ప్రాచీన కాలం నుంచి స్త్రీలను ఆలయాలకు అర్పించడం ఆచారంగా వస్తున్నది. ప్రాచీన నాగరికత అయిన బాబిలోనియాలోని మైలిట్టా ఆలయంలో స్త్రీలను దేవతలకు సమర్పించేవారని చరిత్ర పితామహుడు హెరిడోటస్ పేర్కొన్నారు. భారతదేశంలో మధ్యయుగ కాలంలో వీర శైవ ప్రాబల్యంతో ఉన్న రాచరిక వ్యవస్థల్లో జోగిని వ్యవస్థ స్థిరపడింది. మధ్యయుగాల కంటే ముందే క్రీ.శ.7-9 శతాబ్దాల మధ్య కాలంలో తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలను పాలించిన రాష్ట్రకూట, చాళుక్య రాజవంశాల పాలనా కాలంలో ప్రబలంగా ఉన్న జైన మతంలో యోగిని ఆచారం పేరుతో జోగిని సంప్రదాయం కొనసాగింది. ఇదే సంప్రదాయం క్రీ.శ. 9 నుంచి 13 వరకు కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలను పాలించిన కాకతీయులు, హోయసాలుల కాలంలో వీరశైవం ప్రాబల్యంలోకి రావడంతో జోగిని వ్యవస్థ స్థిరపడింది.
మౌర్య పాలనా కాలంలో నగర వధు అనే పదవిని పొందేందుకు 64 కళల్లో ప్రావీణ్యం పొందిన స్త్రీలు పోటీపడేవారని, నగర వధు పదవిని పొందిన స్త్రీలు అత్యంత వైభవోపేత జీవితం గడిపేవారు. వీరు రాజులకు ఉంపుడు గత్తెలుగా ఉండేవారు. ఈ కాలంలో నగర వధు పదవిని పొందిన ప్రముఖ నాట్యకత్తె ఆమ్రపాలి. చత్తీస్‌గఢ్‌లోని జోగిమర గుహలో 3వ శతాబ్దానికి చెందిన జోగిమర శాసనంలో దేవదాసీ వ్యవస్థ గురించి ఉంది. ఫ్రెంచ్ మత గురువు హిందూ మ్యానర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్ గ్రంథంలో కాకతీయులు, రెడ్డిరాజుల పాలనా కాలంలో జోగిని సంప్రదాయం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ వ్యవస్థ వీరశైవ సంప్రదాయానికి చెందింది. బాలికను పురుష దేవుడికి అర్పించడం ఇందులో ప్రధాన విషయం. ఇది ఒక సామాజిక దురాచారం. ఇది ద్రావిడ సంప్రదాయం, నిమ్నకుల సంప్రదాయం. ఇది దళిత సమస్య, స్త్రీ సమస్య, జోగిని అనే పదానికి గుడిసెటుడి, జారంగి, వేశ్య అనే పలు అర్థాలు ఉన్నాయి. ఇది మతం ముసుగులో ఉన్న వ్యభిచారం. ఆడపిల్లలను దేవుడి పేరుతో వదిలి వేసే ఒక ఆటవిక సంప్రదాయం.
ఇది ఒక భూస్వామ్య విధాన అవశేషం. కాకతీయ రాజ్య పతనానంతరం జోగిని వ్యవస్థ కర్ణాటక ప్రాంతంలోని బసవిరాండ్ర వ్యవస్థ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు పాకింది. కరీంనగర్ జిల్లాలో జోగినులను పార్వతి అని పిలుస్తారు.
నిర్మూలన కార్యక్రమాలు సంస్కార్ ప్లాన్
ఈ సంస్థను లవణం, హేలతా లవణం కలిసి విజయవాడలో ఏర్పాటు చేశారు. వ్యక్తిగతంగా, సామాజికంగా జోగినుల్లో మార్పు తీసుకురావడం సంస్కార్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం ఈ సంస్థ నిజామాబాద్‌లోని వర్ని గ్రామంలో చెల్లి నిలయం (1987)ను జోగినుల కోసం ఏర్పాటు చేశారు. వకుళాభరణం లలిత జోగిని వ్యవస్థ అనే పుస్తకాన్ని రచించారు.
