అన్యాయాన్ని ఎదిరిద్దాం

అన్యాయాన్ని ఎదిరిద్దాం
  • 1971 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన కొనసాగాలి
  • ఒకవేళ సీట్ల సంఖ్య పెంచినా  దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగొద్దు
  • సౌత్​స్టేట్స్​కు న్యాయం చేసేలా రాజ్యాంగ సవరణ చేయాలి
  • స్టాలిన్​ ఆధ్వర్యంలో చెన్నైలో  జేఏసీ మొదటి సమావేశం..పలు తీర్మానాలు 
  • తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌‌‌‌, పీసీసీ చీఫ్​ మహేశ్‌‌‌‌, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే కేటీఆర్​ హాజరు

చెన్నై:లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజనను1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే 2026 తర్వాత మరో 25 ఏండ్ల వరకు కొనసాగించాలని డీలిమిటేషన్​ జేఏసీ తీర్మానించింది.  ఒకవేళ లోక్​సభ సీట్ల సంఖ్య పెంచినా తమిళనాడుసహా దక్షిణాది రాష్ట్రాల లోక్​సభ సీట్లు తగ్గకుండా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని డిమాండ్​ చేసింది.  కొనసాగుతున్న పార్లమెంట్​ సమావేశాల్లో  ప్రధాని మోదీపై జేఏసీలోని ఎంపీలంతా ఒత్తిడి తేవాలని, ఆయా రాష్ట్రాలనుంచి శాసనసభ తీర్మానాలను తీసుకురావాలని నిర్ణయించింది.

డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకతను పాటించాలని జేఏసీ పేర్కొన్నది. జేఏసీ తీర్మానాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి చదివి వినిపించారు. డీలిమిటేషన్​ అంశంపై కేంద్రం మొదట స్పష్టత ఇవ్వాలని కోరారు.  కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఏ డీలిమిటేషన్ ప్రక్రియ అయినా ప్రజాస్వామ్యాన్ని బలపర్చేలా పారదర్శకంగా ఉండాలని చెప్పారు. అన్ని రాష్ట్రాల రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలకు దానిపై చర్చించడానికి వీలు కల్పించాలని కోరారు. 

దక్షిణాది రాష్ట్రాలకుడేంజర్​బెల్​: పినరయి విజయన్​

ఎలాంటి చర్చలు, సంప్రదింపులు లేకుండానే కేంద్రం లోక్​సభ నియోజకవర్గాల పునర్విభజన చేయాలని భావిస్తున్నదని కేరళ సీఎం పినరయి విజయన్​ అన్నారు. ఇది దక్షిణాది రాష్ట్రాలకు డేంజర్​బెల్​ లాంటిదేనని, మన రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి అని పేర్కొన్నారు. పార్లమెంట్‌‌‌‌లో మన ప్రాతినిధ్యం తగ్గితే.. దేశ సంపదలో మన వాటా కూడా తగ్గుతుందని, దీన్ని మనం ఎన్నటికీ అనుమతించకూడదని అన్నారు. 

సీట్లు పెరిగినా మాకు అన్యాయమే: భగవంత్​ మాన్

డీలిమిటేషన్ తర్వాత ఉత్తరాదిన లోక్​సభ సీట్ల సంఖ్య పెరిగినా.. తమకు అన్యాయమే జరగుతుందని పంజాబ్​ సీఎం భగవంత్​మాన్​ పేర్కొన్నారు.  జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే తమ లోక్​సభ సీట్లు  13 నుంచి 18కి పెరుగుతాయని, అయితే మొత్తం సీట్లలో తమ ప్రాతినిధ్యం 2.39 శాతం నుంచి 2.11 శాతానికి తగ్గుతుందని తెలిపారు. అంటే పార్లమెంట్ లో పంజాబ్​ ప్రాతినిధ్యం తగ్గిపోతుందని వివరించారు.  పంజాబ్‌‌‌‌లో ప్రస్తుత సీట్ల శాతాన్ని అదే స్థాయిలో కొనసాగించాలనుకుంటే, తమకు 21 సీట్లు ఇవ్వాలని కోరారు. 

సీట్ల సంఖ్యను తగ్గించుకోం: డీకే శివకుమార్​

జనాభా నియంత్రణ, అక్షరాస్యతను పాటిస్తూ సౌత్​స్టేట్స్​అన్నీ జాతీయ ప్రయోజనాలను కాపాడుతున్నాయని కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ అన్నారు. ఆర్థికంగా, అక్షరాస్యతపరంగా తాము స్థిరంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్​సభ సీట్లను తగ్గించుకోబోమని అన్నారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్​ ప్రక్రియ జరగకుండా పోరాడుతామని చెప్పారు. జనాభా ఆధారంగా డీలిమిటేషన్​ చేస్తే జాతీయ ప్రయోజనాలను కాపాడేందుకు జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేడీ చీఫ్, ఒడిశా మాజీ సీఎం నవీన్​పట్నాయక్​ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారు. పాపులేషన్​ ఆధారంగా డీలిమిటేషన్​ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్​ కాంగ్రెస్​కమిటీ ప్రెసిడెంట్​ వైఎస్​షర్మిల అన్నారు. అలాంటి ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని ఒక ప్రకటనలో తెలిపారు. 

