IPL 2025: రూ.10 కోట్లు అనుకుంటే మిస్సయ్యారు: మెగా వేలానికి ఇద్దరు స్టార్ క్రికెటర్లు దూరం

IPL 2025: రూ.10 కోట్లు అనుకుంటే మిస్సయ్యారు: మెగా వేలానికి ఇద్దరు స్టార్ క్రికెటర్లు దూరం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ నవంబర్ 24, 25 తేదీల్లో జెడ్డాలో జరగబోయే మెగా వేలం కోసం ఆటగాళ్ల జాబితాను శుక్రవారం (నవంబర్ 15) ప్రకటించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 వేలం నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరుగుతుంది. ఈ జాబితా ప్రకారం 574 మంది ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. ఆశ్చర్యకరంగా ఈ మెగా వేలానికి ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ , ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌లు పేరు లేదు. 2025 ఐపీఎల్ సీజన్ కోసం వారిద్దరూ వేలంలో తమ పేరును రిజిస్టర్ చేసుకోలేదు. 

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో గ్రీన్ , ఆర్చర్‌లపై భారీ అంచనాలున్నాయి. గ్రీన్ ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో రూ. 17.5 కోట్ల భారీ ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంతో పాటు.. బౌలింగ్ లో స్లో బంతులు వేయగలడు. గ్రీన్ ఐపీఎల్ లో రెండు సీజన్ లో 29 మ్యాచ్ లాడాడు. 154 స్ట్రైక్ రేట్‌తో 707 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 16 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు ఆర్చర్ ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆర్చర్ అంచనాలకు మించి రాణించాడు.

ALSO READ | IND vs AUS: చేతివేలికి గాయం.. తొలి టెస్టుకు భారత యువ బ్యాటర్ దూరం

వీరిద్దరూ ఈ సారి ఐపీఎల్ మెగా ఆక్షన్ లో రూ. 10 కోట్లు పలకడం గ్యారంటీ అని ఎక్స్ పర్ట్స్ అంచనా వేశారు. కానీ వీరు తప్పుకొని చివరి నిమిషంలో షాక్ ఇచ్చారు. ఈ మెగా ఆక్షన్ లో మొత్తం 574 మంది ఆటగాళ్లలో 366 మంది భారతీయులు కాగా.. 208 మంది విదేశీ ఆటగాళ్లు. ముగ్గురు అసోసియేట్ ఆటగాళ్లు ఉన్నారు. 366 మంది భారత ఆటగాళ్లలో 318 మంది అన్‌క్యాప్‌డ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇక 208 మంది విదేశీ ఆటగాళ్లలో 12 మంది అన్‌క్యాప్‌డ్ కేటగిరిలో ఉన్నారు. 81 మంది ఆటగాళ్లు రూ. 2 కోట్ల అత్యధిక ధరతో వేలంలో పాల్గొననున్నారు.