ఆఫ్గనిస్థాన్ నుంచి తమ సైనిక బలగాలు, పౌరుల తరలింపును ఆగస్ట్ నెలాఖరులోగా పూర్తిచేస్తామని అమెరికా అద్యక్షుడు జో బైడెన్ చెప్పారు. ముందుగా నిర్ణయించిన ప్రకారమే తరలింపు జరుగుతుందన్నారు. బ్రిటన్ సహా పలు దేశాలు... తరలింపు గడువును పెంచాలని ఇప్పటికే కోరడంతో... బైడెన్ చేసిన ప్రకటనపై చర్చ జరుగుతోంది.
వారం రోజుల్లో పౌరులను ఆఫ్ఘన్ నుంచి తరలించడం కష్టమని.. గడువు పెంచేలా తాలిబాన్లను ఒప్పించాలంటూ పలు దేశాలు అమెరికాను కోరాయి. దాంతో తాలిబాన్ అగ్రనేత అబ్దు ఘనీ బరాదర్ తో అమెరికా సీఐఏ చర్చలు జరిపింది. ఐతే.. ఈ మీటింగ్ లో ఏం నిర్ణయించారన్నది బయటకు రాలేదు. ఈ సమయంలో గడువులోగానే బలగాలను వెనక్కి పిలిపిస్తామని మంగళవారం రాత్రి అమెరికా ప్రెసిడెంట్ ప్రకటన చేశారు.
ప్రస్తుతం కాబూల్ ఎయిర్ పోర్టు దగ్గర దాదాపు 6వేల మంది అమెరికా సైనిక బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. పౌరులను ప్రత్యేక యుద్ధవిమానాల్లో పలు దేశాలకు పంపిస్తున్నాయి. నెలాఖరులోగా వీలైనంతమందిని ఆఫ్గన్ నుంచి పంపించడమే తమ లక్ష్యమని అమెరికా తెలిపింది.
కాగా.. పౌరుల తరలింపు టైం దగ్గర పడుతుండటంతో.. కాబూల్ ఎయిర్ పోర్టునుంచి జనాల తరలింపులో వేగం పెంచుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 21వేల 6 వందల మందిని తలించినట్టు అధికారులు చెబుతున్నారు. జులై వరకు 75వేల 9వందల మందిని ఆఫ్గన్ నుంచి షిఫ్ట్ చేసినట్టు బైడెన్ తెలిపారు. అయితే ఆగస్ట్ 14 తర్వాత మాత్రం అధికంగా 70వేల 7వందల మందిని లిఫ్ట్ చేశామని ఆయన చెప్పారు. తాలిబాన్లతో అమెరికా సంప్రదింపులకు... G7 దేశాలు, ఈయూ, నాటో, యునైటెడ్ నేషన్స్ మద్దతు పలికాయని ఆయన తెలిపారు. తాలిబాన్ల చర్యల ఆధారంగానే.. అమెరికా స్పందన ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.