పల్లె పోరుకు సై .. ఓటరు జాబితా రిలీజ్​

పల్లె పోరుకు సై .. ఓటరు జాబితా రిలీజ్​
  • నేడు పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల 
  • ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం రెడీ

నల్గొండ, యాదాద్రి, వెలుగు : లోకల్ బాడీ ఎన్నికలకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం రెడీ అయింది. అవసరమైన ఏర్పాట్లలో ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఓటరు జాబితాను విడుదల చేశారు. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో పురుషుల కంటే  మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్‌‌‌‌ ఎలక్షన్లు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈనెల 15న తర్వాత ఎన్నికల కమిషన్‌‌‌‌ షెడ్యూల్‌‌‌‌ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.  

సర్పంచ్​ల పదవీకాలం గతేడాది జనవరిలో ముగియగా, జిల్లా, మండల పరిషత్‌‌‌‌ పాలకవర్గాల పదవీకాలం జూలైతో ముగిసింది. దీంతో పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లింది.  ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో అధికారులు ఓటర్ ముసాయిదా జాబితాను ప్రకటించారు. ఈనెల 12న పంచాయతీలకు సంబంధించి ట్రైనింగ్​ ఇవ్వనుండగా 13న ఎంపీటీసీలకు సంబంధించి ట్రైనింగ్​ఇవ్వనున్నారు . 

పోలింగ్ కేంద్రాల ముసాయిదా విడుదల..

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను నేడు ప్రకటించనున్నారు. 13న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఉండగా, పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై అభ్యంతరాలుంటే 14న పరిష్కరిస్తారు. 15న పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తారు. 

జిల్లాకు చేరిన పోలింగ్ బాక్సులు..

పంచాయతీ ఎన్నికలు గతంలో మాదిరిగా మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఎంపీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో నిర్వహించే అవకాశాలున్నాయి. నల్లగొండ జిల్లాలో గ్రామ పంచాయతీలు 844 ఉండగా, కొత్తగా 24 పెరిగాయి. దీంతో గ్రామ పంచాయతీల సంఖ్య 868కి చేరింది. 352 ఎంపీటీసీ స్థానాలు, 33 జడ్పీటీసీ స్థానాలున్నాయి. ఎన్నికలకు 5,876 పోలింగ్ బాక్సులు అవసరం కాగా, 3,676 పోలింగ్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన 2,220 బాక్సులను ఏపీ నుంచి తెప్పించారు. పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిన నిర్వహిస్తుండడంతో జిల్లాలో 25 లక్షల బ్యాలెట్ పేపర్లు అవసరం ఉండగా ఇప్పటికే పేపర్లను ముద్రించారు. 

సూర్యాపేట జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా, కొత్తగా 11 పంచాయతీలు పెరిగాయి. దీంతో 486 కు చేరింది. జిల్లాలో 23 జడ్పీటీసీలు, 235 ఎంపీటీసీ స్థానాలకు  రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే 2,500 పోలింగ్ బాక్స్​లు అవసరం ఉండగా, మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తే 2,200 పోలింగ్ బాక్సులు అవసరం పడనున్నాయి. అవసరమైన బాక్సులను ఏపీ నుంచి తెప్పించారు. జిల్లాలో 7 లక్షల బ్యాలెట్ పేపర్లు అవసరం కానుంది. 

యాదాద్రి జిల్లాలో 421 పంచాయతీలు ఉండగా కొత్తగా 7 పెరిగి 428కి చేరాయి. పంచాయతీ ఎన్నికల కోసం అవసరమైన 13 లక్షల బ్యాలెట్ పేపర్లు ఇప్పటికే ప్రింట్ చేశారు. బ్యాలెట్​ బాక్సులు 1,580 రెడీగా ఉండగా, మరో 700 అవసరం పడనున్నాయి. 3,719 పోలింగ్​ స్టేషన్లను గుర్తించారు. 4,500 మంది పోలింగ్ ఆఫీసర్లను నియమించారు. జడ్పీటీసీలు 17 ఉన్నాయి. ఎంపీటీసీలు 177 ఉండగా, ఒకటి పెరగడంతో 178కి చేరాయి. 1,067 పోలింగ్ స్టేషన్లను గుర్తించారు. 

మహిళా ఓటర్లే ఎక్కువ..

జిల్లాలవారీగా ఓటర్ల జాబితాను ఆఫీసర్లు విడుదల చేశారు. మూడు జిల్లాల్లోనూ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.