నాణ్యమైన చదువులకు నైపుణ్యాలు తోడైతేనే ఉద్యోగాలు

ఆకాశమే హద్దుగా ప్రపంచం శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాల అస్త్రాలతో దూసుకుపోతున్నది. డిజిటలీకరణ, యాంత్రీకరణ, కృత్రిమ మేధ విజృంభణలతో పాలనలో, ఉద్యోగ విపణిలో శరవేగంగా మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత కాలపు విధానాలకు, కొన్ని కొలువులకు క్రమేణా నూకలు చెల్లిపోతున్నాయి. ఇదే సమయంలో మానవుల వ్యక్తిగత సృజనాత్మకత, వినూత్నతకు గుణాత్మక నైపుణ్యాలు జోడిస్తూ నవీన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఇలాంటి అత్యున్నత నైపుణ్యాలు  లేని వారు  ఉద్యోగ, ఉపాధి, జీవనోపాధి వేటలో వెనుకబడిపోతున్నారు. దేశంలో స్థూలం(నికరం)గా 40 రకాల విభిన్న సామర్థ్య రంగాల్లో ఐదు వేల రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా 93 శాతం విద్యార్థులకు, యువతకు తెలిసినవి వృత్తిపరమైన ప్రత్యామ్నాయాలు కేవలం ఏడేనని ఓ సర్వేలో తేలింది. దేశంలో ప్రాథమిక విద్య నుంచి యూనివర్సిటీ విద్య వరకు వృత్తి విద్యా కోర్సుల్లో నైపుణ్యాల కల్పనలో పాలకులకు చిత్తశుద్ధి లోపించింది. ఇది విద్యార్థులు, నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. వృత్తి విద్యపై నిర్లక్ష్యంతో పాటు పరిశ్రమలతో అనుసంధానంలో మందగమనం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు, అభివృద్ధిలో తగిన కృషి జరగడం లేదు.
మార్పునకు అనుకూలత: చేస్తున్న సంస్థల్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను స్వాగతించే వారిలో ముందుకు ఉండగలగాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగలగాలి. స్వీకరించే స్వభావం, విశాల దృక్పథం, కుతూహలం, కొత్త విషయాలపై ఆసక్తి గల వారు రాబోవు అడ్డంకులను దూరదృష్టితో ఛేదించగలరని ఉద్యోగాలు ఇచ్చే సంస్థలు భావిస్తున్నాయి.

డిజిటల్ లిటరసీ: ఉద్యోగి రోజువారి విధుల్లో సాంకేతిక ఉపకరణాలు, సాఫ్ట్​వేర్ లను సురక్షితంగా ఉపయోగించే నేర్పు, సామర్థ్యాల్ని పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. వీరు సులువుగా భావ వ్యక్తీకరణ చేస్తూ కొత్త సాంకేతికతను అందిపుచ్చుకొని సమర్థతతో వేగంగా కచ్చితంగా పనులు చేయగలరని నియామక సంస్థలు భావిస్తున్నాయి.

నాయకత్వ లక్షణాలు: ఓ సంస్థలోని ఉన్నత ఉద్యోగులకు మాత్రమే ఈ లక్షణాలు ఉంటే సరిపోదు. ఇది ప్రతి ఉద్యోగికి అవసరమైన నైపుణ్యం. బృందంలోనైనా భిన్న సంస్కృతుల వ్యక్తులు ఉన్న చోటనైనా ఇమడాలంటే విభిన్నంగా ఆలోచిస్తూ బహుళజాతి సంస్థల్లో ఒక ప్రాజెక్టును బృందం లేదా వివిధ విభాగాల్లోనైనా నిర్ణీత గడువులోపు ఆశించిన లక్ష్యాన్ని చేరేలా ప్రోత్సహించుకుంటూ పోవడంలో నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు గలవారి అవసరం ఆయా సంస్థలకు ఎంతో  ఉంది. 

సృజనాత్మకత: ఉద్యోగులు రోజువారి పనులను యంత్రాల సాయంతో సులభంగా వేగంగా చేయవచ్చు కానీ సృజనాత్మకంగా ఆలోచించగలగడం ఒక మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది. సమస్యలను విభిన్నంగా పరిష్కరించడంం, మూస ధోరణికి భిన్నంగా ఆలోచించ గలగడం లాంటివి ఈ సృజనాత్మక నైపుణ్యాల కిందకు వస్తాయి. ఇలా ఆలోచించగలిగే వారు ఏ రంగంలో ఉన్నా ఎంత  మందిలో ఉన్నా తమ ప్రత్యేకతను, గుర్తింపును సొంతం చేసుకోగలుగుతారు. సృజనాత్మకంగా ఆలోచించేవారి ప్రతిభ కూడా సరిహద్దులు దాటి విస్తరిస్తుంది. అలాంటి వాళ్లనే ఉద్యోగ నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. 

