జోష్ హార్మన్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న షార్ట్ హిల్స్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. అతనికి ఆర్ట్స్ మీద ఉన్న ఇష్టంతో డ్రమ్స్ వాయించడం నేర్చుకున్నాడు. 2018లో ఆమ్హెర్స్ట్ కాలేజీ నుండి డిగ్రీ పట్టా అందుకున్నాడు.
ఆ తర్వాత ఏం చేయాలో తోచక కొన్ని నెలలపాటు ఖాళీగానే ఉండిపోయాడు. అప్పుడే అమెరికాకు చెందిన ఒక పెద్ద టీవీ ఛానెల్ ఎన్బీసీ(నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ)లో ఉద్యోగం కోసం అప్లై చేశాడు. అక్కడ ఉద్యోగం వస్తుందని ఏమాత్రం ఊహించలేదు.
కానీ.. అతనికి ఉద్యోగం వచ్చింది. ఆ జాబ్ టీవీ ఇండస్ట్రీలోకి వెళ్లడానికి గోల్డెన్ గేట్వేగా అనిపించింది. క్షణం కూడా ఆలోచించకుండా ఉద్యోగంలో చేరిపోయాడు.
కరోనాతో..
ఏడాది పాటు ఎన్బీసీలో ప్రసారమయ్యే ‘‘టుడే’’, ‘‘ది టునైట్” షోస్ కోసం పనిచేశాడు. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. 2020 మార్చిలో అమెరికాలో చాలా టెలివిజన్ స్టూడియోలు మూసేశారు.
దాంతో.. జోష్ తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. దాంతో తల్లిదండ్రుల దగ్గర ఉంటూనే ‘‘టుడే” షో కోసం న్యూస్‌లెటర్ రైటర్‌గా రిమోట్‌గా పని చేయడం మొదలుపెట్టాడు. అప్పుడే సోషల్ మీడియా ముఖ్యంగా ‘యూట్యూబ్, టిక్‌టాక్’ వాడకం బాగా పెరిగింది.
దాంతో.. జోష్ కూడా సోషల్ మీడియాలో అడుగుపెట్టాడు. వాస్తవానికి మొదట్లో అతనికి సోషల్ మీడియా మీద అంతగా ఆసక్తి ఉండేది కాదు. కానీ.. అతని సోదరుడు జోష్ని ఒప్పించి మొదటి వీడియో పోస్ట్ చేయించాడు.
యూట్యూబ్‌లోకి...
జోష్ 2013లోనే ‘జోష్ హార్మన్’ యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. ఆ తర్వాత కొన్నేండ్లకు ఒకట్రెండు వీడియోలు అప్లోడ్ చేసినా వ్యూస్ రాలేదు. కానీ.. 2020 నుంచి రెగ్యులర్‌గా వీడియోలు పోస్ట్ చేస్తున్నాడు. అతనికి డ్రమ్స్ వాయించే అలవాటు ఉంది.
అందుకే డ్రమ్మింగ్ వీడియోలతోనే సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ వీడియోలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. ప్రతి వీడియోకు రీచ్ బాగా వచ్చింది. దాంతో.. టిక్‌టాక్‌లో ‘‘రిథమ్స్ ఆఫ్ కామెడీ” పేరుతో సొంత సిరీస్ మొదలుపెట్టాడు.
ఇందులో స్టాండ్–అప్ కమెడియన్లు జోక్స్ చెప్తున్న వీడియోలకు డ్రమ్స్ ప్లే చేశాడు. ఆ తర్వాత బాగా జనాదరణ పొందిన సినిమాల నుండి సౌండ్ ఎఫెక్ట్స్‌ను రీ క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు.
‘రాటటౌల్లె’ అనే కామిక్ సినిమాలోని కుకింగ్ సీన్‌కి జోష్ డ్రమ్స్‌ని వాడి సౌండ్స్ క్రియేట్ చేసి ఆ వీడియోని టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. దానికి బోల్డెంత రీచ్ వచ్చింది. అప్పట్లో దానికి ఒక రోజులోనే 43 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 2021 ఫిబ్రవరిలో టిక్‌టాక్‌లో ఆ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆ వీడియోకు173 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
సక్సెస్‌తో..
