- మాతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలి
- లేకుంటే ఉజ్జయిని మహంకాళికి బోనం ఎత్తం
ఖైరతాబాద్, వెలుగు: ఇటీవల నిర్వహించిన బల్కంపేట ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాల్లో జోగినిలకు, శివసత్తులకు తీవ్ర అవమానం జరిగిందని తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు కొలిపాక శ్యామలాదేవి(జోగిని శ్యామల) వాపోయారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తమను అనుమతించకపోవడం దారుణమన్నారు.రథోత్సవంలో పోలీసులు లాఠీచార్జ్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జోగినిలతో చర్చలు జరపాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించబోమని తేల్చి చెప్పారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జోగిని శ్యామల మీడియాతో మాట్లాడారు. జోగినిలు అంటే అందరి మేలు కోరేవారని, భగవంతునికి చెందిన వ్యక్తులని చెప్పారు. అలాంటి మమ్మల్ని ఆలయాల్లోకి రాకుండా అడ్డుకోవడం కరెక్ట్‌కాదన్నారు. కొత్త సంప్రదాయానికి తెర తీయొద్దని సూచించారు. తాము 32 ఏండ్లుగా అమ్మవారి సేవలో ఉన్నామని, పోచమ్మ, మైసమ్మలకు తమను దూరం చేయొద్దని కోరారు. బోనాల ఉత్సవాల టైంలో శివసత్తులు, జోగినిలను గౌరవిస్తూ వీఐపీ పాసులు జారీ చేయాలని డిమాండ్‌చేశారు.
ఆలయాల వద్ద ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయాలని, ఆలయ కమిటీల్లో సభ్యులుగా నియమించాలని కోరారు. అమ్మవార్లకు ఎవరు పడితే వాళ్లు బంగారు బోనం సమర్పిస్తే కష్టాలు తప్పవన్నారు. అమ్మవారి నగలు, ముక్కు పుడకతో బంగారు బోనం తయారు చేస్తారని, దానికి ఎంతో పవిత్రత అవసరమని చెప్పారు. సమావేశంలో పలువురు జోగినిలు, శివసత్తులు పాల్గొన్నారు.