ENG vs SL 2024: రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు.. లారా, గవాస్కర్ సరసన రూట్

ENG vs SL 2024: రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు.. లారా, గవాస్కర్ సరసన రూట్

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌‌ జో రూట్‌‌ టెస్టుల్లో టాప్ ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. కొడితే కొట్టాలిరా సెంచరీ అన్నట్టుగా రూట్ విధ్వంసం కొనసాగుతుంది. లార్డ్స్ వేదికగా శ్రీలంకతో గురువారం (ఆగస్టు 29) మొదలైన రెండో టెస్ట్‌‌ తొలి ఇన్నింగ్స్ లో భారీ సెంచరీతో కెరీర్ లో 33 వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఫామ్ ను కొనసాగుతూ రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీతో మెరిశాడు. రూట్ టెస్ట్ కెరీర్ లో ఇది 34 వ సెంచరీ కావడం విశేషం. ఈ సెంచరీతో ఇంగ్లాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా అలెస్టర్ కుక్ 33 సెంచరీల రికార్డ్ ను రూట్ బ్రేక్ చేశాడు.

ఈ సెంచరీకి మరో స్పెషాలిటీ ఉంది. 34 సెంచరీలతో నలుగురు దిగ్గజ ఆటగాళ్ల సరసన రూట్ చేరాడు. గవాస్కర్, బ్రియాన్ లారా, యూనిస్ ఖాన్, మహేళ జయవర్ధనే తమ టెస్ట్ కెరీర్ లో 34 సెంచరీలు చేశారు. త్వరలో రూట్ ఈ రికార్డ్ దాటడం ఖాయంగా కనిపిస్తుంది. రాహుల్ ద్రవిడ్ (36), సంగక్కర(38), రికీ పాంటింగ్ (41), కల్లిస్ (45), సచిన్ (51) మాత్రమే రూట్ కంటే ముందున్నారు. లార్డ్స్ లో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ కొట్టిన నాలుగో ప్లేయర్ గా రూట్ రికార్డులకెక్కాడు. రూట్ మరో 96 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. 

ALSO READ :PAK vs BAN 2024: పాక్‌ను కష్టాల్లో నెడుతున్న బాబర్.. కీలక మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలం

రూట్ సెంచరీతో పాటు.. గస్ అట్కిన్సన్ ఆల్ రౌండ్ షో తో రెండో టెస్టులో ఇంగ్లండ్ 190 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. దాంతో మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్‌‌ మిగిలుండగానే 2–0తో సొంతం చేసుకుంది. నాలుగో రోజు ఆదివారం ఇంగ్లండ్ ఇచ్చిన 483 రన్స్ టార్గెట్ ఛేజింగ్‌లో లంక 292 రన్స్‌‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లేయర్ ఆఫ్ ​ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌ గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లు పడగొట్టాడు. మూడో చివరి టెస్టు ఈ నెల 6 నుంచి జరుగుతుంది.