
1969 తెలంగాణ ఉద్యమం గమ్యం చేరలేదు. 369 మంది ప్రాణాలు కోల్పోయినా ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు. తొలి దశ ఉద్యమ పరిణామాలతో 1975 నుంచి 1982 వరకు తెలంగాణ ఉద్యమకారులు స్తబ్దుగా ఉండిపోయారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక తెలంగాణవాదుల్లో మళ్లీ కదలిక వచ్చింది. తెలంగాణ అస్థిత్వం కోసం మేదోమథనాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. హిమాయత్ నగర్ ఉప ఎన్నికల్లో విజయవాడకు చెందిన పి.ఉపేంద్రపై స్థానికుడు, తెలంగాణ వాది అయిన ఆలే నరేంద్ర గెలుపుతో తెలంగాణ కోసం పోరాడిన నాయకులు, ఉద్యమకారులు మరోసారి ఉద్యమ నిర్మాణానికి సన్నద్ధమయ్యారు.
హిమాయత్‌నగర్ ఉప ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పి. ఉపేంద్ర ఓటమిపాలై తెలంగాణవాది ఆలే నరేంద్ర గెలవడంతో హిమాయత్‌నగర్‌లోని వైఎంసీఏ హాలులో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ప్రతాప్ కిషోర్, ఇ.వి.పద్మనాభమ్, సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు. మాజీ మంత్రులైన బాగారెడ్డి, గోక రంగస్వామి వంటి వక్తల సూచనల మేరకు తెలంగాణ ఉద్యమ నిర్వహణ కోసం తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ పార్టీ : వరంగల్‌లో దేవానందస్వామి, అతని స్నేహితులు కలసి 1984లో తెలంగాణ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీ అనేక సమావేశాలు నిర్వహించడం, వివిధ సాహిత్యాల ద్వారా తెలంగాణ పట్ల వివక్షతను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నించింది. ఈ పార్టీకి భూపతి కృష్ణమూర్తి, కాళోజీ నారాయణరావు తదితరులు మద్దతు ప్రకటించారు.
తెలంగాణ జనసభ : స్టేట్ అడ్వయిజర్ పత్రిక సంపాదకుడైన సత్యనారాయణ అధ్యక్షతన తెలంగాణ జనసభ ఏర్పడింది. ఈ సంస్థ 1985, ఫిబ్రవరి 27న ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో నిర్వహించిన సభకు ఆర్యసమాజ్ నాయకుడు వందేమాతరం రామచంద్రరావు అధ్యక్షత వహించాడు. ఈయన నాయకత్వంలో కొత్తగూడెం, వరంగల్ ప్రాంతాల్లో సభలు, తెలంగాణ లూట్ బంద్ కరో అనే శిబిరం నిర్వహించారు. తెలంగాణ జనసభ నాయకులు సత్యనారాయణ, ప్రతాప్కిషోర్, వందేమాతరం రామచంద్రరావు ఢిల్లీ వెళ్లి అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ,
హోంమంత్రి వై.బి.చవాన్లకు తెలంగాణ ఆవశ్యకత గురించి వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. అప్పటి బీజేపీ అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, జనతా పార్టీ నేత జార్జ్ ఫెర్నాండెజ్‌లు తెలంగాణ జనసభ నాయకులకు మద్దతు తెలిపారు. కానీ వందేమాతరం రామచంద్రరావు ఆర్యసమాజ్ కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించడంతో తెలంగాణ జనసభ నెమ్మదిగా ఉనికి కోల్పోయింది.
తెలంగాణ ప్రజా సమితి : తెలంగాణ సమస్యకు దేశవ్యాప్త మద్దతు కోసం జర్నలిస్టు ప్రతాప్కిషోర్ ఢిల్లీకి పాదయాత్ర చేపట్టారు. 1987 జూన్ 6న చార్మినార్ నుంచి ప్రతాప్కిషోర్ పాదయాత్రను ప్రారంభించారు. ఇందులో షేర్‌ఖాన్, సయ్యద్ షిహాబుద్దీన్లు పాల్గొన్నారు. ఈ బృందం తిరిగి హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం 1987లో తెలంగాణ ప్రజాసమితిని పునరుద్ధరించింది. ఈ సమితికి అధ్యక్షునిగా వరంగల్‌కు చెందిన తెలంగాణ గాంధీగా పిలిచే భూపతి కృష్ణమూర్తిని నియమించారు. ఈయన నాయకత్వంలో తెలంగాణ ప్రజా సమితి అనేక సభలు, సమావేశాలు నిర్వహించింది. 1987 నవంబర్ 1న తెలంగాణ విద్రోహదినంగా పాటించింది.
తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో 1996 నవంబర్ 1న వరంగల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభ భూపతి కృష్ణమూర్తి, కాళోజీ నారాయణరావు, నారం కృష్ణారావు, ప్రొ. జయశంకర్, కేశవరావు జాదవ్‌ల ఆధ్వర్యంలో జరిగింది. ఈ మహాసభ విజయవంతం కావడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి పునరుజ్జీవం కలిగింది. 1997 జనవరి 14న గోదావరిఖనిలో ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం సదస్సును ఏర్పాటు చేశారు.
తెలంగాణ పోరాట సమితి : కె.ఆర్.ఆమోస్, మేచినేని కిషన్‌రావు 1989లో తెలంగాణ పోరాట సమితిని ప్రారంభించారు. ఈ పోరాట సమితి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు చేపట్టింది.
తెలంగాణ ముక్తి మోర్చా : 1993లో తెలంగాణ ముక్తి మోర్చాను స్థాపించారు. ఈ సంస్థ అధ్యక్షుడు మేచినేని కిషన్‌రావు, ఉపాధ్యక్షులు జస్టిస్ కొండా మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే చుంచు లక్ష్మయ్య ఎన్నికయ్యారు. మేచినేని కిషన్‌రావు తెలంగాణ గోదావరి జలాల వినియోగ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1993 సెప్టెంబర్ 24 నుంచి 28 వరకు ముక్తి మోర్చా షామీర్‌పేటలో రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహించింది. ఈ శిక్షణ తరగతుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన జస్టిస్ టి.ఎల్.ఎన్.రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చెందని తెలంగాణ ప్రాంతాన్ని దోచుకోవడం అతి సహజమైన విషయమని ఆరు సూత్రాల పథకం తెలంగాణకు అక్కరకురాదని తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కె.వి.శ్రీనివాస్‌రావు అధ్యక్షతన 16 మంది రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ల బృందం ఎల్లంపల్లి, ఇచ్చంపల్లి, కంతాలపల్లి, దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం ద్వారా 1000 టీఎంసీల నీటితో కోటి ఎకరాల సాగునీరు, వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో ఉత్పత్తి చేసి తెలంగాణకు శాశ్వత వెలుగుతోపాటు నిరుద్యోగ సమస్యకూ మంచి పరిష్కారం చూపించారు. ఇదే విషయమై మేచినేని కిషన్‌రావు 1998లో ఎల్లంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు 300 కి.మీ.ల వరకు పాదయాత్ర చేసి దారి పొడవునా ప్రతిపల్లెనుమేల్కొల్పాడు.
తెలంగాణ ఫోరం : వెలిచాల జగపతిరావు ప్రచురణల మూలంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకుల్లో కొంత స్పందన వచ్చింది. అనంతరం 1990లో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కన్వీనర్ గా తెలంగాణ ఫోరం ఏర్పడింది. 1992 సెప్టెంబర్‌లో తెలంగాణ ఫోరం నాయకులు జానారెడ్డి నేతృత్వంలో ఆనాటి ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్‌రెడ్డికి విన్నవించి తెలంగాణకు జరిగిన అన్యాయాలను సరిదిద్దమని కోరారు.
జై తెలంగాణ పార్టీ : పటోళ్ల ఇంద్రారెడ్డి 1996 వరకు తెలుగుదేశం పార్టీలో కొనసాగి ఆ తర్వాత లక్ష్మీపార్వతి పార్టీలో చేరారు. ఈయన 1997 సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జై తెలంగాణ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి అనేక విజయ యాత్రలు చేపట్టింది. ఇంద్రారెడ్డికి ప్రొ.జయశంకర్, కేశవరావు జాదవ్, కొండా మాధవరెడ్డి సహకరించారు. చివరికి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలపై చర్చించడానికి 1987 సెప్టెంబర్ 17న ప్రొ. జి.లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా దాశరథి కృష్ణమాచార్యులు హాజరయ్యారు. ఇందులోనే ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ అనే సంఘం స్థాపించారు. ఈ సంస్థ అధ్యక్షుడిగా జి.లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ ఫోరం స్థాపించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న తెలంగాణ విముక్తి దినోత్సవంగా పాటించి అనేక సంవత్సరాలపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సదస్సులను నిర్వహించేవారు. ఇందులో దాశరథి కృష్ణమాచార్యులు పాల్గొనేవారు. అలాగే ప్రతి సంవత్సరం నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టేవారు.
