చిన్న తప్పులకే జాబ్​ నుంచి తొలగించారు

చిన్న తప్పులకే జాబ్​ నుంచి తొలగించారు
  • తిరగాల్సిన బస్సులను తుక్కు చేయించారు 
  • తొలగించిన కార్మికుల ఆరోపణ

ఖైరతాబాద్, వెలుగు: టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ అవినీతికి పాల్పడుతున్నారని సంస్థ మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఆయన తీరుతో ఆర్టీసీ సంస్థ మనుగడ ప్రశ్నార్థకమవుతోందని, తీరని నష్టం జరుగుతోందని చెప్పారు. 2 లక్షల కిలో మీటర్లు తిరగాల్సిన బస్సులను తుక్కు చేయించారన్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు కనీసం అనుమతించడం లేదని వాపోయారు.

 కార్మికుల సమస్యలను వినని వ్యక్తి ఎండీగా ఎందుకని ప్రశ్నించారు. సజ్జనార్​ను ఆర్టీసీ నుంచి బదిలీ చేసి, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్​చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్​జిష్ణు దేవ్​వర్మ, లోకా యుక్తాకు ఫిర్యాదు చేశామని ఆర్టీసీ సెక్యూరిటీ వింగ్​లో పనిచేసిన మాజీ ఉద్యోగి దుగ్గు రాజేందర్ తెలిపారు. 

డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్​లుగా పనిచేస్తున్న దాదాపు 600 మందిని బీఆర్ఎస్​హయాంలో  చిన్న చిన్న  కారణాలతో తొలగించారని వాపోయారు.  కాంగ్రెస్​ప్రభుత్వం వారిలోని 200 మందికి తిరిగి ఉద్యోగాలు ఇచ్చిందని, మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతూ మంగళవారం 50 మంది మాజీ ఉద్యోగులు సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశం నిర్వహించారు.

 చిన్న చిన్న తప్పులకు తమను  సర్వీస్​ నుంచి రిమూవ్​ చేస్తున్నారని మాజీ కండక్టర్లు రాజు, అంబిక, రజిత, శోభారాణి, డ్రైవర్లు ప్రవీణ్, మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం లేక పిల్లలకు తిండి పెట్టలేని స్థితిలో ఉన్నామని, సీఎం పరిశీలించి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.