పోటీ పరీక్ష ఏదైనా జనాభాపై ప్రశ్నలు లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. దేశంలో తుది జనాభా లెక్కలు 2011లో సేకరించారు. కరోనా కారణంగా 2021లో జరగాల్సిన జనాభా సేకరణ వాయిదా పడింది. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పోటీ పరీక్షల దృష్ట్యా 2011 జనాభాకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం.
2011 మార్చి 1న సమయం 00.00.00 గంటలకు భారతదేశ జనాభా121,08,54,977(1.21బిలియన్లు). జనాభా పరిమాణంలో చైనా తర్వాత భారతదేశం రెండో స్థానంలో ఉంది. 121.09 కోట్లతో అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, జపాన్ల జనాభా (121.43కోట్లు)కు ఇంచుమించు సమానంగా ఉంది. ప్రపంచ ఆదాయంలో భారతదేశ ఆదాయం 1.2శాతం కంటే తక్కువగా ఉండగా జనాభాలో మాత్రం 17.5శాతం ఉంది. అందువల్ల మన దేశంలో పేదరికం ఎక్కువగా ఉంది. 2019 నాటికి భారతదేశ జనాభా 134కోట్లు.
1901లో 23.8కోట్ల జనాభా ఉన్న భారతదేశం 2011 నాటికి 121.09కోట్లకు చేరింది. అంటే 110 సంవత్సరాల్లో 97 కోట్ల జనాభా కంటే ఎక్కువగా పెరిగింది. పురుష జనాభా 62,32,70258 (51.47శాతం), స్త్రీ జనాభా 58,75,84, 719 (48.53శాతం) అంటే పురుష జనాభా కంటే స్త్రీ జనాభా 1.5శాతం తక్కువగా ఉంది. గ్రామీణ జనాభా 83,37,48,552 (83.4కోట్లు) 68.85శాతం పట్టణ జనాభా 37,71,06,125(37.71కోట్లు) 31.14శాతం. 2001–2011 మధ్య భారతదేశంలో అదనంగా పెరిగిన జనాభా 18.19కోట్లు. పురుషుల్లో 9.097కోట్లు, స్త్రీలలో 9.099కోట్లు అదనంగా పెరిగారు. అంటే అదనంగా పెరిగిన జనాభా పురుషుల్లో కంటే స్త్రీల్లో ఎక్కువగా ఉంది. 2001–11 మధ్య భారత్‌లో అదనంగా పెరిగిన జనాభా ప్రపంచంలో జనాభాలో ఐదో పెద్ద దేశమైన బ్రెజిల్ దేశ జనాభాకు సమానం.
చైల్డ్ పాపులేషన్ (0–6 సంవత్సరాలు)
2011 జనాభా లెక్కల్లో బాలుర జనాభా 8.57కోట్లు, బాలికల జనాభా 7.87కోట్లు, బాల బాలికల జనాభా 16.451కోట్లు
అధిక చైల్డ్ పాపులేషన్ గల రాష్ట్రాలు1. ఉత్తర్‌ప్రదేశ్3.079కోట్లు, 2. బిహార్ 1.91కోట్లు, 3. మహారాష్ట్ర 1.33కోట్లు, 4. మధ్యప్రదేశ్1.08కోట్లు, 5. పశ్చిమబెంగాల్ 1.05కోట్లు.
తక్కువ చైల్డ్ పాపులేషన్ గల రాష్ట్రాలు 1. సిక్కిం 64,111, 2. గోవా 1.44 లక్షలు, 3. మిజోరాం 1.68లక్షలు
జనసాంద్రత
ఒక చ.కి.మీ.కు నివసించే జనాభాను జనసాంద్రత అంటారు. జన సాంద్రత = మొత్తం జనాభా/ మొత్తం విస్తీర్ణం
ఉత్తరభారతదేశంలో గంగానది పరివాహక ప్రాంతం వల్ల, సారవంతమైన భూముల వల్ల అధిక జన సాంద్రత కనిపిస్తోంది. హిమాలయ పర్వత ప్రాంతాలు, గిరిజన అండ్ ఎడారి ప్రాంతాలు నివాసయోగ్యానికి వీలుగా లేకపోవడంతో తక్కువ జనసాంద్రతను కలిగి ఉన్నాయి.