ఈ నిరసన కార్యక్రమాల్లో కాళోజి నారాయణరావు పాల్గొనేవారు. కొత్త సంవత్సరం సందర్భంగా తెలంగాణ మ్యాప్‌తో కూడిన మా తెలంగాణ గ్రీటింగ్స్‌ను ఈ ఫోరం వివిధ ప్రాంతాల్లో పంపిణీ చేసేది. 1988లో తెలంగాణ మ్యాప్‌తో కూడిన ఒక క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ ఫోరం తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్, తెలంగాణ జనసభతో కలిసి కాళోజీ నారాయణరావు చేతుల మీదుగా తెలంగాణ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేశారు.
తెలంగాణ ఉద్యమ కమిటీ : 1997 జూన్ 18న మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి అధ్యక్షతన జస్టిస్ మాధవరెడ్డి, మేచినేని కిషన్‌రావు సభ్యులుగా తెలంగాణ ఉద్యమ కమిటీ ఆవిర్భవించింది. ఈ కమిటీ కేంద్ర మాజీ మంత్రులు అజిత్‌సింగ్, శిబుసోరెన్లను ఆహ్వానించి భారీ ఎత్తున సభలను నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్పా ఈ ప్రజలకు విముక్తి లేదంటూ ఉద్యమాన్ని ప్రతి గ్రామానికి విస్తరించారు. 1997 సెప్టెంబర్‌లో తెలంగాణ ఉద్యమ కమిటీ పరాయి పీడనపై తరతరాలుగా నడుస్తున్న దోపిడీని తెలంగాణ పోరు అనే పేరుతో కరపత్రాలను ముద్రించి తెలంగాణ వ్యాప్తంగా పంచి పెట్టారు.
తెలంగాణ సంఘర్షణ సమితి : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించడానికి 1989లో మాజీ హోంమంత్రి కోహెడ ప్రభాకర్ రెడ్డి, మేచినేని కిషన్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ సంఘర్షణ సమితిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1996లో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ, ప్రొ. కేశవరావు జాదవ్, ప్రభాకర్‌రెడ్డి, కిషన్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి తెలంగాణ సంఘర్షణ సమితి ఆశయాలను తెలంగాణ కావాలన్న నినాదాన్ని ప్రచారంలోకి తీసుకువస్తూ ప్రతి జిల్లా కేంద్రంలో తెలంగాణ జెండాలను ఎగురవేశారు.
తెలంగాణ ప్రగతి వేదిక :
ఈ సంస్థ తెలంగాణ ప్రాంతంలో భావజాల వ్యాప్తికి అధికంగా కృషి చేసింది. రాపోలు ఆనందభాస్కర్ నేతృత్వంలో హైదరాబాద్‌లో 1997 జులై 12, 13వ తేదీల్లో రెండు రోజులపాటు తెలంగాణ సింహావలోకన శిబిరం నిర్వహించారు. తెలంగాణ ప్రగతి వేదిక ఆవిర్భావం గురించి అన్ని జిల్లాల్లోని ప్రముఖ పట్టణాల్లో ఒకేసారి ఒకేరోజు ఒకే సమయంలో విలేకరుల సమక్షంలో 1997 జులై 13న తెలంగాణ ప్రగతి వేదిక గురించి ప్రకటించారు. ఈ వేదికకు కన్వీనర్‌గా రాపోలు ఆనందభాస్కర్ ఎన్నికయ్యారు.
తెలంగాణ ప్రగతి వేదిక బతుకమ్మ పండుగ కాలాన్ని తెలంగాణ సంస్కృతి పరిరక్షణ దినోత్సవాలుగా ప్రకటించింది. రెండో దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ప్రజలు తెలంగాణ వివక్షతలపై అవగాహన కలిగించడానికి మహబూబ్‌నగర్; వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, సిద్దిపేట, దుబ్బాక, సంగారెడ్డి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ మొదలైన ప్రాంతాల్లో సభలను నిర్వహించింది.