పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..

పట్నం కొలువు పాయె.. ఊర్ల పనులే ఆసరాయె..

కరోనాతో హైదరాబాద్లో లక్షల జాబ్స్ పోయినయ్
సొంతూళ్లకు వెళ్లి పనులు చేసుకుంటున్న చిరు ఉద్యోగులు
సాంచాలు, మగ్గం పనుల్లోకొందరు.. ఎవుసం చేసుకుంటూ మరికొందరు..

కరోనా ఎఫెక్ట్ తో జాబులు కోల్పోయి లక్షల మంది రోడ్డునపడ్డారు. దీంతో బతుకుదెరువుపోయి, వేలకు వేలు రూమ్ రెంట్లు కట్టలేక హైదరాబాద్ ను విడిచి చాలా మంది సొంతూర్లకు వెళ్లి పోయారు. అక్కడ వాళ్లకు కులవృత్తులు, వ్యవసాయం, కూలి పనులే కూడుపెడుతున్నాయి. ఆ పనులు గిట్టుబాటు కాకున్నా వచ్చిన దాంతో సర్దుకుపోతున్నారు.

హైదరాబాద్, వెలుగు: కరోనా ఎఫెక్ట్ తో అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. లక్షల మంది చిరు ఉద్యోగులు రోడ్డునపడ్డారు. దీంతో కనీసం తినడానికి తిండిలేక, వేలకు వేలు రూమ్ రెంట్లు కట్టలేక హైదరాబాద్ ను విడిచి చాలా మంది సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడ ఇప్పుడు వాళ్లకు కులవృత్తులే కూడుపెడుతున్నాయి. వ్యవసాయం, తాపీ మేస్త్రి వంటి పనులే ఆధారమయ్యాయి. పెద్దగా గిట్టుబాటు కాకున్నా వచ్చిన దాంతో సర్దుకుపోతున్నారు.

లక్షల ఉద్యోగాలు పోయినయ్..
దేశంలోని ప్రధాన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. రాష్ట్రం నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. ఐటీ, ఫార్మా, సినిమా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ తదితర రంగాల్లో భారీగా ఉద్యోగ కల్పన ఉంటుంది. కరోనా ఎఫెక్ట్ తో ఆయా రంగాల్లో లక్షల ఉద్యోగాలు పోయాయి. వీరితోపాటు హోటళ్లలో పనిచేసే వారు, మాల్స్ లోని అసిస్టెంట్లు, బట్టల దుకాణాల్లో పనిచేసేటోళ్లు, సెక్యూరిటీ గార్డులు, ప్రైవేట్ టీచింగ్ ఫ్యాకల్టీ, కూలీలు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, వివిధ షోరూంలలో పనిచేసేవారు, మార్కెటింగ్ ఎగ్జ్ క్యూటివ్స్ .. ఇలా చాలా మంది ఉద్యోగాలు పోయాయి. దీంతో సిటీలో ఉండే పరిస్థితి లేక.. సొంతూళ్ల బాటపట్టారు.

సొంతూళ్లలో ఇంటిపట్టుకు..!
సొంతూర్లకు పోయిన జనాలు అక్కడ ఇతర పనులు దొరకక.. తమ కులవృత్తులనే నమ్ముకొని బతుకుతున్నారు. చేనేత, సాంచాలు, కంసాలి, పొలాల్లో వ్యవసాయ పనులు, పౌరోహిత్యం, కల్లుగీత, టైలరింగ్, ఉప్పరి తదితర కులవృత్తులు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఉపాధి హామీ పనులకు పోతున్నారు. అయితే కరోనా కారణంగా కులవృత్తుల్లో కూడా పెద్దగా డబ్బులు రావడం లేదు. వచ్చిన కాడికి చాలనుకొని.. సొంత ఇంటి పట్టుకు ఉండి పని కొనసాగిస్తున్నారు. సొంతూర్లలో ఉంటే కనీసం ఇంటి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదని, కుల వృత్తితోనైనా కడుపు నింపుకోవచ్చని, అదే ఈ టైంలో హైదరాబాద్ లో ఉంటే పైసా పని ఉండకున్నా ఎదురు పెట్టాల్సిందేనని పలువురు అంటున్నారు.

