అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానానికి శుక్రవారం నిర్వహించిన వేలంలో భారీ ఆదాయం వచ్చింది. బహిరంగ వేలం ద్వారా ఈ ఏడాది రూ.3.35 లక్షల ఆదాయం రాగా, గత ఏడాది రూ.1.76 కోట్ల ఆదాయ వచ్చినట్లు ఈవో పరేందర్కుమార్ తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.1.64 కోట్ల ఆదాయం అదనంగా వచ్చినట్లు పేర్కొన్నారు. టెంకాయలు, పూజా సామాగ్రి వేలం పాటను రూ.1.27 కోట్లకు అలంపూర్ కు చెందిన మహేశ్ గౌడ్ దక్కించుకున్నారు.
గత ఏడాది కంటే రూ.71.80 లక్షల ఆదాయం ఎక్కువగా వచ్చింది. పార్కింగ్ హక్కును రూ.70 లక్షలకు నారాయణపూర్ కు చెందిన సతీశ్, చీరల నిర్వహణ హక్కును రూ.91 లక్షలకు అలంపూర్ కు చెందిన మహేశ్ గౌడ్ దక్కించుకున్నారు. ఫొటోలు, క్యాసెట్లు, బుక్కులు అమ్ముకొనే హక్కును రూ.22 లక్షలకు అలంపూర్ కు చెందిన వెంకటరామి రెడ్డి, దేవస్థాన వసతి భవన నిర్వహణను రూ.9.50 లక్షలకు కొంకల రమేశ్ నాయుడు, మరుగుదొడ్ల నిర్వహణను రూ.7.20 లక్షలకు అలంపూర్ కు చెందిన సుంకన్న, క్యాంటిన్, షాపు, కిరాయి నిర్వహణ హక్కును నెలకు రూ.76 వేల అద్దె చెల్లించేలా సుల్తానాపురం చెందిన జానకి రామ్ దక్కించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మదనేశ్వర్ రెడ్డి, చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ధర్మకర్తలు జయరాముడు, జగన్మోహన్నాయుడు, నాగ శిరోమణి, చంద్రశేఖర్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, జగదీశ్వర్ గౌడ్, వేంకటేశ్వర్లు, గోపాల్, సురేంద్ర స్వామి, సరస్వతి, వెంకటేశ్వర్లు, ఫులేందర్, ఆనంద్ శర్మ, పాల్గొన్నారు.