నర్సాపూర్​లో కీలక పరిణామం..కాంగ్రెస్‌లోకి సుహాసినిరెడ్డి, శేషసాయిరెడ్డి

నర్సాపూర్ /కౌడిపల్లి, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్​ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ ​లీడర్, ​కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్​గా పనిచేసిన దివంగత చిలుముల కిషన్​రెడ్డి భార్య, బీఆర్ఎస్​ మహిళా విభాగం ఉమ్మడి మెదక్​ జిల్లా మాజీ అధ్యక్షురాలు చిలుముల సుహాసినిరెడ్డి, ఆమె కొడుకు చిలప్ చెడ్ మాజీ జడ్పీటీసీ శేషసాయిరెడ్డి గురువారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ​వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్ రావ్ థాక్రే, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

నర్సాపూర్​ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ​ప్రజాప్రతినిధులు, నాయకుల తీరు నచ్చక శేషసాయిరెడ్డి ఏడాదిన్నర కింద జడ్పీటీసీ పదవికి, బీఆర్​ఎస్​ కు రాజీనామా చేశారు. రెండు రోజుల కింద మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్​కుమార్, ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి కౌడిపల్లిలోని వారింటికి వెళ్లి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. దీంతో తాము కాంగ్రెస్​లో చేరామని శేషసాయిరెడ్డి ప్రకటించారు.

శివ్వంపేట మండలం గోమారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మెదక్ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సుధీర్ రెడ్డి, కౌడిపల్లి మండల బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చంద్రం కృష్ణ గౌడ్ కూడా పార్టీలో చేరారు. వెంట  గాలి అనిల్​ కుమార్​ ఉన్నారు.