- ఎస్ఎస్ఏ జేడీపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల కక్షసాధింపు
- ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లోనే ఉండి స్కీములు పర్యవేక్షించాలని ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో ఉన్నతాధికారుల తీరు వివాదాస్పదమవుతున్నది. ఒక్కరిద్దరిని టార్గెట్చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రమోషన్ కోసం కోర్టుకు వెళ్లాడన్న కోపం సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ)లో పనిచేస్తున్న జాయింట్ డైరెక్టర్ (జేడీ) రాజీవ్ ను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ఆఫీసులో అడుగుపెట్టొద్దని చెప్పడం డిపార్ట్మెంట్లో హాట్‌టాపిక్‌గా మారింది. హైదరాబాద్ హెడ్ఆఫీస్లో పనిచేస్తున్న జేడీ రాజీవ్‌ను ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోనే ఉండి మన ఊరు–మన బడి, సమగ్ర శిక్ష పనులతో పాటు ఇతర కార్యక్రమాలు పర్యవేక్షించాలని 20 రోజుల కింద స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శనివారం సాయంత్రం 5 గంటలకు ఎస్ఎస్ఏ ఏఎస్పీడీ రమేశ్‌కు వివిధ పనుల డెవలప్మెంట్పై రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. గతనెల 27న జారీ చేసిన ఈ ఆదేశాలపై స్కూల్ ఎడ్యుకేషన్లోని అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు.. శ్రీదేవసేనను కలిసి వాటిని రద్దు చేయాలని కోరినా ఆమె స్పందించ లేదు. ‘ఓ మూర్ఖుడి కోసం ఇంత మంది వస్తారా’ అంటూ వారిపై విరుచుకుపడినట్టు సమా చారం.
ప్రమోషన్ ఆగడంతో కోర్టుకు జేడీ
వివిధ కేసుల నేపథ్యంలో జేడీగా ఉన్న రాజీవ్‌కు ప్రమోషన్ ఆగింది. దీనిపై ఆయన రెండేండ్ల కింద హైకోర్టును ఆశ్రయించారు. ప్రమోషన్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు స్పందించలేదు. దీంతో కోర్టు ధిక్కారణపై ఆయన మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలో అడిషనల్ డైరెక్టర్ పోస్టులపై క్లారిటీ లేదని జీఏడీ తెలపడంతో ఆ ప్రక్రియ అక్కడే ఆగిపోయింది. ఇదిలాఉంటే ప్రమోషన్ విషయంలో డైరెక్టర్, విద్యాశాఖసెక్రటరీ కోర్టుకు రావాల్సి వచ్చింది. ఇది సదరు అధికారులకు కోపం తెప్పించిందని అంటున్నారు. ఈ కారణంతోనే హైదరాబాద్‌లోని ఎస్ఎస్ఏ డైరెక్ట రేట్లో ఉండాల్సిన జేడీ రాజీవ్‌ను జిల్లాలు తిరగాలంటూ ఆదేశాలిచ్చారు. డైరెక్టరేట్ లో అడుగుపెట్టొద్దని ఓరల్ గా చెప్పినట్టు సమాచారం. కానీ జిల్లాల్లో ఆయనకు అప్పగించిన పనులు పూర్తవడంతో ఈ మధ్యనే డైరెక్టరేట్‌కు వచ్చారు. దీంతో ఆయనకు మళ్లీ ఆసిఫాబాద్, ఆదిలాబాద్ వెళ్లాలని రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వడం స్కూల్ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కలకలం రేపింది. దీన్ని ఆపాలని కిందిస్థాయి అధికారులు కోరినా పట్టించుకోవడంపై వారంతా మండిపడుతున్నారు. గతంలో చాలామంది టీచర్లు, నలుగురైదుగురు అధికారులు కోర్టుకుపోయిన తర్వాతే వారికి ప్రమోషన్లు, బదిలీలు జరిగాయి. వారెవరిపై లేని కక్ష సదరు అధికారిపై ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ALSO READ :చిప్‌ల కొరతతో చిక్కులు
కక్షసాధింపేమీ లేదు
ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లో పలు పనులు సరిగా జరగడం లేదని, అందుకే జేడీ స్థాయి అధికారిని అక్కడికి పంపించామని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘అదేమీ పాకిస్తాన్ కాదు కదా.. ఆయనపై కక్ష సాధింపేమీ లేదు’ అని చెప్పారు. నెలల తరబడి జిల్లాలు తిప్పడంపై అడగ్గా.. ‘ఎక్కడ అవసరముంటే అక్కడికు పంపే అధికారం మాకుంది. నేనూ స్కూళ్లు తిరుగుతున్నా కదా’ అంటూ సమాధానమిచ్చారు.