ఎన్ఐఎస్ఏ
ఈ సంస్థను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ కుముద్‌బెన్ జోషి స్థాపించారు. ఈ సంస్థ చెల్లి నిలయం ఏర్పాటులో పాలుపంచుకున్నది. నిసా ఆధ్వర్యంలో 1987లో న్యూఢిల్లీలో జోగినుల సంక్షేమంపై నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది.
జగన్ మిత్ర మండలి
తెలంగాణ ప్రాంతంలో జోగినీల సంస్కరణలకు పూనుకున్న తొలి వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఈయన జగన్ మిత్ర మండలి అనే సంస్థను 1906లో ఏర్పాటు చేశారు. జగన్ మిత్ర మండలి 1911లో మన్య సంఘంగా, అది తర్వాత 1922లో ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్‌గా మారింది. హైదరాబాద్ సంస్థానంలోని ఆనాటి దురాచారాలకు రూపుమాపడానికి కృషి చేసింది. 1922లో హైదరాబాద్‌లో జరిగిన అఖిల భారత ఆది హిందూ సోషల్ కాన్ఫరెన్స్‌లో ప్రధాన తీర్మానం అమ్మాయిలను దేవతలకు అర్పించవద్దు.
ఆశ్రయ్
ఈ సంస్థను మహబూబ్‌నగర్ జిల్లాలో గ్రేస్ నిర్మల ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థ జోగిని వ్యవస్థ నుంచి బయటకువచ్చిన స్త్రీలకు విద్యను అందిస్తుంది.
రఘునాథరావు కమిషన్
ఇది ఏకసభ్య కమిషన్. దీనిని 1991–92 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వి. రఘునాథరావు అధ్యక్షతన నియమించింది. జోగిని, దేవదాసీ వ్యవస్థల స్థితికి కారణాలు, పరిష్కారాల అధ్యయనం కోసం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ జోగినులు, వారి పిల్లల సమస్యలపై విస్తృత స్థాయి అధ్యయనం చేసింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం జోగిని వ్యవస్థ నిర్మూలన చట్టం 1988కు సవరణలు చేసి జోగినులు చెప్పిన ఫిర్యాదులను తిరుగులేని సాక్ష్యంగా చేశారు. వీరు చేసిన ఫిర్యాదులను జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ విచారణ మినహాయించి రెవెన్యూ అధికారికి తనంతట తాను సుమోటోగా కేసులు విచారించేలా సవరణ చేశారు. వీరి అభ్యున్నతికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, జోగిని బాలికలను ఈ వ్యవస్థకు దూరంగా ఉంచి వారి జీవితాలు ఉన్నతంగా తీర్చిదిద్దుకునే అవకాశాలు కల్పించాలని సూచించారు.
జీఓ 139: ఈ జీవో 2009లో జారీ అయింది. దీని ప్రకారం జోగినుల పిల్లలను పాఠశాలలో చేర్చుకునే క్రమంలో తండ్రి పేరుతో కాకుండా తల్లి పేరుతో పాఠశాలలోకి చేర్చుకోవడానికి అనుమతి ఇచ్చారు.
పోతురాజు: ఈయన గ్రామ దేవతలకు తమ్ముడు. ఇతను జోగినికి మంగళసూత్రాన్ని కడతాడు. ఇతడు జుట్టు పెంచుకుని ముడివేకుసుంటారు. ఈ ముడిలోనే మంత్రశక్తులు ఉంటాయని భావిస్తారు. ఈయన చేతికి మణికట్టు, కాళ్లకు కడియాలు ధరించి చేతిలో కొరడా పట్టుకుని వికృతంగా కనిపిస్తాడు.
జోగిని సమర్పణ: గ్రామంలో కరువు కాటకాలు, అంటువ్యాధులు వచ్చినప్పుడు ఒక కుటుంబాన్ని ఎన్నుకుని ఆ కుటుంబంలోని అమ్మాయిని జోగినిగా సమర్పించేవారు.