సంవత్సరం జనసాంద్రత
1901 77
1951 117
1991 267
2001 325
2011 382
మొదటి 50 సంవత్సరాల్లో పెరిగిన జనసాంద్రత కంటే చివరి 10 సంవత్సరాల్లో పెరిగిన జనసాంద్రత ఎక్కువగా ఉంది. 2001తో పోలిస్తే 2011లో చ.కి.మీ.కి పెరిగిన జనసంఖ్య 58 నుంచి 57కు తగ్గింది.
అధిక జనసాంద్రత గల రాష్ట్రాలు 1. బిహార్ 1106, 2. పశ్చిమబెంగాల్ 1028, 3. కేరళ 860, 4. ఉత్తర్‌ప్రదేశ్ 829 తక్కువ జనసాంద్రత గల రాష్ట్రాలు 1. అరుణాచల్‌ప్రదేశ్ 17, 2. మిజోరాం 52, 3. సిక్కిం 86, 4. మణిపూర్ 115
2001 జనాభా లెక్కల్లో పశ్చిమబెంగాల్ మొదటి ర్యాంక్‌లోనూ బిహార్ రెండో ర్యాంక్‌లోనూ ఉండేది. ప్రస్తుతం బిహార్ ప్రథమ స్థానంలో ఉంది.
జనన, మరణరేటు
ప్రతి 1000 మంది జనాభాకు గల జననాల సంఖ్యను చెప్పేది జననరేటు.
జననరేటు = సంవత్సరంలో సజీవ జననాల సంఖ్య/ సంవత్సర మధ్య జనాభా X 1000
మరణరేటు = సంవత్సరంలో మరణాల సంఖ్య/ సంవత్సర మధ్య జనాభా X 1000
2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అక్షరాస్యులు 56.07 కోట్లు ఉండగా, అందులో పురుషులు 33.65 కోట్లు, స్త్రీలు 22.42 కోట్లుగా ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం అక్షరాస్యులు 76.36కోట్లు ఉండగా, పురుషులు 43.47కోట్లు, స్త్రీలు 32.88కోట్లుగా ఉన్నారు. 2001తో పోలిస్తే అక్షరాస్యులు 20.28కోట్లు పెరిగారు.
2001తో పోలిస్తే 2011 నాటికి అదనంగా పెరిగిన అక్షరాస్యుల సంఖ్య 20.28కోట్లు. అక్షరాస్యుల సంఖ్య పురుషుల్లో ఎక్కువగా ఉన్నప్పటికీ అదనంగా పెరిగిన అక్షరాస్యుల్లో స్త్రీల్లోనే ఎక్కువగా ఉన్నారు.
స్త్రీ, పురుష నిష్పత్తి
ప్రతి 1000మంది పురుషులకు గల స్త్రీల సంఖ్యను తెలిపేది లింగ నిష్పత్తి. స్త్రీ పురుషుల సమానత్వానికి ఇది సామాజిక సూచిక.
లింగ నిష్పత్తి = స్ర్తీల సంఖ్య/ పురుషుల సంఖ్య X 1000
స్వాతంత్ర్యానికి పూర్వం 1901 నుంచి 1951 వరకు 50 సంవత్సరాల కాలంలో స్త్రీ, పురుష నిష్పత్తి 972 నుంచి 946కి తగ్గింది. స్వాతంత్ర్యం తర్వాత కూడా పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగపడలేదు. 1991 నాటికి స్త్రీ పురుష నిష్పత్తి 927గా ఉంది. 2001లో 933, 2011 నాటికి 943కు చేరింది.
అధిక స్త్రీ, పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు తక్కువ స్త్రీ, పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు
1. కేరళ 1084 1. హర్యానా 879
2. తమిళనాడు 996 2. జమ్ముకశ్మీర్ 889
3. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 993 3. సిక్కిం 890
4. మణిపూర్992 4. పంజాబ్895
5. ఛత్తీస్‌గఢ్ 991 5. ఉత్తర్‌ప్రదేశ్ 912