- ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల కుంభకోణం
- ఖనిలో హైడ్రామా ..ఫ్యాక్టరీ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్
- కాంగ్రెస్, బీజేపీ లీడర్ల హౌస్ అరెస్ట్ లు.. అడ్డగింతలు
- ఎమ్మెల్యేను క్యాంపు ఆఫీసు దాటనివ్వని పోలీసులు
- చర్చకు వస్తున్న తీన్మార్ మల్లన్న అరెస్ట్
గోదావరిఖని, వెలుగు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్) ఫ్యాక్టరీ గురువారం పోలీసుల వలయంలో చిక్కుకుంది. ఫ్యాక్టరీ వద్దకు కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులు, ఆఫీసర్లు మినహా ఎవరిని అనుమతించకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని చెప్పి రూ.లక్షలు వసూలు చేసి మోసం చేసిన దళారులు రామగుండం ఎమ్మెల్యే అనుచరులని, ఇందులో ఆయన హస్తం ఉందని ప్రతిపక్షాలు, తీన్మార్ మల్లన్న ఆరోపించగా, స్పందించిన ఎమ్మెల్యే గురువారం ఫ్యాక్టరీ దగ్గరే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఇందుకు స్పందించిన ప్రతిపక్షాలు, తీన్మార్ మల్లన్న ఫ్యాక్టరీ వద్దకు చేరుకోవడానికి ప్రయత్నించగా పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కూడా తన అనుచరులతో ఫ్యాక్టరీ వద్దకు వెళ్లడానికి ప్రయత్నించగా ఆయనను, అనుచరులను క్యాంపు ఆఫీస్ నుంచి బయటకు రాకుండా పోలీసులు గేట్‌కు తాళం వేశారు. మొత్తంగా ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో కాంట్రాక్టు ఉద్యోగాల విషయంలో బహిరంగ చర్చ జరగకపోగా, బాధితులు తమకు న్యాయం జరుగుతుందని ఆశించి భంగపడ్డారు.
హౌస్ అరెస్ట్‌లు...అడ్డగింతలు
రామగుండం ఎరువుల కర్మాగారంలోని యూరియా బ్యాగ్‌ల లోడింగ్, డిస్పాచ్, బ్యాగింగ్, స్టిచ్చింగ్, బెల్ట్ సెక్షన్, హౌజ్ కీపింగ్ తదితర లొకేషన్లలో కాంట్రాక్టు కార్మికులుగా పనులు చేసేందుకు వందలాది మంది నుంచి రూ.కోట్లు వసూలు చేశారని, ఇందులో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అనుచరులున్నారని ప్రతిపక్ష పార్టీల లీడర్లు ఆరోపించారు. అయితే ఇందులో తన ప్రమేయం లేదని, ఉంటే నిరూపించండి అంటూ ఎమ్మెల్యే చందర్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. గురువారం ఉదయం అందరూ ఆర్‌ఎఫ్‌సీఎల్ గేట్ ముందు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. అయితే శాంతిభద్రతల సమస్య తలెత్తుందని పోలీసులు ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలతో పాటు మూడు కిలోమీటర్ల వరకు 144 సెక్షన్ విధించారు. ఫ్యాక్టరీకి వెళ్లే దారిలో ఉన్న గౌతమీనగర్, లక్ష్మీపురం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి వచ్చిపోయే వారిని ఆపేశారు. కార్మికులు, ఉద్యోగులను మాత్రమే అనుమతించారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం నుంచే ప్రతిపక్ష లీడర్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్ లీడర్లు ఎంఎస్ రాజ్‌ఠాకూర్, మహాంకాళి స్వామి, బొంతల రాజేశ్, పెద్దెల్లి ప్రకాశ్, ముస్తఫా, బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఇతర లీడర్లు బయటకు రాకుండా వారి ఇండ్ల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితులతో కలిసి ఫ్యాక్టరీకి వెళ్లేందుకు ప్రయత్నించిన మజ్దూర్ యూనియన్ లీడర్ అంబటి నరేశ్, మరికొంతమందిని అరెస్ట్ చేసి గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఫ్యాక్టరీ గేట్ వద్దకు కాంగ్రెస్ క్యాడర్‌తో బయలుదేరిన మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌ను ఆయన ఇంటివద్దనే అడ్డుకోగా, ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. కాగా తీన్మార్ మల్లన్నతో పాటు ప్రతిపక్షాల సవాల్‌కు స్పందించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఉద్యోగాల కుంభకో ణంపై చర్చించేందుకు క్యాంపు ఆఫీస్ నుంచి టీఆర్‌ఎస్ క్యాడర్‌ను వెంటేసుకుని ఆర్‌ఎఫ్‌సీఎల్ ఫ్యాక్టరీకి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. క్యాంపు ఆఫీస్ గేట్‌కు తాళం వేసి ముందుకు వెళ్లనీయకపోవడంతో అక్కడే కొంతసేపు బైఠాయించి నిరసన తెలిపారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ బాధితులకు న్యాయం జరగకుండా పోలీసులు అడ్డుకున్నారని ఎమ్మెల్యే చందర్ వారిపై ఫైర్ అయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పేరిట వసూళ్లకు పాల్పడిన వారిని ఉపక్షేంచేది లేదని, వారిపై కఠినంగా వ్యవరిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
చందర్ అవినీతి నిరూపిస్తా : తీన్మార్ మల్లన్న
సుల్తానాబాద్: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ. కోట్లు దండుకున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎక్కడికి వచ్చినా అవినీతిని నిరూపించడానికి సిద్ధమని తీన్మార్ మల్లన్న అన్నారు. రామగుండం వెళ్తున్న మల్లన్నను గురువారం పెద్దపల్లి జిల్లా సరిహద్దు అయిన సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత జూలపల్లి పీఎస్‌కు తరలించారు. అక్కడ మల్లన్న మీడియాతో మాట్లాడారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎమ్మెల్యే అనుచరులు రూ.45 కోట్లు వసూలు చేశారని, ఈ వ్యవహారంతో ఎమ్మెల్యేకు ఉన్న సంబంధాలను నిరూపించేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. పొరపాటును సరిదిద్దుకోకుండా ఎమ్మెల్యే చందర్ హై డ్రామా క్రియేట్ చేశారన్నారు. తనకు తానుగా హౌస్ అరెస్ట్ డ్రామా ఆడారని, మరోవైపు తనను అక్కడికి రాకుండా చేశారన్నారు. ‘ఎమ్మెల్యే చందర్..నీ అవినీతిని నిరూపిస్తా...హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్దకు వస్తావా లేదా అబిడ్స్ చౌరస్తాకు వస్తావా తేల్చుకో’ అని సవాల్‌విసిరారు. లేదంటే జూలపల్లి పీఎస్‌కు వచ్చినా పర్వాలేదని, ఆన్ లైన్ లో చర్చకు వచ్చినా తాను రెడీ అని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులలో కొందరు కార్మికులకు డబ్బులు తిరిగి ఇస్తున్నట్టు తెలిసిందని, అందరూ కూడా బహిరంగంగా తమ తప్పు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచరులు తన వద్దకు వచ్చి ఎమ్మెల్యేకు సంబంధం ఉంందని తనకు చెప్పారన్నారు. తాను కత్తులు, ఆయుధాలతో చర్చకు రాలేదని, ఆధారాలతో వస్తుండగా అరెస్టు చేయడం కరెక్ట్కాదన్నార. అంతకుముందు దుబ్బపల్లి వద్ద తీన్మార్ మల్లన్నను అరెస్టు చేసే క్రమంలో ఆయన అనుచరులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వివాదం చేశారు.