హైదరాబాద్: సీపీఐఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా సంగారెడ్డిలో జరుగుతోన్న సీపీఐఎం రాష్ట్ర మహాసభల్లో ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ పార్టీకి నాయకత్వం వహించిన మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం రాష్ట్ర కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. 70 ఏళ్లకు పై బడిన వారిని పక్కనా బెట్టాలని పార్టీ నిర్ణయించడంతో వీరభద్రం తప్పుకున్నట్లు సమాచారం. దాదాపు మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా తమ్మినేని వీరభద్రం పదవీ బాధ్యతలు చేపట్టారు.
అయితే.. ఈసారి బడుగు బలహీనవర్గాలకు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించడంతో జాన్ వెస్లీకి అవకాశం దక్కింది. అయితే.. సీపీఐఎం నూతన రాష్ట్ర కార్యదర్శిగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఎన్నికవుతారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. జూలకంటి రంగారెడ్డి ఆ పార్టీ రాష్ట్ర నాయకుడిగా, ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్టీ శాసనసభాపక్ష నాయకుడిగా, సీఐటీయూ కార్మిక సంఘం నేతగా పని చేయడంతో ఈ సారి రాష్ట్ర కార్యదర్శి పగ్గాలు ఆయనకే దక్కుతాయని చర్చ నడిచింది.
ALSO READ | ఫిబ్రవరి 5 వరకు హరీష్ రావును అరెస్ట్ చేయొద్దు: తెలంగాణ హైకోర్టు
జూలకంటితో పాటు సీఐటీయూ నేత ఎస్. వీరయ్యకు కూడా రేస్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ జాన్ వెస్లీకి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించింది పార్టీ. మొత్తం మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ విధానాలను రాజకీయంగా ఎండగట్టాలని నిర్ణయించారు. బీజేపీతో దేశానికి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు.