
న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్) అభ్యర్థులకు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్ట్ పద్దతిలో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు.. ఏప్రిల్ 29 నుంచి ఇస్రో అధికారిక వెబ్‌సైట్ www.isro.gov.inలో ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ చివరి తేదీ 2025,19 మే. దరఖాస్తు రుసుమును 2025, మే 21 వరకు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు ఇస్రో NCS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే స్వీకరించబడతాయి. ఇంటర్వ్యూ సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పకుండా తీసుకెళ్లాలి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని తెలిపింది.
ఖాళీల వివరాలు..
- శాస్త్రవేత్త/ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్)- 22
- శాస్త్రవేత్త/ఇంజనీర్ (మెకానికల్)-33
- శాస్త్రవేత్త/ఇంజనీర్ (కంప్యూటర్ సైన్స్)-08
ఉద్యోగ అర్హతలు..
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో ఎలక్ట్రానిక్స్/కంప్యూటర్ సైన్స్/మెకానికల్‌లో BE/BTech డిగ్రీని కనీసం 65 శాతం లేదా 6.84 CGPA కలిగి ఉండాలి. దీంతో పాటు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కార్డ్‌ను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాల భర్తీకి కనీస అర్హత గేట్ స్కోర్ కార్డ్ చాలా ముఖ్యమైనది. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థులు కనీసం 60 మార్కులు సాధించాలి.
ఏజ్, శాలరీ వివరాలు:
వయోపరిమితి: ఇస్రోలో సైంటిస్ట్, ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల కనీస వయస్సు 18 సంవత్సరాల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: ఎంపికైన అభ్యర్థులను పే మ్యాట్రిక్స్ లెవల్ 10లో సైంటిస్ట్/ఇంజనీర్ (SC) పోస్టుకు నియమిస్తారు. వారికి నెలకు కనీసం రూ. 56,100 జీతం, డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ మరియు రవాణా భత్యం చెల్లిస్తారు.
అప్లికేషన్ ఫీజు: అన్‌రిజర్వ్డ్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 250. SC/ST/PH, మహిళా అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు రుసుము సమర్పించాలి.