రోజు రోజుకు విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మీద పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమెరికా వైట్ హౌజ్ స్పందించింది. ఈ రంగంలో కీలకంగా వ్యవహరించే మైక్రోసాఫ్ట్, గూగుల్ సీఈవోలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమావేశమయ్యారు. ప్రస్తుతం ఈ అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ అధిపత్యం చెలాయిస్తుందన్న మాట వరల్డ్ వైడ్గా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో దానితో ఎదురయ్యే సమస్యల మీద చర్చించడంతో పాటు....దానికి సంబంధించిన వివరాల్ని సేకరించేందుకు వైట్ హౌస్ స్వయంగా రంగంలోకి దిగినట్లుగా చెబుతున్నారు.
టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ముందు.... అవన్నీ సురక్షితమైనవన్న భరోసాను ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ పై చర్చించేందుకు..దానితో ఎదురయ్యచే సమస్యల మీద వివరాలను సేకరించేందుకు గూగుల్ సుందర్ పిచాయ్, మైక్రో సాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లను వైట్ హౌస్ కు పిలిపించి భేటీ అయ్యారు.
ఈ కీలక మీటింగ్లో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, బైడెన్ చీఫ్ ఆఫ్ స్టాప్ జెఫ్ జైంట్స్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తో పాటు.... ఇతర అధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు చాట్జీపీటీ ఓపెన్ ఏఐ సీఈవో శాల ఆల్ట్ మెన్.. ఆంథ్రోపిక్ సీఈవో డేరియా అమోడీలను మీటింగ్ కు పిలిపించి.. కృత్రిమ మేధతో చోటు చేసుకునే విపరిణామాల మీద బైడెన్ వివరణ అడిగినట్లుగా తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా వ్యక్తులు, సమాజం, జాతీయ భద్రతకు ఎదురయ్యే ప్రమాదాలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతున్నందున వివిధ కంపెనీల AI అధికారులతో బైడెన్ సమావేశం గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో మూడు కీలక రంగాలపై స్పష్టమైన, నిర్మాణాత్మక చర్చ కూడా జరిగింది.
- కంపెనీలు తమ AI వ్యవస్థల గురించి ఉద్యోగులు, ప్రజలు, ఇతరులతో మరింత పారదర్శకంగా ఉండవలసిన అవసరం
- AI వ్యవస్థల భద్రత, సమర్థతను అంచనా చేయడం
- AI వ్యవస్థలు దాడుల నుండి సురక్షితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి
బైడెన్ ట్వీట్..
"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుత కాలంలోని అత్యంత శక్తివంతమైన సాధనాల్లో ఒకటి. కానీ దాని లాభాలను అందిపుచ్చుకోవడానికి ముందుగా దాని ప్రమాదాలను తగ్గించాలి. ఈ రోజు నేను AI ముఖ్యులతో సమావేశం అయ్యాను. బాధ్యతాయుతంగా AI ఆవిష్కరణలు, ప్రజల హక్కులు, భద్రతను యొక్క ప్రాముఖ్యతపై చర్చించాను..అని బైడెన్ ట్వీట్ చేశారు.