Joe Root: ఆల్‌టైం రికార్డులే లక్ష్యంగా.. టెస్టుల్లో దూసుకుపోతున్న రూట్

Joe Root: ఆల్‌టైం రికార్డులే లక్ష్యంగా.. టెస్టుల్లో దూసుకుపోతున్న రూట్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌‌ జో రూట్‌‌ టెస్టుల్లో సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు. ఇటీవలే సొంతగడ్డపై వెస్టిండీస్ సిరీస్ లో అద్భుతంగా రాణించిన ఈ ఇంగ్లాండ్ స్టార్.. అదే ఫామ్ ను శ్రీలంకపై కొనసాగిస్తున్నాడు. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో గురువారం (ఆగస్టు 29) మొదలైన రెండో టెస్ట్‌‌లో భారీ సెంచరీతో (143) కెరీర్ లో 33 వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అలెస్టర్ కుక్ రికార్డ్ సమం చేశాడు. 

Also Read:-కోహ్లీ కాదు.. మా జట్టులో సచిన్ ఆడాలి

రూట్ మరో 199 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. మరో 3720 పరుగులు సాధిస్తే టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ ఆల్ టైం రికార్డ్ బ్రేక్ చేస్తాడు. రూట్ మరో 5 హాఫ్ సెంచరీలు చేస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. రూట్‌‌ (143) సెంచరీతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ తొలి ఇన్నింగ్స్‌‌లో 88 ఓవర్లలో 358/7 స్కోరు చేసింది. గస్‌‌ అట్కిన్సన్‌‌ (74 బ్యాటింగ్‌‌), మాథ్యూ పాట్స్‌‌ (20 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. 

టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన ఇంగ్లండ్‌‌కు ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. డకెట్‌‌ (40) నిలకడగా ఆడినా, డాన్‌‌ లారెన్స్‌‌ (9), ఒలీ పోప్‌‌ (1) వెంటవెంటనే ఔటయ్యారు. ఈ దశలో రూట్‌‌ కీలక భాగస్వామ్యాలు జోడించాడు. డకెట్‌‌తో మూడో వికెట్‌‌కు 40, హ్యారీ బ్రూక్‌‌ (33)తో నాలుగో వికెట్‌‌కు 48, జెమీ స్మిత్‌‌ (21)తో ఐదో వికెట్‌‌కు 62, అట్కిన్సన్‌‌తో ఏడో వికెట్‌‌కు 92 రన్స్‌‌ జోడించి భారీ స్కోరు అందించాడు. చివర్లో అట్కిన్సన్‌‌, పాట్స్‌‌ ఎనిమిదో వికెట్‌‌కు 50 రన్స్‌‌ జత చేశారు. అషితా, మిలాన్‌‌, లాహిరు తలా రెండు వికెట్లు తీశారు.