క్యాన్సర్‎కు పారాసిటమాల్ వేస్తారా..: దేశంలో ఉద్యోగ సంక్షోభ విపత్తు

క్యాన్సర్‎కు పారాసిటమాల్ వేస్తారా..: దేశంలో ఉద్యోగ సంక్షోభ విపత్తు

దేశంలో రోజురోజుకు నిరుద్యోగం భయంకరంగా పెరిగిపోతుంది. నిరుద్యోగ సమస్య దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా లక్షల్లో విద్యార్థులు గ్రాడ్యుయేట్లు అవుతున్నా.. అందుకు తగ్గ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో విద్యార్థులు నిరుద్యోగులుగా మారిపోతున్నారు. ఏండ్ల తరబడిన చదివిన ఉద్యోగాలు రాకపోవడం, ఇంట్లో ఒత్తిడి, మానసిక ఒత్తిడికి గురై క్వాలిఫికేషన్‎కు తగ్గ ఉద్యోగాలు లేకపోయిన ఏదో ఒక జాబ్ ఉంటే చాలు అన్న భావనలోకి విద్యార్థులు వెళ్లిపోతున్నారు. ఇందులో భాగంగానే బ్యాంక్‎లో చిన్న క్లర్క్ జాబ్ కోసం కూడా ఎంటెక్ అభ్యర్థులు వేల సంఖ్యలో పోటీ పడుతున్నారంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఏ రేంజ్‎లో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్ట్ దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్ధం పడుతోంది. అన్‌మ్యాన్డ్ డైనమిక్స్ కంపెనీ రెండు ఇంటర్న్ షిప్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రెండు ఇంటర్న్‌షిప్‌లకు ఏకంగా 1,200 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కేవలం రెండు ఇంటర్న్‎షిప్ పోస్టుల కోసం 1200 మంది అప్లై చేసుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఈ ఘటన దేశంలో నిరుద్యోగ సమస్య ఎంత ప్రమాదకరంగా మారిందో తెలియజేస్తోందని పలువురు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

Also Read : ఎస్​వీ ఎన్ఐఆర్​టీఏఆర్​లో కన్సల్టెంట్​ పోస్టులు

ఈ క్రమంలోనే ఈ టాపిక్‎పై అన్‌మ్యాన్డ్ డైనమిక్స్ కంపెనీ సీఈవో, చీఫ్ సైంటిస్ట్ శ్రీనాథ్ మల్లికార్జునన్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు లింక్డిన్‎లో ఓ పోస్టు పెట్టిన మల్లికార్జునన్.. దేశంలో పెరిగిపోతున్న ఉపాధి సంక్షోభంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగ సమస్యతో భారత దేశ జనాభా విపత్తు వైపు పయనిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘భారతదేశంలో భారీ ఉపాధి సంక్షోభం ఉందని నేను భావిస్తున్నాను. దీని గురించి మాట్లాడటానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా భయపడుతుంది. మా భారతీయ కార్యాలయంలో 2 ఇంటర్న్‌లకు ఖాళీలు ఉన్నాయి. వాటి కోసం 1,200 మంది దరఖాస్తు చేసుకున్నారు.

 వీరిలో దాదాపు 20 మంది మాత్రమే నెక్స్ట్ రౌండ్ కోసం షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు’’ అని లింక్డిన్ పోస్టులో పేర్కొన్నారు మల్లికార్జునన్. ఈ సందర్భంగా భారత్‎లో నిరుద్యోగ సమస్య అంతకంతకు పెరిగిపోవడానికి కారణాలు, భారతదేశ విద్యా వ్యవస్థలోని నిర్మాణాత్మక లోపాలను ఆయన ఎత్తి చూపారు. ముఖ్యంగా ఐదు అంశాలను మల్లికార్జునన్ ప్రధానంగా ప్రస్తావించారు. అయితే దేశంలో స్టార్టప్‌లు నిరుద్యోగానికి త్వరిత పరిష్కారం చూపిస్తాయనే భావనను మల్లికార్జునన్ తోసిపుచ్చారు. "విరిగిన విద్యా వ్యవస్థకు త్వరిత పరిష్కారాలను అందించే స్టార్టప్‌లు క్యాన్సర్‌కు పారాసెటమాల్ తీసుకోవడం లాంటిది" అని ఆయన అభివర్ణించారు.

1. దేశంలో చాలా మంది ఐఐటీ విద్యార్థులు జేఈఈ పరీక్ష రాసి చదువు మానేస్తారు. దీనివల్ల వారు నిజ జీవితంలో ఉద్యోగాలకు అనర్హులు అవుతారు.  
2. దేశంలోని  ప్రైవేట్ కాలేజీలు, యూనివర్శిటీలు అర్థవంతమైన విద్యను అందించడంలో విఫలమవుతున్నాయి.  
3. ప్రస్తుతం గ్రాడ్యుయేట్లు సరైన జ్ఞానాన్ని పొందకుండానే డిగ్రీలు సంపాదిస్తున్నారు.
4. కాలం చెల్లిన సిలబస్‌లు, అసమర్థ పరీక్షలు, తక్కువ శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో కూడిన విచ్ఛిన్నమైన వ్యవస్థ కారణంగా తాము తప్పుదారి పట్టబడుతున్నామని విద్యార్థులు గ్రహించడం లేదు.
5. ఫలితంగా లక్షలాది మంది గ్రాడ్యుయేట్లు క్వాలిఫికేషన్‎కు తగ్గ ఉద్యోగాలు కాకుండా కాల్ సెంటర్ లేదా క్లరికల్ ఉద్యోగాలతో నెట్టుకొస్తున్నారు. ఈ కారణాలతో దేశంలో ప్రధానంగా అన్‎ఎంప్లాయ్‎మెంట్ పెరిగిపోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. అంతర్జాతీయ పుస్తకాలను అధ్యయనం చేయడం, ఎన్పీటీఈఎల్ కోర్సులను ఉపయోగించడం, ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి స్వతంత్ర ప్రాజెక్టులపై పని చేయాలని ఆయన సూచించారు. 
మల్లికార్జునన్ పోస్టును పలువురు నెటిజన్లు సమర్థిస్తు్న్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడానికి ఆయన లేవనెత్తిన సమస్యలే ప్రధాన కారణమని ఏకీభవించడంతో పాటు కొందరు తమ సొంత అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 

కొందరు నెటిజన్ల అభిప్రాయాలు:

  •  గ్రాడ్యుయేట్లలో ఆచరణాత్మక నైపుణ్యాలు లేకపోవడం నిరుద్యోగానికి కారణం
  •  పాఠశాలల్లో వృత్తి శిక్షణను ప్రవేశపెట్టాలి.
  • భారతీయ సంస్థలు "సర్టిఫికెట్లను జారీ చేస్తాయి కానీ నైపుణ్యాలను కాదు" అని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రెండు ఇంటర్న్ షిప్ పోస్టుల కోసం 1200 మంది అప్లై  చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.