పౌరోహిత్యం చేసుకుంటున్న..
హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేసేవాడ్ని. కరోనా కంటే ముందు.. రోజుకు రూ. 1,000 నుంచి 1,200 వచ్చేవి. లాక్ డౌన్ తో మూడు నెలలపాటు అసలు పనే లేదు. లాక్ డౌన్ తర్వాత కూడా కరోనా భయంతో క్యాబ్ ఎవరూ ఎక్కడం లేదు. వ్యక్తిగత ప్రయాణాలకే ప్రయారిటీ ఇస్తున్నరు. కనీసం బండి ఈఎంఐలకు కూడా గిట్టు బాటు కావడంలేదు. దీంతో కారు అమ్మేసి, సొంతూరుకు వచ్చి పౌరోహిత్యం చేసుకుంటున్న. పెద్దగా గిరాకీలు లేవు. చిన్నచిన్న కార్యాలు చేసుకుని వెళ్లదీస్తున్న. – టంగుటూరి సతీశ్ వర్మ, షాద్ నగర్

పొలం పని చేస్తున్న
నేను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడ్ని. కరోనా ఎఫెక్ట్ తో అకస్మాత్తుగా జాబ్ నుంచి తీసేశారు. దీంతో ఏం చేయాలో తెలియక సొంతూరికి వచ్చిన. ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న. చేతిలో ఒక్క పైసా లేదు. వేసిన పంట పండి.. అది అమ్మే
వరకు నా పరిస్థితి అంతే. కరోనాతో చిరు ఉద్యోగుల జీవితాలన్నీ ఆగమయ్యాయి. సర్కార్ పట్టించుకోవాలె. – తేజ రామన్న, వరంగల్ రూరల్

కూలీగా చేస్తున్న
నేను బీఎస్సీ, బీఎడ్ పూర్తి చేశాను. ఇన్నాళ్లు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో సైన్స్ టీచర్ గా పనిచేశాను. ప్రస్తుతం జీతం ఇస్తలేరు. ఇల్లు గడుస్తలేదు. ఏం చేయాలో అర్థం కాక.. మా ఊరిలోనే ఓ మేస్త్రి దగ్గర కూలీ పనికి వెళ్తున్న. అప్పుడు నాకు వచ్చిన శాలరీకి.. ఇప్పుడు నేను చేసే పని, వచ్చే డబ్బులకు చాలా తేడా ఉంది. అయినా తప్పడం లేదు.
– అశోక్, స్టేషన్ ఘన్పూర్

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు మంచాల సాయిరాం. కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం గట్టు భూత్కూర్. హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. కంపెనీకి రోజూ బస్సు , మెట్రోలో వెళ్లి వచ్చేవాడు. కరోనా కారణంగా వాళ్ల కంపెనీని తాత్కాలికంగా మూసేశారు. ఉద్యోగులందరినీ ఇంటినుంచే పనులు చేయాలని కంపెనీవాళ్లు చెప్పారు. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూరుకు వచ్చాడు. ఇక్కడి నుంచే కంపెనీ పనులు చేస్తున్నా.. పూర్తి జీతం రావడం లేదు. అందుకే ఖాళీ టైంలో సాంచాలు నడుపుతున్నాడు.

ఈ ఫొటోలోని వ్యక్తి పేరు చింతల విష్ణు వర్ధన్. కరీంనగర్ జిల్లా చొప్పదండి. ఎంటెక్ చేసిండు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఐదేండ్లు సైట్ మేనేజర్గా ఉన్నడు. కరోనా ఎఫెక్ట్ తో కంపెనీలో చాలా మందిని తగ్గించారు. జాబ్ పోవడంతో పాటు ప్రస్తుతం కొత్త కొలువు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో హైదరాబాద్ నుంచి సొంతూరికి వచ్చాడు విష్ణు వర్ధన్. తనకున్న ఆరెకరాల భూమితో పాటు ఇంటి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయల సాగు చేస్తున్నాడు.

For More News..

కరోనా ఎఫెక్ట్: స్కూల్ సిలబస్ లో 30% తగ్గింపు

సెక్రటేరియట్ నిర్మాణం దసరా నుంచి!