సింగరేణిలో రిటైర్డు ఆఫీసర్లకు ఉద్యోగాలు

  • ఎంవీటీసీల్లో నియామకాలకు యాజమాన్యం సర్క్యులర్   
  • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైనింగ్​ సిబ్బంది
  • అనుభవజ్ఞులు ఉండగా రిటైర్డ్ ఉద్యోగులు ఎందుకని ప్రశ్న 
  • ప్రైవేటీకరణకు  కుట్రచేస్తున్నారని ఉద్యోగ సంఘాల ఫైర్
  • సింగరేణివ్యాప్తంగా  నిరసనలు

కోల్​బెల్ట్, వెలుగు : ఇప్పటికే ఆఫీసర్లు, బయటి వ్యక్తులను సలహాదారులుగా నియమించి ఒక్కొక్కరికి రూ.లక్షల్లో వేతనాలు అందిస్తున్న సింగరేణి యాజమాన్యం మరో నిర్ణయం తీసుకుంది. సింగరేణి మైన్స్​ ఒకేషనల్  ట్రైనింగ్​ సెంటర్ల (ఎంవీటీసీ) లో ఉన్న ఖాళీలను భర్తీచేసేందుకు రిటైర్డ్  మైనింగ్ ఆఫీసర్లకు మళ్లీ అవకాశం కల్పిస్తూ యాజమాన్యం ఓ సర్క్యులర్​ జారీ చేసింది. సింగరేణిలో ఎంతో మంది అనుభవజ్ఞులైన మైనింగ్​ ఆఫీసర్లు ఉన్నా వారి సేవలను కాదని రిటైర్డ్  ఆఫీసర్లను తిరిగి నియమించాలన్న యాజమాన్యం చర్యలను కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి వల్ల సంస్థకు మరింత ఆర్థిక భారమంటున్నారు. 

తాజాగా జారీచేసిన సర్క్యులర్​తో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 9 ఎంవీటీసీల్లో సుమారు 120 మంది వరకు రిటైర్డ్  మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్​ ఆఫీసర్లతో పాటు ఓవర్​మెన్, ఫోర్​మన్లను తీసుకునే చాన్స్​ ఉందని కార్మిక సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఎంవీటీసీని ప్రైవేటీకరించే కుట్రలో భాగంగానే ఔట్​సోర్సింగ్  పద్ధతిలో రిటైర్డ్  ఆఫీసర్లను మళ్లీ తీసుకుంటున్నారని, వారు వస్తే  సంస్థలో పనిచేస్తున్న మైనింగ్​ స్టాఫ్​ ఉద్యోగుల భద్రత ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం తాజాగా తీసుకున్న ఉపసంహరించుకోవాలని  డిమాండ్​ చేస్తూ  సింగరేణి వ్యాప్తంగా ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపడుతున్నారు.   

ఉద్యోగుల శిక్షణకు ఎంవీటీసీలు

సింగరేణి వ్యాప్తంగా తొమ్మిది ఏరియాల్లో ఎంవీటీసీ కేంద్రాలు ఉన్నాయి.  కొత్తగా సంస్థలో ఉద్యోగంలో చేరే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అందులో ట్రైనింగ్​  పొందాల్సి ఉంటుంది. ఈ కేంద్రంలో అనుభవజ్ఞులైన మైనింగ్, మెకానికల్, ఎలక్ర్టికల్​ ఆఫీసర్లతో పాటు ఓవర్​మెన్​, ఫోర్​మన్​లు  శిక్షణ ఇస్తుంటారు.​కొత్తగా డ్యూటీల్లో చేరే ఉద్యోగానికి అనుగుణంగా చేపట్టే పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సేఫ్టీ చర్యలపై వివిధ దశాల్లో నెలరోజుల పాటు శిక్షణ ఇస్తారు. అండర్​గ్రౌండ్​ బొగ్గు గనులు, ఓసీపీలు, డిపార్ట్​మెంట్లలో ఉండే పరిస్థితులపై ప్రాక్టికల్, థియరీ పద్ధతిలో ఎంవీటీసీలో అవగాహన కల్పిస్తారు. పాత ఉద్యోగులకు సైతం కాలపరిమితికి అనుగుణంగా శిక్షణ ఇస్తారు. 

