హీటెక్కుతున్న ఆదిలాబాద్​ లోకల్బాడీ పాలిటిక్స్​

ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్​లో టీఆర్​ఎస్​, బీజేపీలో చేరికలు హాట్​ టాపిక్​గా మారుతున్నాయి.  ఈక్రమంలో ఖాళీగా ఉన్న ఆదిలాబాద్ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నిక తెరపైకివచ్చింది. వారం రోజుల నుంచి బీజేపీ కౌన్సిలర్లు టీఆర్ఎస్ లో చేరడంతో  బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  గత రెంరేండ్ల కిందట టీఆర్​ఎస్​కు చెందిన ఆదిలాబాద్ రూరల్​ జడ్పీటీసీ ఆరే రాజన్న మరణించడంతో ఆ స్థానం నేటికీ ఖాళీగా ఉంది. గతంలో ఉప ఎన్నిక కోసం అధికారులు ఏర్పాట్లు చేసినప్పటికీ  వాయిదా పడింది. కానీ, తాజాగా పార్టీలు మారుతున్న నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ లు ఎన్నికకు సిద్ధంగా అంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. తమ లీడర్లను భయపెట్టి టీఆర్ఎస్ లో చేర్పించుకుంటున్నారని పాయల్​ శంకర్​  కామెంట్లు చేశారు.  అలా కాకుండా ఎన్నికల్లో గెలవాలని సవాల్ విసిరారు. మరోవైపు జైనథ్ మండల లీడర్లు కొందరు ఆదివారం బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇరు పార్టీల్లో చేరికలు నాయకుల మధ్య  సవాళ్లు మరింత జోరందుకున్నాయి.  

ఎలక్షన్​ ఎప్పుడో.. 
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్​ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రెండేళ్లుగా ఖాళీలు ఏర్పడినప్పటకీ బై ఎలక్షన్స్ నిర్వహించడం లేదని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం వల్లే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ రూరల్ జడ్పీటీసీతో పాటు 5 ఎంపీటీసీ, 37 సర్పంచ్, 1311 వార్డు మెంబర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది మే నెలలో ఈ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మే 8న ఓటర్ల ముసాయిదా జాబితా, 12న రాజకీయ పార్టీలతో సమావేశం, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ వంటి ఎలక్షన్ లకు సంబంధించి అన్ని అంశాలతో మొత్తం ప్రక్రియ ను పూర్తి చేశారు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడమే తరువాయి అనుకున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడం గమనార్హం.