పీవోగా జాయినై.. చైర్మన్గా రిటైర్​ అవ్వొచ్చు

 పీవోగా జాయినై.. చైర్మన్గా రిటైర్​ అవ్వొచ్చు

వెలుగు, ఎడ్యుకేషన్​ డెస్క్​: బ్యాంక్‌‌ పరీక్షలు రాసే అభ్యర్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రొబేషనరీ ఆఫీసర్ల నోటిఫికేషన్‌‌ను స్టేట్‌‌ బ్యాంక్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎస్‌‌బీఐ) విడుదల చేసింది. దీని ద్వారా 1673 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ విద్యార్హతతో భద్రమైన బ్యాంక్​ కొలువులో స్థిరపడేందుకు నిరుద్యోగులకు మంచి అవకాశం దొరికింది. మూడు దశల్లో నిర్వహించే ఎగ్జామ్ ప్రిపరేషన్​ ప్లాన్​, సిలబస్​, ​ సెలక్షన్ ప్రాసెస్​​ గురించి తెలుసుకుందాం..

వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్​ రంగంలో ఉద్యోగం సంపాదించాలనేది నిరుద్యోగుల కల. మంచి జీతం, తక్కువ సమయంలోనే ప్రమోషన్స్​, ఆకర్షణీయమైన అలవెన్స్​లు బ్యాంక్​ ఎంప్లాయిస్​కు ఉంటాయి. గతంలో జరిగిన పరీక్షతో పోల్చితే మెయిన్స్‌‌ పరీక్ష విధానంలో స్వల్ప మార్పులను గమనించవచ్చు. రీజనింగ్‌‌, డేటా ఇంటర్‌‌ప్రిటేషన్‌‌ విభాగంలోని ప్రశ్నల సంఖ్యను 5 చొప్పున, మార్కులను 10 చొప్పున కుదించి.. అలా కుదించిన 10 ప్రశ్నలు- 20 మార్కులను జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌ విభాగంలో కలిపారు. కాబట్టి మొత్తం ప్రశ్నల సంఖ్య, మార్కుల్లో మార్పేమీ లేదుగానీ.. జనరల్‌‌ అవేర్‌‌నెస్‌‌ విభాగం ప్రాధాన్యం పెరిగింది. ప్రిలిమ్స్‌‌ పరీక్షలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు.

ఎగ్జామ్​ ప్యాటర్న్​ 

అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో ఉంటుంది. ఫస్ట్​ స్టేజ్​లో ప్రిలిమ్స్​ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల్లో పోస్టుల సంఖ్యకు 10 రెట్ల అభ్యర్థులను మెయిన్స్‌‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌‌ పరీక్షలో ఉత్తీర్ణులైనవారి నుంచి 5 రెట్ల అభ్యర్థులను మూడో దశకు ఎంపిక చేస్తారు. ఈ దశలో గ్రూప్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌, ఇంటర్వ్యూ ఉంటాయి. సైకోమెట్రిక్‌‌ టెస్ట్‌‌ నిర్వహించినా ఇది అర్హత పరీక్ష మాత్రమే. రెండో దశ మెయిన్స్‌‌లోని మొత్తం మార్కులను 75కూ, మూడో దశలోని గ్రూప్‌‌ ఎక్సర్‌‌సైజ్‌‌, ఇంటర్వ్యూలోని మొత్తం మార్కులను 25కూ కుదిస్తారు. మొత్తం 100 మార్కులకుగాను అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.

డిసెంబర్​లో ప్రిలిమ్స్​ 

ఒకేసారి ఎస్‌‌బీఐ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్‌‌, క్లర్క్‌‌ నోటిఫికేషన్లు వచ్చాయి. కాబట్టి పీఓ పరీక్షకు సిద్ధమైతే  క్లర్క్‌‌ పరీక్షకు సరిపోతుంది. పీఓ పరీక్షను లక్ష్యంగా చేసుకుంటే పరీక్ష తేదీకి అనుగుణంగా ప్రిపరేషన్‌‌ ప్రణాళిక వేసుకోవాలి. ప్రిలిమ్స్‌‌ డిసెంబర్​ 17, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనుండడంతో దాదాపు 75 రోజుల సమయం అందుబాటులో ఉంది. ఈ సమయంలో సరైన ప్రణాళికతో ప్రిపేర్‌‌ అయితే మొదటిసారి పరీక్ష రాసే అభ్యర్థులైనా విజయం సాధించవచ్చు.

