అధికారుల నిర్లక్ష్యంతో మందకొడిగా వడ్ల కొనుగోళ్లు

అధికారుల నిర్లక్ష్యంతో మందకొడిగా వడ్ల కొనుగోళ్లు

గద్వాల, వెలుగు: రైతుల చేతికొచ్చిన వడ్లను కొనడంలో జోగులాంబ గద్వాల జిల్లా అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఈ సీజన్​లో 2 లక్షల 45 వేల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని టార్గెట్​పెట్టుకోగా ఇప్పటివరకు 1,292 మంది రైతుల నుంచి కేవలం 8,851 మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. కొనుగోలు కేంద్రాలు ఓపెన్​చేసి నెల దాటిపోయినా ఇప్పటివరకు టార్గెట్​లో ఐదు శాతం వడ్లు మాత్రమే కొన్నారు. కొన్నిచోట్ల ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లాలో మొత్తం 74 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, ఇప్పటివరకు 52 మాత్రమే ఓపెన్ చేశారు. ఇందులోని10 కేంద్రాల్లో ఇప్పటి వరకు కొనుగోళ్లు స్టార్ట్ చేయలేదంటే అధికారుల తీరును అర్థం చేసుకోవచ్చు. కేంద్రాలకు తెచ్చిన పంటను అధికారులు కొనకపోవడంతో రైతులు కర్ణాటకలోని రాయచూరుకు తరలిస్తున్నారు. లేదంటే ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేస్తున్నారు.

సెంటర్లకు వచ్చిన వడ్లును కొంటలేరు

వడ్లను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చాక నిర్వాహకులు కొనడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ధరూర్ మండలంలోని 3 కొనుగోలు కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి ఉంది. భీంపురం కేంద్రం దగ్గర కొన్నిరోజులుగా రైతులు వేచి చూస్తున్నారు. గద్వాల మండలం అనంతపురంలోని కేంద్రం దగ్గర దాదాపు 25 రోజుల నుంచి వడ్లు కొనడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. విసిగిపోయి మిల్లర్లు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునేలా నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ప్రైవేట్​మిల్లర్లతో కుమ్మక్కై తక్కువ రేటు కడుతున్నారని ఆరోపిస్తున్నారు. జిల్లాలోని సెంటర్ల వద్ద వడ్లు కొనడం లేదని రైతులు కర్ణాటక వ్యాపారులకు ఎక్కువగా అమ్ముకున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఎక్కువ రేటు పడుతోందని కొందరు రైతులు తెలిపారు. 

క్వింటాల్​కు 8 కేజీల తరుగు

కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చిన రైతులను తరుగు రూపంలో దోపిడీ చేస్తున్నారు. క్వింటాల్ వడ్లకు 8 కేజీల తరుగు తీస్తున్నారని రైతులు చెబుతున్నారు. 40 కేజీలు తూకం వేయాల్సి ఉండగా 43 కేజీలు పెడుతున్నారని వాపోతున్నారు. 

రైతులు రావడం లేదు

రైతులు బయటనే వడ్లు అమ్ముకుంటున్నారు. ఏదైనా సెంటర్​వద్ద వడ్లు కొనకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తమ దృష్టికి తెచ్చే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ సెంటర్లలో కంటే బయట ఎక్కువ రేటు వస్తుందనే రైతులు రావడం లేదని తెలిసింది. 
-  ప్రసాదరావు, సివిల్ సప్లై డీఎం