆస్కారం ఉంది. మిగతా పోస్టులతో పోలిస్తే టీచర్ల రిక్రూట్​మెంట్​కు మరింత టైమ్​పట్టే అవకాశం ఉంది.

జాబ్​ క్యాలెండర్​ ఏమాయె..
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో లక్షా 7 వేల ఉద్యోగాలిస్తానని ప్రభుత్వం ప్రకటన చేసింది. ఆ ప్రకటనతో హర్షం వ్యక్తం చేసిన నిరుద్యోగులకు ఆ తర్వాత నిరాశే ఎదురైంది. ఏటా జాబ్​ క్యాలెండర్​విడుదల చేస్తామని ఇచ్చిన హామీలు కూడా బుట్టదాఖలయ్యాయి. పక్క రాష్ట్రం ఏపీ సహా చాలా రాష్ట్రాలు జాబ్​ క్యాలెండర్​ ప్రకటిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. వివిధ శాఖల్లో ఏర్పడే ఖాళీల సంఖ్య, నోటిఫికేషన్స్ తేదీలు, పరీక్షల తేదీలు, వాటి ఫలితాల తేదీలు తదితర వివరాలతో ఒక క్యాలెండర్ ను తయారు చేయిస్తే నిరుద్యోగులకు ప్రభుత్వం పట్ల నమ్మకం కలుగుతుంది.

కోచింగ్​ కోసం పెద్ద ఎత్తున డబ్బులు
ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు విన్న ప్రతీసారి నిరుద్యోగులు కోచింగ్​సెంటర్లకు పరుగులు పెడుతున్నారు. వేలల్లో ఫీజులు కడుతూ ప్రిపేరవుతున్నారు. ఇలా ఇప్పటికే కొన్ని వేలల్లో డబ్బులు కోచింగ్​సెంటర్లకు చెల్లించిన నిరుద్యోగులు ఇప్పుడు తాజా ప్రకటనతో మళ్లీ కోచింగ్​ సెంటర్ల బాట పడుతున్నారు. ఇదే అదునుగా కోచింగ్​సెంటర్లు దోపిడీ చేస్తున్నాయి. కానిస్టేబుల్​కు రూ.15 వేల నుంచి మొదలు గ్రూప్​1 స్థాయి ఉద్యోగాలకు రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఫీజులు చెల్లించలేని పేద ఉద్యోగార్థుల కోసం టీశాట్​ ద్వారా ఫ్రీగా కోచింగ్ ​ఇప్పిస్తామని మంత్రి కేటీఆర్​ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు 
ఎలాంటి క్లాసులు మొదలు కాలేదు.

యూనివర్సిటీలపై పట్టింపేది?
రాష్ట్ర ఏర్పాటు నుంచి యూనివర్సిటీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిధుల కేటాయింపులతోపాటు ఖాళీల భర్తీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వీసీల నియామకాల్లో ఎటువంటి రాజకీయ జోక్యానికి తావు లేకుండా చాన్స్​లర్ హోదాలో గవర్నర్ జోక్యం చేసుకొని వీసీ నియామకాలు చేపట్టాలని గతంలో అన్ని వర్సిటీల టీచింగ్ అసోసియేషన్లు డిమాండ్ చేశాయి. కొన్ని యూనివర్సిటీల్లో రాజకీయ జోక్యంతో అర్హత లేని వారిని వీసీలుగా నియమించారు. అలా చేయడం పరోక్షంగా యూనివర్సిటీలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయడమే. రాష్ట్రంలో ఒక ప్రముఖ విశ్వవిద్యాలయానికి నియమితులైన ఓ వీసీకి ఆచార్యుడిగా పేదండ్ల అనుభవం లేదని రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో కేసు దాఖలైన విషయం గమనార్హం. 

ఖాళీల భర్తీ ఎన్నడు?
యూనివర్సిటీల్లో ఖాళీల కొరత వేధిస్తోంది. ఉస్మానియా వర్సిటీలో 848 ఖాళీలు, కాకతీయలో 295, తెలంగాణ వర్సిటీలో 75, మహాత్మాగాంధీలో 115, శాతవాహనలో 110, పాలమూరులో 130, పొట్టిశ్రీరాములు వర్సిటీలో 97, జేఎన్టీయూహెచ్​లో 232 ఖాళీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 4,000, ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో1,650, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 5,154 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం వాటిని భర్తీ చేసే ఆలోచన చేయడం లేదు.  రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడమా? విశ్వ విద్యాలయాలే భర్తీ చేసుకోవడమా అనేది నిర్ణయించకుండా జాప్యం చేస్తోంది. 
ఎన్నికలు సమీపిస్తున్న ప్రతీసారి ఉద్యోగాల భర్తీ అంటూ.. ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండటంతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. గ్రాడ్యుయేట్​ఎమ్మెల్సీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్​ ఎన్నికల సమయాల్లో పలువురు మంత్రులు త్వరలోనే ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనలు చేశారు. ప్రకటన చేసిన ప్రతీసారి నోటిఫికేషన్లు పడతాయేమోనని ఎదురుచూసిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. తాజాగా 91,142 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్​ అసెంబ్లీలో ప్రకటించారు. ఇంతకాలం త్వరలో జాబ్స్​అంటూ ఊరించి.. ఇప్పుడు ఏకంగా 91 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెబుతుండటంతో ప్రభుత్వ మాటలు నమ్మాలా? వద్దా ? అని నిరుద్యోగులు ఆలోచనలో పడ్డారు. - డా.ఇస్తారి అసోసియేట్ ప్రొఫెసర్, కాకతీయ వర్సిటీ