
- రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
- సీసీ కెమెరాల నిఘాలో నిర్వహణ
- ఇందూర్ జిల్లాలో 36,222 మంది, కామారెడ్డిలో 18,469 మంది విద్యార్థులు
- పరీక్షా సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల ఏర్పాటు
- ఆయా శాఖల కోఆర్డినేషన్‌కు కలెక్టర్ల ఆదేశాలు
నిజామాబాద్, వెలుగు: ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను పూర్తి చేసింది. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండడంతో పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులను కల్పించారు. మాస్ కాఫీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ, ఎన్పీడీసీఎల్, మెడికల్ డిపార్ట్, పోలీస్, పోస్టల్ శాఖలు కలిసి సమన్వయంతో పని చేయాలని ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఇది వరకే రెండుసార్లు సమావేశాలు నిర్వహించి ఉత్తర్వులు జారీ చేశారు.
సబ్జెక్ట్ తెలియని వారే ఇన్విజిలేటర్లు..
నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 17,789, సెకండ్ ఇయర్ విద్యార్థులు 18,433 కలిపి మొత్తం 36,222 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఓకేషనల్ కోర్సుకు సంబంధించి 2,736 మంది విద్యార్థులు ఉండగా, 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్, తాగునీరు, ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ సరఫరా లోపాలను సరిచేశారు. వేలాది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో మెడికల్ డిపార్ట్మెంట్ను ఆప్రమత్తం చేసి ఫస్ట్ ఎయిడ్ చికిత్సను అందుబాటులో ఉంచారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పలు శాఖల అధికారులు విధుల్లో పాల్గొననున్నారు.
ప్రతి సెంటర్ ఆవరణలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా సెంటర్‌లోనికి ఉదయం 8.15 గంటల నుంచి అనుమతించి 9 గంటలకు గేట్లు క్లోజ్ చేయనున్నారు. ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లాలోని అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడుపనున్నారు. ప్రతి సెంటర్లో ఒకరి చొప్పున మొత్తం 57 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 57 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించనున్నారు. ముగ్గురు ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు, ఎనిమిది మంది సిట్టింగ్ స్వ్కాడ్, ఒక హైపవర్ కమిటీ పరీక్షలను పర్యవేక్షించనున్నది. సబ్జెక్ట్‌తో సంబంధంలేని లెక్చరర్లను ఇన్విజిలేషన్ కోసం ఎంపిక చేశారు. సెల్ఫోన్లకు అనుమతి లేదు.
సీసీ కెమెరాల మధ్య ప్రశ్నాపత్రాల ఓపెన్..
పోలీస్ స్టేషన్‌కు చేరుకునే ప్రశ్నాపత్రాలు పరీక్ష ప్రారంభమయ్యే అరగంట ముందు సెంటర్లకు చేరుతాయి. సీసీ కెమెరాల మధ్యే ఓపెన్ చేసి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.
కామారెడ్డి జిల్లాలో 18,469 మంది విద్యార్థులు
కామారెడ్డి జిల్లాలో ప్రధమ సంవత్సరం విద్యార్థులు 8,743 మంది, ద్వితీయ సంవత్సరం 9,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందుకుగాను 38 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షలను చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు పర్యవేక్షించనున్నారు.