రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్

రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్
  •  ఇక షెడ్యూల్​ప్రకారం పరీక్షల నిర్వహణ
  • ఇప్పటికే కసరత్తు పూర్తిచేసిన సర్కారు
  • సీఎం సూచనలతో తుది మెరుగులు
  • షెడ్యూల్​ ప్రకారమే ఆగస్టులో గ్రూప్​ –2

హైదరాబాద్, వెలుగు: మరో ఎన్నికల హామీ అమలుకు కాంగ్రెస్​ సర్కారు రెడీ అయింది. దశాబ్దాలుగా నిరుద్యోగులు కోరుతున్న జాబ్​ క్యాలెండర్ ​విడుదలకు తుది కసరత్తు చేస్తోంది. ఏండ్లకేండ్లు, ఎలక్షన్ల దాకా నోటిఫికేషన్ల కోసం చూడాల్సిన బాధ లేకుండా ఏ యేడాది ఖాళీలను అదే ఏడాది భర్తీ చేయబోతోంది. నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది పక్కాగా క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపట్టాలన్న సీఎం రేవంత్​ ఆదేశాలతో ఆఫీసర్లు జాబ్​ క్యాలెండర్​ సిద్ధం చేశారు. 

 ముఖ్యమంత్రి పలు సూచనలు చేయగా, ఆమేరకు తుదిరూపమిస్తున్నారు. టీజీపీఎస్సీతో పాటు ఆయా రిక్రూట్​మెంట్​బోర్డులు చేపట్టే నియామకాలు, వాటి షెడ్యూల్​ వివరాలన్నింటినీ ఈ జాబ్ క్యాలెండర్ లో పొందుపరుస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నోటిఫికేషన్​ ఇచ్చిన పరీక్షలను యధావిధిగా నిర్వహించనున్నారు. కొత్త పోస్టులు, ఖాళీలు వస్తున్న కొద్దీ.. జాబ్​ క్యాలెండర్​ ద్వారా భర్తీ చేస్తారని సంబంధిత అధికారులు వెల్లడించారు.

6 నెలల్లో జెట్​స్పీడ్​లో రిక్రూట్​మెంట్​ 

టీజీపీఎస్సీ బోర్డు ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసింది. గ్రూప్ –2 పరీక్షను షెడ్యూల్​ ప్రకారం ఆగస్టులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.  గతంలో పెండింగ్ లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను విడుదల చేసింది. ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. 1,540 ఏఈఈ పోస్టులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల పరిశీలన కూడా పూర్తయింది. అగ్రికల్చర్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల సెలెక్టెడ్ లిస్ట్ కూడా విడుదలైంది. 581 వసతి గృహ సంక్షేమాధికారుల పోస్టులకు పరీక్షలు ఈ నెల 29తో ముగిశాయి. 

గతంలో ఎన్నడూ లేని విధంగా 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. టెట్ –2024ను ప్రశాంతంగా నిర్వహించింది. గతంలో నియామకాల్లో అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలోనూ కోర్టు తీర్పులకు అనుగుణంగా ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అనుసరించింది.  అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే 28,942 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించింది. 

టీజీపీఎస్సీతోపాటు మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్​మెంట్​ బోర్డు, పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల ద్వారా వీటిని భర్తీ చేసింది. గత సర్కారు హయాంలో రెండుసార్లు రద్దయిన గ్రూప్– 1 ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి లోటుపాట్లు లేకుండా కమిషన్​ నిర్వహించింది. అందుకు సంబంధించిన కీ కూడా ఇటీవలే విడుదల చేసింది. త్వరలోనే గ్రూప్​–1 ప్రిలిమ్స్​ఫలితాలను వెల్లడించేందుకు కమిషన్​ సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ లో గ్రూప్– 1 మెయిన్స్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. 

కొత్త బోర్డు ఏర్పాటు.. యూపీఎస్సీ, ఇతర బోర్డులపై స్టడీ

రాష్ట్రంలో కీలకమైన ఉద్యోగాలన్నింటీనీ టీజీపీఎస్సీ చేపడుతోంది. దీంతో పాటు పోలీసు నియామకాలకు సంబంధించి పోలీస్ రిక్రూట్​మెంట్​ బోర్డు, గురుకుల టీచర్, సిబ్బంది పోస్టులను రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్​స్టిట్యూషన్స్ ​రిక్రూట్​మెంట్​బోర్డు (టీఆర్ఈఐఆర్బీ), టీచర్ల నియామకాలను విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఖాళీలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్​మెంట్​ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) చేపడుతోంది. ఇలా విభాగాల వారీగా జాబ్​ క్యాలెండర్​ను ప్లాన్​ చేశారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే టీజీపీఎస్సీ పాత  పాలకవర్గాన్ని తప్పించి.. కొత్త చైర్మన్ ను, బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించింది. యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీ పరీక్షల నిర్వహణను కూడా కట్టుదిట్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీకి వెళ్లి యూపీఎస్సీ చైర్మన్ తో చర్చలు జరిపారు. జాతీయస్థాయిలో యూపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు.

 2022 నుంచి టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు 27 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో పేపర్ల లీకేజీలతో 5 ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన రాత పరీక్షలు రద్దయ్యాయి. అప్పుడు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఒక్కటి కూడా వెల్లడి కాలేదు. గత ప్రభుత్వ హయాంలో వివిధ రిక్రూట్​మెంట్​బోర్డుల పరిధిలో ప్రధాన అడ్డంకిగా మారిన కోర్టు కేసుల చిక్కుముడులన్నింటినీ ఒక్కటొక్కటిగా అధిగమించిన ప్రభుత్వం.. ఆ ఫలితాలను కూడా ప్రకటించింది.