ప్రిపరేషన్​ ప్లాన్​

ప్రిలిమ్స్​, మెయిన్స్​ లో కొన్ని మినహా చాలా వరకు సేమ్​ టాపిక్స్​ ఉన్నాయి. అందుకే మెయిన్స్​ ఎగ్జామ్​ ప్రిపేర్​ అయితే ప్రిలిమ్స్​ ప్రిపరేషన్​ పూర్తయినట్లే.
క్వాంటిటేటివ్‌‌ ఆప్టిట్యూడ్‌‌: ప్రిలిమ్స్​లో ఉన్న ఈ విభాగంలో సింప్లిఫికేషన్స్, నంబర్‌‌ సిరీస్, అప్రాక్సిమేట్‌‌ వాల్యూస్, క్వాడ్రాటిక్‌‌ ఈక్వేషన్స్, పర్ముటేషన్‌‌-కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్‌‌ప్రెటేషన్, అర్థమెటిక్‌‌ టాపిక్స్‌‌ ఉంటాయి.

రీజనింగ్‌‌ అండ్‌‌ కంప్యూటర్‌‌ ఆప్టిట్యూడ్‌‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌‌.. రెండిట్లోనూ రీజనింగ్‌‌ ఉంది. ఎస్‌‌బీఐ పీవో రీజనింగ్‌‌ ప్రశ్నలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా స్టేట్‌‌మెంట్‌‌ సంబంధ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవిగా అనిపించేలా ఉంటాయి. కంప్యూటర్‌‌ నాలెడ్జ్​ నుంచి 5-10 ప్రశ్నలు రావొచ్చు.

డేటా అనాలిసిస్‌‌ అండ్‌‌ ఇంటర్‌‌ప్రెటేషన్‌‌: మెయిన్స్‌‌లోని ఈ టాపిక్​ కోసంఅర్థమెటిక్‌‌ టాపిక్స్‌‌ బాగా ప్రిపేర్​ కావాలి.టేబుల్స్, లైన్‌‌ గ్రాఫ్‌‌లు, బార్‌‌ డయాగ్రమ్‌‌లు, పై చార్టులు, కేస్‌‌లెట్స్‌‌ నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. కాలిక్యులేషన్స్‌‌ వేగంగా చేయగలగాలి. ప్రాక్టీస్​ ఎక్కువ చేస్తే  మార్కులు ఎక్కువ స్కోర్​ చేయవచ్చు. 

ఇంగ్లిష్‌‌ లాంగ్వేజ్‌‌: ప్రిలిమ్స్, మెయిన్స్‌‌లతో పాటు డిస్క్రిప్టివ్‌‌ టెస్ట్‌‌లోనూ ఈ టాపిక్​ ఉన్నందున దీనిపై అభ్యర్థులు ఎక్కువ ఫోకస్​ చేయాలి. గ్రామర్​పై  ఎక్కువగా పట్టు పెంచుకోవాలి. ప్యాసేజీని వేగంగా చదివి, అర్థం చేసుకోగలిగితే రీడింగ్‌‌ కాంప్రహెన్షన్‌‌ ప్రశ్నలు త్వరగా సాధించవచ్చు. డిస్క్రిప్టివ్‌‌ టెస్ట్‌‌ కోసం లెటర్‌‌ రైటింగ్, ఎస్సే రైటింగ్‌‌ ప్రాక్టీస్​ చేయాలి. 
జనరల్‌‌/ఎకానమీ/బ్యాంకింగ్‌‌ అవేర్‌‌నెస్‌‌: కరెంట్​ అఫైర్స్​, బ్యాకింగ్​ టర్మినాలజీ, స్టాండర్డ్‌‌ జీకేల నుంచి ప్రశ్నలు అడుగుతారు. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తాయి. గత ఐదారు నెలల కరెంట్​ అఫైర్స్​ ప్రిపేర్​ కావాలి. 

