మునుగోడు మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పలువురిని కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం బీజేపీకి మద్దతుగా కార్యకర్తలు కమ్మగూడెం నుంచి మునుగోడు బీజేపీ క్యాంప్ ఆఫీస్ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. మునుగోడు సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి రాజగోపాల్ రెడ్డి నివాళులు అర్పించారు. ఆ తర్వాత బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన పార్టీల లీడర్లందరూ ఇప్పటికే మునుగోడుకు చేరుకుని ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా నాయకులంతా కృషి చేస్తున్నారు. అభ్యర్థుల భవితవ్యం యువత మీదే ఆధారపడి ఉన్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉండడంతో అన్ని పార్టీలు వారి మీదే ఫోకస్ పెట్టాయి. ఇక్కడ దాదాపు సగం మంది ఓటర్లు యువతే కావడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నాయని సమాచారం.