రిటైర్డు ఆఫీసర్లను అందలమెక్కించేందుకు

సింగరేణిలో ఇప్పటికే రిటైర్డ్  ఆఫీసర్లు, బయట వివిధ హోదాల్లో కొనసాగిన వారిని  అడ్వైజయిర్లగా  నియమించి ఏటా  లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం  మైనింగ్, మెకానికల్, ఎలక్ర్టికల్​, ఫారెస్టీ, జైపూర్​ ఎస్టీపీపీ, ఈఆర్​పీ, లీగల్​ తదితర విభాగాలకు  అడ్వైజర్లు ఉన్నారు. తాజాగా మళ్లీ రిటైర్డ్  మైనింగ్, టెక్నికల్ ఆఫీసర్లను పొరుగుసేవల ద్వారా ఎంవీటీసీల్లో  ట్రైనింగ్​ ఆఫీసర్​, అసిస్టెంట్​ ట్రైనింగ్​ ఆఫీసర్​, ఇన్​స్ర్ట్రక్టర్లుగా నియమించాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. కొందరు ఆఫీసర్లు  ఎంవీటీసీల్లో పనిచేస్తూ ఇటీవలే  రిటైర్  అయ్యారు. ఎంవీటీసీల్లో ఖాళీలను సాకుగా చూపుతూ రిటైర్  అయిన వారినే తిరిగి నియమించేలా సంస్థలోని కొందరు పెద్దలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సర్క్యులర్​  జారీ చేయించారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.  

సీనియర్లకు చాన్స్​ కల్పించాలె

సింగరేణిలో మైనింగ్, ఎలక్ర్టికల్, మెకానికల్  విభాగాల్లో సుమారు 5,500 మంది వరకు పనిచేస్తున్నారు. స్టాట్యుటరీ సర్టిఫికెట్​ ఉన్న ఫస్ట్ క్లాస్​ మైన్​ మేనేజర్​ సర్టిఫికెట్ ఎఫ్ఎంఎంసీ), సెకండ్​ క్లాస్​ మైన్​ మేనేజర్​ సర్టిఫికెట్(ఎస్ఎంఎంసీ)  కలిగిన అనుభవజ్ఞులైన వారు ఉన్నారు. వారితో పాటు 2012 నుంచి పలువురు మైనింగ్​ స్టాఫ్ అనారోగ్యం, ఇతర కారణాలతో​ అండర్​గ్రౌండ్​లో అన్​ఫిట్​ అయి, సర్ఫేస్​లో హోదా కోల్పోయి జనరల్​ మజ్దూర్లు (కార్మికులు) గా పనిచేస్తున్నారు. వారంతా ఎంవీటీసీల్లో ఆఫీసర్లుగా సేవలు అందించేందుకు అర్హులే. 

వారందరిని కాదని సింగరేణి యాజమాన్యం రిటైర్డు ఆఫీసర్లను ఎంవీటీసీల్లో నియమించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. సర్వీసులో ఉన్న సీనియర్లకు అవకాశం కల్పిస్తే సూటబుల్​ జాబ్ తో పాటు హోదా సైతం దక్కుతుందని పేర్కొంటున్నారు. అదనంగా వేతనం ఇవ్వాల్సిన అవసరం కూడా 
ఉండదన్నారు. 

ఎంవీటీసీలను ప్రైవేటుపరం చేసే కుట్ర

డిపార్ట్​మెంట్లను ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా ఎంవీటీసీలో ఔట్​సోర్సింగ్ ద్వారా రిటైర్డు ఆఫీసర్లకు  చాన్స్​ ఇస్తున్నారు. సర్వీసులో ఉండి సర్ఫేస్​లో జనరల్​మజ్దూర్లుగా పనిచేస్తున్న  సీనియర్​ మైనింగ్​ సూపర్ వైజర్లకు  ఎంవీటీసీల్లోని ఖాళీల్లో  అవకాశం ఇవ్వాలె. 
- వంగ రాజేశ్వర్​రావు, రీజియన్​ మైనింగ్​  స్టాఫ్​  ఇన్ చార్జి