భావోద్వేగ ప్రజ్ఞ: ఈ ప్రజ్ఞ ఉన్నవారు అభిప్రాయాలను వ్యక్తం చేయాలన్నా పరిస్థితులకు అనుగుణంగా తమని తాము నియంత్రించుకోవాలన్నా స్వీయ ఉద్వేగాలు తమపైన చుట్టూ ఉన్న వారి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థం చేసుకోగలుగుతారు. అందువల్ల ఉద్వేగాలను అదుపులో ఉంచుకొని పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించగలుగుతారు. అంతేకాదు ఎదుటివారి దృష్టి కోణాన్ని అర్థం చేసుకొని సానుభూతిని పెంచుకోగలుగుతారు. ఈ ప్రజ్ఞ ఉంటే సమస్యను తమ కోణం నుంచి కాకుండా, ఇతరుల దృష్టి కోణం నుంచి చూడగలిగే నేర్పు అలవడుతుంది. ఉద్యోగిలో బాధ్యత నైపుణ్యాలను పెంచుతుంది. 

నిరంతర అభ్యాస-కుతూహలం: ఈ నైపుణ్యం వయసు, పనిచేసే రంగాలతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే. నేర్చుకోవాలన్న తపన ఉంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎవరిని వారు తీర్చిదిద్దుకోగలుగుతారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగాలను పదోన్నతులను సొంతం చేసుకోగలుగుతారు. ఎన్ని అర్హతలు, అనుభవాలు గడించినా కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన లేకపోతే మొదలు పెట్టిన చోటే ప్రయాణం నిలిచిపోతుంది. ఈ నైపుణ్యం ఉన్నవాళ్లు మాత్రమే అడ్డంకులను అధిగమించి అవకాశాలను సృష్టించుకోగలుగుతారు. ఉద్యోగార్థులు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో ఉద్యోగం సాధించాలంటే అకడమిక్ అర్హత, వృత్తి విద్య నైపుణ్యాలతో పాటు అదనంగా మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు, యంత్రాలకు కూడా అసాధ్యమైన సాఫ్ట్ స్కిల్స్ ను వృద్ధి చేసుకొని ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా ప్రభుత్వాలు శిక్షణలు, నైపుణ్యాలను అందిస్తూ నిరుద్యోగులకు అండగా నిలబడాలి. ప్రాథమిక స్థాయి నుంచి నాణ్యతతో కూడిన విద్యను అందిస్తూ వృత్తి విద్యను పరిశ్రమలకు అనుసంధానం చేసి ఉద్యోగ, ఉపాధులను కల్పించి నిరుద్యోగాన్ని తరిమివేయాలి. ఊక దంపుడు ఉపన్యాసాలు మాని పాలకులు నాణ్యమైన విద్యతోపాటు, ఉద్యోగాలు కల్పించి చిత్తశుద్ధితో అమలు చేయాలి.

శిక్షణా కేంద్రాలు అవసరం
అంతర్జాతీయ నైపుణ్యాల సాధనలో విద్యాలయాల్లో సౌలత్​ల కల్పన కీలకం. కానీ దేశ విద్యాలయాల్లో ల్యాబ్​లు, కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు సుమారు 40 శాతం మాత్రమే ఉన్నాయి. పాఠ్య ప్రణాళిక, బోధన పద్ధతుల్లో పాత మూస విధానాలే కొనసాగుతున్నాయని ప్రపంచ ఆర్థిక నివేదిక, నిరుటి జాతీయ సాధన సర్వేలు చెబుతున్నాయి. మన దేశ విద్యా ప్రమాణాలు, నైపుణ్యాల మీద జాతి జనుల విశ్వాసాలు క్రమేణా సన్నగిల్లుతున్నాయి. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇలాంటి వేళ అంతర్జాతీయ నైపుణ్యాలు ఆశించడం ఎలా సాధ్యమవుతుంది? అందుకే యువ మానవ వనరులకు నైపుణ్యాలు చేకూరేలా శిక్షణా కేంద్రాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది.  రాబోయే పదేండ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ వృత్తి విద్య పూర్తి చేసిన తర్వాత వెంటనే ఉద్యోగాలను సంపాదించాలనుకునేవారు అసలు ఉద్యోగ నియామక సంస్థలు ఏయే నైపుణ్యాలు ఉన్నవారి కోసం అన్వేషిస్తున్నాయనేది గ్రహించాలి. ఇలాంటి అంశంపై ఫోర్బ్స్ తాజా అధ్యయనం ప్రకారం ఆటోమేషన్ విస్తృతమవుతున్న ప్రస్తుత స్థితిలో ఉద్యోగాలు పొందటం కోసం సాంకేతిక నైపుణ్యాలతో పాటు మారుతున్న అవసరాలకు అనుగుణంగా సాఫ్ట్ స్కిల్స్ ను నేర్చుకోవాలి. 
- మేకిరి దామోదర్, సోషల్ ఎనలిస్ట్