కోచింగ్ సెంటర్లను ప్రభుత్వం నియంత్రించాలె

రాష్ట్రంలో ఉద్యోగుల భర్తీకి ప్రకటన వెలువడటంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే 30 వేల పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. మిగతా పోస్టులకు కసరత్తు ప్రారంభమైందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతుండటంతో నిరుద్యోగులు పట్నం బాట పట్టారు. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ప్రకటన ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అందుకే దీన్ని ఆఖరి అవకాశంగా భావించి పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. ఇదే అదనుగా కోచింగ్ సెంటర్లు నిరుద్యోగుల పాలిట జలగల్లా మరుతున్నాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే అభ్యర్థుల తపనను అవి క్యాష్ చేసుకుంటున్నాయి.

ఫీజుల దోపిడీ

షార్ట్​టర్మ్​, లాంగ్​టర్మ్​ కోచింగ్​లు అంటూ వేలకు వేలు ఫీజులు గుంజుతున్నాయి. దిల్ సుఖ్ నగర్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని గ్రూప్ 1,2, డీఎస్సీ, ఎస్ఏ, కానిస్టేబుల్ లాంటి ప్రధాన కోచింగ్ సెంటర్ల దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయింది. తమ ఇష్టానుసారంగా అన్ని రకాల కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు 20 నుంచి 25 శాతం ఫీజులు పెంచేశాయి. ఉదాహరణకు మొన్నటి వరకు కానిస్టేబుల్ కోచింగ్ ఫీజు రూ.10 వేలు ఉంటే తాజాగా దాన్ని రూ. 15 వేల నుంచి18 వేలకు పెంచారు. దీంతో నిరుద్యోగులు ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకరిద్దరు ఆత్మహత్యలకు పాల్పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. 

వసతులు లేక..

పెంచిన ఫీజులకు అనుగుణంగా కనీస వసతులైన పెంచారా.. అంటే అదీలేదు. రాష్ట్ర ప్రభుత్వ, జీహెచ్​ఎంసీ అనుమతులు లేకున్నా..  కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒక్కో బ్యాచ్ కి 800 నుంచి1000 మందిని రూమ్​లో కుక్కి వందల కోట్లు దండుకుంటున్నాయి. అంతమందికి రెండు మూడు టాయిలెట్స్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. గాలి, వెలుతురు లేని రూమ్​లు, గంటల తరబడి ఒకే గదిలో క్లాసులతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కోచింగ్​సెంటర్లను నియంత్రించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అనుమతి, వసతులు లేని, ఫీజులు దోచుకునే కోచింగ్ సెంటర్లను మూసివేయాలి. 

:: గడ్డం శ్యామ్, పీడీఎస్​యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు