నెట్వర్క్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సోనియాగాంధీ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించారు. రాజీవ్ఆరోగ్య శ్రీ పథకాన్ని సైతం ఉమ్మడి జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్లాంఛనంగా షురూ చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు తెలంగాణలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కలిగింది. నిజామాబాద్‌లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు మహిళలతో కలిసి జిల్లా జనరల్ హాస్పిటల్నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు బస్సులో ప్రయాణించారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చిందన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు, బాలికలు ఉచితంగా ప్రయాణం చేయొచ్చని, ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత రవాణా వర్తిస్తుందన్నారు. కార్యక్రమాల్లో ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూశర్మ జెండా ఊపి మహాలక్ష్మీ స్కీమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేశ్ మాట్లాడుతూ.. మహిళల రక్షణతో పాటు సాధికారిత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
మహిళలు, స్టూడెంట్స్, ట్రాన్స్జెండర్లుఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీ ప్రయాణ సౌకర్యం ఉంటుందన్నారు. మహిళలతో కలిసి కలెక్టర్, ఎస్పీ, డీటీవో వాణి, డీఎం ఇంద్ర, డీపీఎం సుధాకర్ప్రయాణించారు. పొతంగల్ లో కాంగ్రెస్ లీడర్లు సోనియా గాంధీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ నాయకులు వినయ్ రెడ్డి మహాలక్ష్మీ ఉచిత ప్రయాణ టికెట్ బ్రోచర్స్ ఆవిష్కరించారు. బోధన్‌లో మున్సిపల్‌చైర్ పర్సన్ తూము పద్మావతి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం పెంపు
రాజీవ్ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సాయాన్ని రూ.10 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్జనరల్ హాస్పిటల్లో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, కామారెడ్డి జిల్లా హస్పిటల్లో కలెక్టర్ జితే శ్వీ పాటిల్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం, జీజీహెచ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, డీఎంహెచ్‌వో లక్ష్మణ్‌సింగ్, డీసీహెచ్‌వో విజయశ్రీ పాల్గొన్నారు.
చదువుకు ఎంతో అనుకూలం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకం ద్వారా ఆయా స్కూళ్లు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరిన ట్లయింది. సొంతూరు నుంచి దూర ప్రాంతాలకు వెళ్లి కూడా చదువుకోవచ్చు. బస్సు పాస్‌కు పైసలు కట్టె బాధ తప్పింది.
జయశ్రీ, స్టూడెంట్, దోమకొండ
బస్‌పాస్ బాధ తప్పింది
కాలేజీకి వచ్చేందుకు ప్రతి నెల బస్సు పాస్‌కు పైసలు కట్టేవాళ్లం. రూ.వందల్లో ఖర్చయ్యేది. ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడంతో ఇక అమౌంట్ చెల్లించే బాధ తప్పింది. మా ఊరి నుంచి ఫ్రీగా బస్సులో రావడానికి వీలు కలుగుతుంది.
అర్చన, తాడ్వాయి మండలం