ఖమ్మంలో జోడో న్యాయ యాత్ర సంఘీభావ ర్యాలీ

ఖమ్మం టౌన్/పాల్వంచ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ జూడో న్యాయ యాత్ర సందర్భంగా లీడర్లు ఆదివారం ఖమ్మంలో, పాల్వంచలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఖమ్మం కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సంజీవ్ రెడ్డి భవనం నుంచి జడ్పీ సెంటర్ వరకు రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో న్యాయ యాత్ర కు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. దుర్గాప్రసాద్ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్​ గాంధీ ఏడాదిన్నర కిందట కన్యాకుమారి నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా తిరిగి భారత్  జోడో న్యాయ్ యాత్ర పేరుతో మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్నారని చెప్పారు.

ఈ యాత్రను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు. పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్​లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల రంగారావు నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, తెలంగాణ ఉద్యమ కారులు శ్రీపాద సత్యనారాయణ, ఎండీ మంజూర్, కొమర్రాజుల విజయ్, ఇజ్జగాని రవి పాల్గొన్నారు.  స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్య క్రమంలో డీసీఎం ఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.