ఖమ్మం కార్పొరేషన్/ కూసుమంచి : ఖమ్మంలో వచ్చే నెల 2న జరగనున్న తెలంగాణ గర్జన సభ ఉమ్మడి వేదికగానే ఉంటుందని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లా సరిహద్దుల్లోని మామిళ్లగూడెంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఆయన భేటీ అయ్యారు. ఈ మీటింగ్ లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత ఖమ్మంలో బహిరంగ సభావేదికను మాణిక్ రావు ఠాక్రే, పొంగులేటి కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మామిళ్లగూడెంలో, ఖమ్మంలోని పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో మాణిక్‌రావు ఠాక్రే మీడియాతో మాట్లాడారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా సభా వేదికపై భట్టి విక్రమార్కను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానిస్తారని చెప్పారు. అదే బహిరంగ సభలో ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని తెలిపారు. భట్టి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర, ఏఐసీసీ దిశా నిర్దేశం మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్ర చేశారన్నారు. ఈ యాత్రలు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి దోహదపడతాయన్నారు. మరో మూడు రోజుల్లో భట్టి పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ దగ్గరుండి కో ఆర్డినేషన్ చేస్తారని చెప్పారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మం నగరంలోకి ప్రవేశించగానే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారని చెప్పారు.
ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి రూ.వేల కోట్లు ఎక్కడివి?
ప్రజల సంపదను కేసీఆర్ లూటీ చేస్తున్నారని మాణిక్‌రావు ఠాక్రే ఆరోపించారు. మహారాష్ట్రకు 600 వాహనాలతో వెళ్లడం వెనక దాగి ఉన్న ఉద్దేశం ఏమిటని, ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి కేసీఆర్ కు రూ.వేల కోట్లు ఎవరిస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ప్రజలది కాదా అని నిలదీశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చే విధంగా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఇప్పటికి జైల్లోనే ఉన్నారని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా విచారించారన్నారు. కానీ, అదే స్కాంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవితను అరెస్టు చేస్తామని హడావిడి చేసిన దర్యాప్తు సంస్థలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయని ప్రశ్నించారు. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఇద్దరూ ఒకే కేసులో నిందితులైనప్పుడు కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాత, కొత్త కలయికతో కాంగ్రెస్‌లో సరికొత్త జోష్ కనిపిస్తుందన్నారు. తెలంగాణ గర్జన సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో సభకు అంచనాకు మించి జనం వచ్చే అవకాశం ఉన్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు.
బీఆర్ఎస్ గుండె పగలడం ఖాయం : పొంగులేటి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ హాజరయ్యే తెలంగాణ గర్జన సభకు వచ్చే జనాన్ని చూసి బీఆర్ఎస్ నేతల గుండెలు పగిలిపోవడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో నిర్వహించి ఆహా ఓహో అన్నారని, రాని జనాన్ని కూడా వచ్చినట్లు అంకెల్లో చూపారని విమర్శించారు. జూలై 2న ఖమ్మంలో జరిగే తెలంగాణ జనగర్జన సభకు ఎంతమంది జనం వస్తారో తాము లెక్కేసి చెప్పడం కాదని, మీరే లెక్కపెట్టుకోండని సవాల్ విసిరారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ జన గర్జన సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతమై తీరుతుందన్నారు.
కలిసి పని చేయండి
మామిళ్లగూడెంలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మాణిక్ రావు ఠాక్రే, రోహిత్ చౌదరి కొద్ది సేపు మాట్లాడారు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీటింగ్ విషయంలో అభిప్రాయ బేధాలు లేకుండా కలిసి పనిచేయాలని వారికి మాణిక్ రావు ఠాక్రే సూచించారు. పాదయాత్ర ముగింపు సభనా లేక, పొంగులేటి చేరికల మీటింగా అనే చర్చల నేపథ్యంలో భట్టి, పొంగులేటికి మాణిక్ రావు ఠాక్రే సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. అందరూ సమన్వయంతో మీటింగ్ ను సక్సెస్ చేయాలని సూచించినట్టు సమాచారం. ఈ మీటింగ్ తర్వాత ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్‌తో పాటు ముఖ్య నేతలు మాణిక్ రావు ఠాక్రే, పొంగులేటి వెంట సభావేదికను పరిశీలించేందుకు వెళ్లారు.