కారుణ్యం ద్వారా 1708 మందికి ఉద్యోగాలు : ఎ.మనోహర్

కారుణ్యం ద్వారా 1708 మందికి ఉద్యోగాలు : ఎ.మనోహర్

కోల్​బెల్ట్, వెలుగు: మందమర్రి ఏరియాలో మెడికల్​ ఇన్వాలిడేషన్​(కారుణ్యం) ద్వారా 1708 మంది కార్మిక వారసులకు ఉద్యోగాలు కల్పించామని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎ.మనోహర్​అన్నారు. మెడికల్​ఇన్వాలిడేషన్​ ద్వారా ఉద్యోగాలు పొందిన యువతీయువకులకు బుధవారం స్థానిక జీఎం ఆఫీస్​కాన్ఫరెన్స్​హాల్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయినింగ్​ఆర్డర్స్​ అందజేశారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. నాగాలు లేకుండా క్రమశిక్షణతో డ్యూటీలు చేయాలన్నారు. ఉన్నత స్థాయికి చేరుకొని సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ కార్పొరేట్​ చర్చల ప్రతినిధి సలెంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, అధికారుల సంఘం ప్రెసిడెంట్ రమేశ్, పర్సనల్​ మేనేజర్​ శ్యాంసుందర్, డీవైపీఎం మైత్రేయబంధు తదితరులు పాల్గొన్నారు. 

శ్రీరాంపూర్ ఏరియాలో 13మందికి..

నస్పూర్: సింగరేణి కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని శ్రీరాంపూర్ జీఎం సంజీవ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో కారుణ్య నియామకం పొందిన 13మంది యువతీ యువకులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ కారుణ్య నియామకాలు చేపడుతూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోందని, విధులు సక్రమంగా నిర్వహిస్తూ, క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకోవాలని సూచించారు. ఏఐటీయుసీ లీడర్లు బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఆఫీసర్ల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్వోటు జీఎం పురుషోత్తమ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.