రంగం: జోగిని భవిష్యత్తును చెప్పే ప్రక్రియను రంగం అంటారు. ఈ రోజున కొత్తకుండను భూమిలో పాతిపెడ్తారు. జోగినీ ఈ కుండపైన నిలుచొని దేవతను స్తుతిస్తుంది. తర్వాత కులపెద్ద అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంది. ఈ విధంగా రంగం ఎక్కే జోగినిని కొల్లమ్మ అని వ్యవహరిస్తారు.
దేవదాసీ వ్యవస్థ
కుతుబ్‌షాహీల కాలంలో వైష్ణవ సంప్రదాయం ప్రాబల్యంలోకి రావడంతో దేవదాసీ సంప్రదాయం తెలంగాణలో ఉనికిలోకి వచ్చింది. తమిళనాడులో మాత్రం మధ్యయుగాల ఆరంభ దశలోనే దేవదాసీ సంప్రదాయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. ఈ వ్యవస్థ వైష్ణవ సంప్రదాయానికి చెందింది. ఇది ఒక సాంఘిక దురాచారం. ఇది ఒక స్త్రీ సమస్య. మానవ హక్కుల సమస్య. దేవదాసీ వ్యవస్థ అగ్రవర్ణ సంస్కృతి, ఆర్య సంస్కృతి. దేవదాసీ అనే సంస్కృత పదానికి అర్థం దేవుడి స్త్రీ సేవకురాలు.
ఈ దేవదాసీ సంప్రదాయం ప్రకారం ఒక వంశంలోని స్త్రీలలో తరానికి ఒక్కరి చొప్పున గుడిలోని దేవుడికి పెళ్లి చేసేవారు. మతం పేరిట స్త్రీలను దేవుడికి సమర్పించే ఆచారాన్ని థియోగామి అంటారు. దేవదాసీలు సాహిత్య, లలిత కళల్లో నిపుణులు. సంగీత నృత్యాల్లో దేవుడ్ని అలరించేవారు. వీరు చేసే నృత్యాలనే నట్టువ మేళం, దర్బారు ఆట, కచ్చేరి ఆట, సాదర్, చిన్న మేళం అనేవారు. దేవదాసీ విధానం భారతదేశం మొత్తం అమలులో ఉంది. ఈ వ్యవస్థలో మాతృస్వామిక విధానాన్ని అనుసరించేవారు. తల్లి నుంచే పుత్రిక వారసురాలు. దేవదాసీ విధానంలో ముస్లిం ఆడపిల్లలను అచ్యుతిస్ అంటారు. ఈ పిల్లలను ఖురాన్‌తో పెళ్లి జరిపిస్తే వారిని బీబీ అంటారు.
తెలంగాణలో దేవదాసీ వ్యవస్థపై నారాయణస్వామి, కళాకృష్ణ, గడియారం రామకృష్ణ అధ్యయనం చేశారు. దేవదాసీ, జోగిని వ్యవస్థలను నిర్మూలించడానికి భాగ్యరెడ్డి వర్మ మాన్యసంఘాన్ని స్థాపించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించిన సంఘ సంస్కర్త ముత్తు లక్ష్మీరెడ్డి.ప్రభుత్వ చర్యలు: దేవదాసీ నిర్మూలనా చట్టం – 1947 స్త్రీల అర్పణ శాసన నిరోధక చట్టం – 1930
గ్రామ దేవతలు
మైసమ్మ: చెరువు కట్టలు, ఇండ్లు పాడైపోకుండా రక్షణ
ఊరడమ్మ: ఊరిని రక్షించడం
ఎల్లమ్మ: ఊరికి కాపలా
లక్ష్మమ్మ: ఊరి సిరిసంపదలు కాపాడటం
పౌడాలమ్మ: గ్రామ సరిహద్దులకు కాపలా
పోశమ్మ: ప్రేతాత్మలు రాకుండా శ్మశానానికి కాపలా