T20 World Cup 2024: ఇటలీ తరపున సెంచరీ.. ఆసీస్ ఆటగాడు అరుదైన ఘనత

T20 World Cup 2024: ఇటలీ తరపున సెంచరీ.. ఆసీస్ ఆటగాడు అరుదైన ఘనత

2026 వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రొమేనియాపై జరిగిన మ్యాచ్ లో ఇటలీ ప్లేయర్ జో బర్న్స్ సెంచరీతో చెలరేగాడు. 55 బంతుల్లో 12 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో బర్న్స్ 108 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బర్న్స్ మెరుపు సెంచరీతో రొమేనియాపై ఇటలీ 160 పరుగుల విజయాన్ని అందుకుంది.   అయితే ఇందులో విశేషం ఏముందిలే అనుకోవచ్చు. జో బర్న్స్  గతంలో ఆసీస్ తరపున ఆడాడు. ప్రస్తుతం ఇటలీ తరపున ఆడుతున్న ఈ మాజీ ఆసీస్ ఆటగాడు సెంచరీ చేయడంతో అరుదైన జాబితాలోకి చేరిపోయాడు. 

రెండు దేశాల తరపున ప్రాతినిధ్యం వహించి సెంచరీ చేసిన ఆరో క్రికెటర్ గా బర్న్స్ నిలిచాడు. గతంలో మోర్గాన్( ఐర్లాండ్, ఇంగ్లాండ్) కుల్దీప్ వెస్సెల్ (ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా), ఎడ్ జాయిస్ (ఇంగ్లాండ్, ఐర్లాండ్) మార్క్ చాప్ మాన్ (హాంగ్ కాంగ్, న్యూజిలాండ్),గ్యారీ బ్యాలెన్స్ (ఇంగ్లాండ్, జింబాబ్వే)  మాత్రమే ఈ ఘనత సాధించారు. బర్న్స్ ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో సెంచరీ చేశాడు. 

బర్న్స్ సోదరుడు డొమినిక్ కూడా క్రికెటర్. అతని ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్నుమూశారు. తన దివంగత సోదరుడికి నివాళిగా ఇటలీ కోసం ఆడాలనే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2026 T20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో బర్న్స్ ఆడబోతున్నట్టు తెలియజేశాడు. బర్న్స్ తల్లి ఇటాలియన్ కు చెందింది. అందుకే అతను ఇటలీకి ఆడనున్నట్లు తెలుస్తుంది. సోదరుడు డొమినిక్  బ్రిస్బేన్‌లో క్లబ్ క్రికెట్ ఆడుతున్నప్పుడు 85 నంబర్ జెర్సీని ధరించేవాడు. బర్న్స్ సైతం తన సోదరుడి 85 నంబర్ జెర్సీని ధరించనున్నట్లు తెలిపాడు.