
మెదక్/నిర్మల్/ఆదిలాబాద్, వెలుగు: బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఆధ్వర్యంలో నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పలువురు కౌన్సిలర్లు సోమవారం హైదరాబాద్ వచ్చారు. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదేవిధంగా.. బీజేపీ నేత, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ కూడా రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
అలాగే, మెదక్ జిల్లా నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్లు ఈశ్వర్, చంద్రపాల్‌తో పాటు భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు గాంధీభవన్ తరలివచ్చారు. అక్కడ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు సమక్షంలో అందరూ కాంగ్రెస్‌లో చేశారు.
చిలప్‌చెడ్ ఎంపీపీ వినోద, హత్నూ జడ్పీటీసీ సభ్యుడు ఆంజనేయులు, నర్సాపూర్ మాజీ ఎంపీపీ లలిత, వెల్దుర్తి మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి సమక్షంలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న కాంగ్రెస్‌లో చేరారు.