యువత ఉపాధి కోసం మూడంచెల వ్యూహం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

యువత ఉపాధి కోసం మూడంచెల వ్యూహం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో జాబ్‌‌మేళా ప్రారంభం

మధిర, వెలుగు :  తెలంగాణలో యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం మూడంచెల వ్యూహాన్ని అమలుచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని రెడ్డి గార్డెన్స్‌‌లో సోమవారం ఏర్పాటు చేసిన మెగాజాబ్‌‌మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతకు ఉపాధి కల్పించడంలో గత పాలకులు నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రస్తుతం యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో మొదటి దశలో పబ్లిక్‌‌ సర్వీస్‌‌ కమీషన్‌‌ను ప్రక్షాళన చేసి జాబ్‌‌ క్యాలండర్‌‌ విడుదల చేశామని, ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే 56 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, త్వరలోనే మరో 30 వేల పోస్టుల భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతుందన్నారు.

రెండో దశలో బహుళ జాతుల సంస్థలకు రాష్ట్రంలో వనరులు కల్పించి భారీఎత్తున పెట్టుబడులు పెట్టేలా చూస్తామని, వీటి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు సాధిస్తామన్నారు. మూడో దశలో రూ. 9 వేల కోట్లతో రాజీవ్‌‌  యువ వికాసం పథకం కింద జూన్‌‌ 2న స్వయం ఉపాధి యూనిట్ల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తామన్నారు. చదువు పూర్తి చేసుకున్న వారు ఖాళీగా ఉండకుండా జాబ్‌‌మేళాలు ఉపయోగపడుతాయన్నారు.

యువత సంఘ విద్రోహ శక్తులు, మత్తు పదార్థాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. యువతలో స్కిల్స్‌‌ పెంచాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్‌‌గా అప్‌‌గ్రేడ్‌‌ చేశామన్నారు. కార్యక్రమంలో ఇన్‌‌చార్జి కలెక్టర్‌‌ డాక్టర్‌‌ పి. శ్రీజ, కార్యక్రమంలో సింగరేణి జీఎం సాలీం రాజు, ట్రైనీ ఐపీఎస్‌‌ రుత్విక్‌‌సాయి, సీఐ మధు, తహసీల్దార్‌‌ రాంబాబు, కమిషనర్ సంపత్‌‌కుమార్‌‌, మధిర మండల, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సూరంశెట్టి కిశోర్‌‌, మిర్యాల రమణ గుప్తా, మార్కెట్ కమిటీ చైర్మన్‌‌ బండారు నరసింహారావు పాల్గొన్నారు. 

2,325 మందికి ఉద్యోగాలు

మధిరలో సోమవారం ఏర్పాటు చేసిన జాబ్‌‌మేళాకు భారీ స్పందన వచ్చింది. 100కు పైగా కంపెనీలు జాబ్‌‌మేళాలో పాల్గొనగా.. మొత్తం 5,287 మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్‌‌ చేసుకున్నారు. వీరిలో 2,325 మందిని ఎంపిక చేసి నియామక పత్రాలు అందజేశారు. మరో 600 మందికి పైగా సెలెక్ట్‌‌ చేసి సెకండ్‌‌ రౌండ్‌‌కు హాజరుకావాలని సూచించారు.