ప్రధానికి జగన్​ లేఖ

డీలిమిటేషన్​ జేఏసీ భేటీకి హాజరుకాని వైఎస్సార్సీపీ చీఫ్​ జగన్​మోహన్​రెడ్డి.. ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ ప్రక్రియలో ఏ రాష్ట్రంకూడా ప్రాతినిధ్యం కోల్పోకూడదని అన్నారు. అటు లోక్‌‌‌‌సభ.. ఇటు రాజ్యసభలో.. ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండే విధంగా రాబోయే నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు నిర్వహించాలని కేంద్రాన్ని కోరుకుంటున్నా అని లేఖలో పేర్కొన్నారు. 

అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే భేటీ: బీజేపీ

డీలిమిటేషన్​ జేఏసీ మీటింగ్​పై బీజేపీ విమర్శలు చేసింది. జేఏసీలోని నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఈ భేటీ నిర్వహిస్తున్నారని బీజేపీ నాయకురాలు తమిళి సై ఆరోపించారు.దీన్ని డీలిమిటేషన్​జేఏసీ మీటింగ్​ అనే బదులు.. అవినీతిని దాచిపెట్టే సమావేశమని పిలువాలని చురకలంటించారు. దేశీయ ఆందోళనల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే స్టాలిన్​.. రాజకీయ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని తమిళనాడు బీజేపీ చీఫ్​ కే అన్నామలై అన్నారు.  కేరళతో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ స్టాలిన్​ ఆ రాష్ట్రానికి వెళ్లలేదుగానీ.. ఆయన సృష్టించిన కృత్రిమ ఉద్యమానికి మాత్రం కేరళ సీఎంను ఆహ్వానించారని విమర్శించారు. కర్నాటక సీఎం సిద్ధరామయ్యను ప్రాంతీయ లీడర్​గా చిత్రీకరించి.. తాను పాన్​ ఇండియా లీడర్​గా ఎస్టాబ్లిష్​ అయ్యేందుకే డీకే శివకుమార్​ ఈ భేటీకి పరుగెత్తుకొని వచ్చారని ఎద్దేవా చేశారు. 

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు: ఎంకే స్టాలిన్​

డీలిమిటేషన్​ జేఏసీ సమావేశంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్​ మాట్లాడుతూ.. తమ నిరసన పునర్విభజనకు వ్యతిరేకంగా కాదని అన్నారు. డీలిమిటేషన్​ ప్రక్రియ న్యాయబద్ధంగా, పారదర్శకంగా చేయాలని తాము డిమాండ్​ చేస్తున్నట్టు చెప్పారు. పాపులేషన్​ ఆధారంగా డీలిమిటేషన్​చేస్తే  దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని అన్నారు. సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మిగిలిపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘డీలిమిటేషన్‌‌‌‌ కారణంగా పార్లమెంట్‌‌‌‌లో మన ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. మన గొంతు వినిపించే వాళ్లు తగ్గిపోతారు. మన అభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. భవిష్యత్‌‌‌‌ శ్రేయస్సుకు, స్త్రీల హక్కులకు కూడా భంగం కలుగుతుంది” అని అన్నారు.  నియోజకవర్గ పునర్విభజన న్యాయబద్ధంగా జరిగే వరకూ తమ పోరాటం ఆగదని తెలిపారు. అవసరమైతే ఈ ప్రక్రియను సవాలు చేయడానికి, సమగ్ర చట్టపరమైన వ్యూహాన్ని రూపొందించడానికి ఒక న్యాయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ సందర్భంగా తాజా భేటీని ‘జాయింట్‌‌‌‌ యాక్షన్‌‌‌‌ కమిటీ ఫర్‌‌‌‌ ఫెయిర్‌‌‌‌ డీలిమిటేషన్‌‌‌‌’గా పిలుద్దామని స్టాలిన్​ పేర్కొన్నారు.  

 జేఏసీ తీర్మానాలివే..

డీలిమిటేషన్​పై కేంద్రం స్పష్టతనివ్వాలి
1971 జనాభా లెక్కల ప్రకారమేమరో 25 ఏండ్లు  నియోజకవర్గాల పునర్విభజన​ ఉండాలి
డీలిమిటేషన్​పై పారదర్శకత, స్పష్టత లేకపోవడంపై జేఏసీ ఆందోళన
జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలను ప్రోత్సహించాలి
న్యాయమైన డీలిమిటేషన్​కోసమే జేఏసీ పోరాటం
రాష్ట్రాలతో సంప్రదింపులు లేకుండా చర్యలు సరికాదు
42,84,87 రాజ్యాంగ సవరణలు ఉద్దేశం విస్మరించొద్దు
హైదరాబాద్​లో తదుపరి డీలిమిటేషన్​ సమావేశంఏర్పాటుకు నిర్ణయం