SA20, 2025: జో రూట్ విధ్వంసం.. భారీ లక్ష్యాన్ని చేధించిన మిల్లర్ జట్టు

జో రూట్.. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది నిలకడైన ఇన్నింగ్స్. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ముద్రపడిన ఈ ఇంగ్లీష్ క్రికెటర్.. క్రీజులో కుదురుకున్నాడంటే పరుగుల వరద పారించగలడు. భారీ సిక్సర్లు కొట్టలేకపోయినా.. బౌండరీలు ఎక్కువ రాబట్టకపోయినా.. ఒక్కో పరుగు జోడిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడటం ఇతని ప్రత్యేకత. అటువంటి జో రూట్ ఉన్నట్టుండి శివాలెత్తిపోయాడు. భారీ సిక్సర్లు బాదేస్తూ.. బౌండరీల మోత మోగిస్తూ జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించి పెట్టాడు.

Also Read :- లంక మహిళల భారీ విజయం

రూట్‌.. బంతి రైట్ రైట్

శనివారం(జనవరి 18) ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్ల్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన క్యాపిటల్స్‌ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఛేదనలో పార్ల్ రాయల్స్‌ మరో రెండు బంతులు మిగిలివుండగానే టార్గెట్ ను చేధించింది. సెంచూరియన్ గడ్డపై ఇంగ్లీష్ బ్యాటర్ జో రూట్(92 నాటౌట్) పరుగుల వరద పారించాడు. 60 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 92* పరుగులు చేశాడు. అతనికి తోడు యువ బ్యాటర్ రూబిన్ హెర్మాన్ (33 బంతుల్లో 56), కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (24 బంతుల్లో 48*) చెలరేగడంతో రాయల్స్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

అంతకుముందు ప్రిటోరియా క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. విల్‌ స్మీడ్‌ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీ చేయగా.. రహ్మానుల్లా గుర్భాజ్‌ (29 బంతుల్లో 42; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కైల్‌ వెర్రియన్నే (23 బంతుల్లో 45; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. ఆఖరిలో జేమ్స్‌ నీషమ్‌ (13 బంతుల్లో 28 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.