టిక్‌టాక్‌లో వచ్చిన సక్సెస్‌తో జోష్‌కి డబ్బులు కూడా బాగానే వచ్చాయి. యాడ్ రెవెన్యూతోపాటు బ్రాండ్ డీల్స్ ద్వారా కూడా సంపాదించాడు. దాంతో ఉద్యోగం వదిలేసి పర్మినెంట్‌గా సోషల్ మీడియాలో వీడియోలు చేయాలి అని నిర్ణయించుకున్నాడు. జోష్ చాలా ఇష్టంతో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరితే సొంతంగా ప్రదర్శనలు ఇచ్చే స్థాయికి ఎదగొచ్చు అనుకున్నాడు.
కానీ.. ఎక్కువగా కష్టపడకుండానే టిక్‌టాక్‌లో అది సాధ్యమైంది. అందుకే వెంటనే ఉద్యోగాన్ని వదిలేశాడు. సోషల్ మీడియా తన లక్ష్యాలను సాధించడానికి సరైన మార్గమని నమ్మాడు. ఉద్యోగం మానేసి తర్వాత ఏడాది తిరగకముందే ఉద్యోగం చేసినప్పడు వచ్చే జీతం కంటే రెట్టింపు డబ్బు సంపాదించాడు.
‘రిథమ్స్ ఆఫ్ కామెడీ’ బాగా సక్సెస్ అయ్యింది. ఛానెల్లో మొదటి వీడియో పోస్ట్ చేసిన ఏడాదికే 9,00,000 మంది సబ్‌స్క్రయిబ్ అయ్యారు. యూట్యూబ్‌లో కూడా బ్రాండ్ డీల్స్, యాడ్ రెవెన్యూ మొదలైంది.
కోట్ల వ్యూస్
ప్రస్తుతం జోష్ హార్మన్ ఛానెల్‌ను 7.87 మిలియన్ల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు. ఇతను ఎక్కువగా షార్ట్ వీడియోలే చేస్తుంటాడు. ఇప్పటివరకు ఛానెల్లో మొత్తం 187 వీడియోలు పోస్ట్ చేశాడు. వాటిలో ఐదు వీడియోలకు 250 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంతేకాదు.. 140కి పైగా వీడియోలకు మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఛానెల్లో లక్షలోపు వ్యూస్ వచ్చిన షార్ట్ వీడియో ఒక్కటి కూడా లేదు. జోష్‌కు యూట్యూబ్ నుంచి వచ్చేది చాలా తక్కువే. దాదాపు 85 శాతం ఆదాయం బ్రాండ్స్ నుంచే వస్తుంది.
అతనికి చిన్నప్పటినుంచి కళలంటే ఇష్టం. అందుకే.. ఆర్ట్స్‌లోనే డిగ్రీ చేశాడు. కాలేజీ నుంచి బయటికి వచ్చిన వెంటనే తన టాలెంట్‌తో ఒక పెద్ద టీవీ ఛానెల్లో ఉద్యోగం సంపాదించాడు. కానీ.. అంతలోనే కరోనా ప్యాండెమిక్ వచ్చింది. అదే అతనికి సోషల్‌మీడియాలోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన తెచ్చింది.
ఆ నిర్ణయం జోష్ హార్మన్ జీవితాన్ని మలుపుతిప్పింది. ఉద్యోగం మానేశాడు. ఆ తర్వాత ఏడాది తిరిగేలోపే అతని పాత జీతానికి రెట్టింపు డబ్బు సంపాదించాడు. ఇప్పుడు.. ప్రతినెలా లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు.
చాలా కష్టం
‘‘కంటెంట్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. బెస్ట్ అవుట్‌పుట్ రావాలంటే ఒక్కోసారి ఒకే వీడియో కోసం మూడు నుండి నాలుగు రోజులు పనిచేయాలి. పైగా సోషల్ మీడియాలో రెవెన్యూ రిస్క్ కూడా ఉంటుంది.
యాడ్ రెవెన్యూ ఎప్పుడూ ఒకేలా ఉండదు. అయినా.. నిలదొక్కుకోవాలంటే నాతో పనిచేసేవాళ్లకు శాలరీ ఇవ్వాలి. బెస్ట్ కంటెంట్ ఇచ్చేందుకు ఎప్పుడూ ట్రై చేయాలి” అన్నాడు జోష్ హార్మన్.