- బీఆర్‌ఎస్‌కు రిజైన్ చేసిన జడ్పీ ఫ్లోర్‌లీడర్, ఎంపీపీ, కీలక నేతలు
- ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
నల్గొండ, వెలుగు: నల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. నల్గొండ మున్సిపల్కౌన్సిలర్లతో మొదలైన వలసల పర్వం మండలాల వరకు విస్తరించింది. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి వైఖరి నచ్చక... ఒకప్పుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయత్వంలో పనిచేసిన వారందరు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మంత్రి కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి అసమ్మతి నేతలను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నా వలసలు మాత్రం ఆగడం లేదు.
బుధవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు జడ్పీ ఫ్లోర్ లీడర్ పాశం రామిరెడ్డి, తిప్పర్తి ఎంపీపీ ఎన్. విజయలక్ష్మి, డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ముత్తినేని శ్యామ్‌తో సహా పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. ఎంపీ కోమటి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిపోయారు.
ఫలించని కేటీఆర్ బుజ్జగింపులు
రామిరెడ్డితో సహా కీలక నేతలను బుజ్జగించేందుకు మంత్రి కేటీఆర్రెండు రోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రాజకీయంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వేధింపులు భరించలేకనే పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్టు వారు తేల్చిచెప్పారు. కోమటిరెడ్డి నాయకత్వంలో నల్గొండలో కాంగ్రెస్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. నల్గొండ మున్సిపల్ కౌన్సిలర్ల ఎపిసోడ్‌తో ఇప్పటికే గందరగోళంలో పడ్డ బీఆర్ఎస్‌ను తిప్పర్తి మండల నాయకులు కోలుకోలేని దెబ్బ తీశారు. కనగల్, నల్గొండ మండలానికి చెందిన పలువురు ముఖ్య ప్రజాప్రతినిధులు సైతం త్వరలో కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసింది.
మిమ్మల్ని ఎమ్మెల్యే వేధిస్తాడనే రాలేకపోయా : ఎంపీ కోమటిరెడ్డి
తాను నల్గొండలో తిరిగితే ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన వర్గం నేతలను వేధిస్తాడనే కారణంతోనే ఎక్కువగా రాలేకపోయానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఐదేళ్లు రుణపడి ఉంటానని, నల్గొండను ప్రశాంతంగా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు లాంటి వాళ్లే కాంగ్రెస్‌లో చేరుతున్నారంటే బీఆర్ఎస్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు.
కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గెలిచిన రెండు నెలలకే చందర్రావును అనరాని మాటలు అన్నాడని గుర్తు చేశారు. తాను నాలుగు టర్మ్‌లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎప్పుడైనా, ఎవరినైనా వేధించానా..? అని ప్రశ్నించారు. గతంలో మిగిలిన పనులు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తానని, గురువారం నుంచి గ్రామాల్లో తిరుగుతానని ప్రకటించారు. బుధవారం రాత్రి వరకు అభ్యర్థుల కసరత్తు పూర్తి అవుతుందని చెప్పారు.
సుందిళ్లపైనా అనుమానం
కాళేశ్వరం కట్టే సమయంలోనే నాణ్యత లేదని చెప్పామని, మెడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీ మీద కూడా అనుమానం ఉందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతంలో మోటార్లు మునిగిన సమయంలో కాంట్రాక్టర్ రిపేర్ చేయాల్సి ఉన్నా.. సర్కారు రూ.150 కోట్లు వెచ్చించి రిపేర్లు చేయించిందని గుర్తు చేశారు. తాము అధికారంలోకి రాగానే కాళేశ్వరంపై పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామని ప్రకటించారు.
ALS0 READ: దళితబంధు ఇప్పిస్తానని మోసం బీఆర్ఎస్ లీడర్ కారు గుంజుకెళ్లిన్రు!
కమ్యూనిస్టులతో పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయని చెప్పారు. తమకు మిర్యాలగూడ బలమైన సీటని స్పష్టం చేశారు. పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసే బాధ్యత తనకు అప్పజెప్పిందన్నారు. మంథనిలో అడ్వకేట్ కుటుంబాన్ని చంపిన వాళ్లకు బీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చిందని, అమెరికాలో చదువుకున్న కేటీఆర్తెలివి ఇదేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాను తిడితే పాపం తగులుద్దని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం ఆస్తుల వివరాలు అఫిడవిట్‌లో బయట పెడ్తామని హెచ్చరించారు.