​ సేమ్​ స్ట్రాటజీ

ఆర్​ఆర్​బీ మినహా ఎస్‌‌బీఐ పీఓ, ఐబీపీఎస్‌‌ పీఓ, ఎస్‌‌ఓ, ఆర్‌‌ఆర్‌‌బీ పీఓ, క్లర్క్‌‌ ప్రిలిమ్స్​ పరీక్షలన్నింటికీ ఒకటే ప్రిపరేషన్​ సరిపోతుంది. ప్రశ్నలు అడిగే స్థాయిలో మార్పులు ఉన్నా సిలబస్​లో మాత్రం పెద్దగా మార్పులు ఏమి ఉండవు. ప్రీవియస్​ పేపర్స్​ పరిశీలించి ప్రిపరేషన్​ సాగించాలి. ఐబీపీఎస్​ ఎగ్జామ్​కు సిద్ధమవుతున్న వారు అదే ప్రిపరేషన్​ ఎస్​బీఐ పీవోకు కొనసాగించాలి. ఆప్టిట్యూడ్, రీజనింగ్‌‌కు ఎక్కవ సమయం కేటాయించి ప్రాక్టీస్​ చేయాలి. దాంతో ఏ విభాగంలో పట్టు ఉంది, ఎక్కడ ఇబ్బంది పడుతున్నామో తెలుసుకోవచ్చు. ప్రాబ్లం సాల్వ్​ చేయడానికి సమయం తక్కువ ఉన్నందున టైమ్​మేనేజ్​మెంట్​ ముఖ్యం. 

ఓబీసీలకు ఏడు సార్లు చాన్స్​ 

ఎస్‌‌బీఐ పీఓ పరీక్ష రాయడానికి కొన్ని అవకాశాలు మాత్రమే ఉంటాయి. జనరల్‌‌/ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థులకు 4 సార్లు, ఓబీసీ అభ్యర్థులకు 7 సార్లు మాత్రమే పరీక్ష రాయచ్చు.ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు మాత్రం అపరిమితంగా రాసుకోవచ్చు. ఈ పరిమితి ప్రిలిమినరీ పరీక్షకు కాకుండా మెయిన్స్‌‌ పరీక్షకు మాత్రమే ఉంటుంది. 

నోటిఫికేషన్​

అర్హతలు: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:  2022  ఏప్రిల్​ 1 నాటికి జనరల్‌‌ అభ్యర్థులు 21- నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

అప్లికేషన్​ ఫీజు: రూ.750 (జనరల్‌‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌‌). ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఆక్టోబర్​ 12 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాలి. 

ప్రిలిమ్స్​:  డిసెంబర్​ 17/18/19/20 తేదీల్లో ఉంటుంది. 

మెయిన్స్‌‌​: జనవరి/ఫిబ్రవరి 2023

వెబ్‌‌సైట్‌‌: www.sbi.co.in

పీవోగా జాయినై.. చైర్మన్ గా రిటైర్​ అవ్వొచ్చు

ఎస్‌‌బీఐలో పీవోగా సెలక్ట్​ అయితే రెండు సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్‌‌ ఉంటుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేస్తే అసిస్టెంట్‌‌ మేనేజర్‌‌గా నియమిస్తారు. అద్భుత ప్రతిభ కనబరిచిన వారు అంచెలంచెలుగా డిఫ్యూటీ మేనేజర్‌‌, మేనేజర్‌‌, చీఫ్‌‌ మేనేజర్‌‌, ఏజీఎం, డీజీఎం, జనరల్‌‌ మేనేజర్‌‌, చీఫ్‌‌ జనరల్‌‌ మేనేజర్, డిఫ్యూటీ మేనేజింగ్‌‌ డైరెక్టర్, మేనేజింగ్‌‌ డైరెక్టర్, చివరకు చైర్మన్‌‌ హోదా వరకూ చేరుకోవచ్చు. స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియాకు విదేశాల్లోనూ బ్రాంచీలు ఉన్నందున టాలెంట్​ ప్రూవ్​ చేసుకుంటే ఇతర దేశాల్లోనూ పనిచేసే అవకాశం ఉంటుంది. 

ప్రిలిమ్స్​ 

సబ్జెక్ట్​    ప్రశ్నలు    మార్కులు

ఇంగ్లిష్​    30    30

ఆప్టిట్యూడ్​    35    35

రీజనింగ్​    35    35

మొత్తం    100    100


మెయిన్స్​

రీజనింగ్​ అండ్​ 
కంప్యూటర్​ ఆప్టిట్యూడ్​    40    50
డేటా ఎనాలసిస్​ అండ్​ 
ఇంటర్​ప్రిటేషన్​    30    50
జనరల్​ ఎకానమీ అండ్​ 
బ్యాంకింగ్​ అవేర్​నెస్​    50    60
ఇంగ్లిష్​    35    40
మొత్తం    155    200
లెటర్​ రైటింగ్​ 
అండ్​ ఎస్సే    2    50
గ్రూప్​ ఎక్సర్​ సైజ్​     20 మార్కులు
ఇంటర్వ్యూ        30 మార్కులు