అంతా కమర్షియలే.. ఉమ్మడి కుటుంబాల ఉనికేది?

కొన్నేండ్ల క్రితం ఏ ఊరికెళ్లినా.. ‘‘అమ్మమ్మా తాతయ్య ఎక్కడ? వదినా అన్నయ్య ఏడి? మావయ్యా ఎక్కడికెళ్లావ్’ అన్న పలకరింపులు వినిపించేవి. ఇప్పుడు కనీసం మంచినీళ్లు తాగుతారా అన్న పలకరింపులకు కూడా నోచుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇండ్లలో ఉండేది తాతయ్యా.., నాయనమ్మలే. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతిందో ఆనాటి నుంచే కూతుళ్లు..కొడుకులు..మనవరాండ్లతో ఇండ్లు కళకళలాడుడుపోయింది. ఇప్పుడు కేవలం కమర్షియల్ బంధాలే కనిపిస్తున్నాయి. కరెన్సీ పిలుపులే వినిపిస్తున్నాయి. పిల్లలు ఫారిన్‌ కంట్రీస్​లో.. తాతయ్యలు నాయనమ్మలు ఓల్డేజ్​ హోమ్​లలో ఉంటున్నరు. దీనికంతటికీ కారణం అధిక సంపాదన మీదున్న అక్కరే ఎక్కువగా కనిపిస్తోంది.సంపదలకిచ్చే విలువలో కొద్దిగైనా బంధాలకిస్తే అవి నిలబడతాయి.. 

ఓ యాభై ఏండ్ల క్రితం అరవైఏండ్ల వయసున్న భార్యాభర్తలు సాయంత్రం ఇంటి వరండాలో కూర్చొని ఉంటే ఒక సంవత్సరం వయసు నుంచి పది సంవత్సరాల వయసు కలిగిన మనవలు, మనవరాళ్లు ఒకరు తొడమీద, ఇంకొకరు భుజాలపైన, మరొకరు వీపుపైన తాతా నాయనమ్మలపై కూర్చొని అల్లరి చేస్తూ, కేకలు పెడుతూ, ముద్దు ముద్దు మాటలతో మురిపిస్తూ ఉంటే, చిలిపి పనులు చేస్తూ ఉంటే ఎంతో సంతోషించేవాళ్లు. ఆస్తుల గర్వం కంటే మనుమరాళ్లను చూసుకోవడంలోనే ఎక్కువగా గర్వపడేవాళ్లు. రక్తసంబంధీకులను చూసి ఆనందంతో పొంగిపోయే వాళ్లు. ఇంటికి వచ్చిన బంధువులతో కానీ, పరిచయస్తులతో కాని ‘‘మాకు నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు, వాళ్లకు పాతికమంది పిల్లలు.. ”అంటూ గర్వంగా చెప్పుకునే వారు. కాలానుగుణంగా కుటుంబ నియంత్రణ అనివార్యమైందనుకోండి. పోనీ కొడుకుకు ఇద్దరు, కూతురుకు ఇద్దరు కలిపి నలుగురు మనవల, మనవరాళ్లతో అయినా ముద్దు ముచ్చటగా కలిసి జీవిస్తున్నారా? అది కూడా లేదు. మరి ఇప్పుడు ఆ బంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు ఎక్కడున్నాయి? మనుషుల జీవితాలు మొత్తం కమర్షియల్​తో నిండిపోయాయి.

బాధ్యతలు కలసి పంచుకునేవాళ్లు..

అప్పట్లో నలుగురు కొడుకులుంటే తండ్రి నలుగురికి పనులు పురమాయించేవాడు. ఆ వృత్తులను కొడుకులు ఎంతో నియమనిష్ఠలతో నిర్వహించేవారు. కొడుకులు ఉద్యోగస్తులైతే, నెల నెలా జీతం తండ్రి కిచ్చేవారు. ఇక తల్లి కోడళ్లకు ఒకరికి వంటపని, మరొకరికి ఇంటిపని ఇలా పనులను కేటాయించేది. ఉమ్మడి కుటుంబాలతో కలిసి మెలసి జీవిస్తుంటే ఎంతో కనుల పండువగా ఉండేది. తల్లిదండ్రులంటే భయం, భక్తి, ప్రేమ ఉండేది. కొడుకు, కోడలు కూడా అత్తామామల ఆజ్ఞలను శిరసావహిస్తూ, భయభక్తులతో మెలిగేవారు. ఒకవేళ తండ్రి చనిపోయినా, కొడుకులు స్థిర, చరాస్తుల్ని సమానంగా పంచుకొని, వేరు వేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నా కూడా కష్ట సుఖాల, శుభ అశుభ కార్యాల్లో కలిసి బాధ్యత వహించేవారు. మరి ఇప్పుడు కొడుకు ఓ దేశంలో, కూతురు మరో దేశంలో నివాసం. తల్లిదండ్రులు చనిపోతే వస్తున్నారు. దినవారాలు అయిపోగానే పిల్లల చదువులనీ, వాళ్ల ఉద్యోగాలనీ వెళ్లిపోతున్నారు. భవిష్యత్తులో ఈ వ్యవహారం కూడా మారి, తల్లిదండ్రులు చనిపోతే, కంప్యూటర్లలో వాళ్లున్న దగ్గరే చూసుకొని, బాధ్యతలను వదిలించుకునే పరిస్థితులు వస్తాయేమో. తల్లిదండ్రుల్లో ఒకరు పోయినా ఇంకొకరు ఒంటరి అయిపోతున్నారు. కొందరు అనాధ, వృద్ధ ఆశ్రమాలలో చేర్పిస్తున్నారు. ఇంకో పదేండ్లు బతికే అవకాశం ఉన్నా కూడా ఒంటరి జీవితం వల్ల రెండు మూడేళ్లకే చనిపోతున్నారు. 

సంపదల కంటే విలువ బంధాలకివ్వాలి..

ఒకే కడుపున పుట్టిన కొడుకులు కూడా చదువుల వల్ల, ఉద్యోగాల వల్ల పెళ్లైన తర్వాత పెండ్లాల వల్ల కలిసి జీవించలేకపోతున్నారు. ఐదారేండ్లకొకసారి కలుసుకోవడం కూడా చాలా అరుదు. ఇక తల్లిదండ్రులు పోయాక అన్నదమ్ములు కలుసుకొనుడు చాలా అరుదే. ఇప్పటి బంధాలు ఇలాగే ఉంటున్నాయి. సృష్టిలో మానవ జీవితం ఎంతో ప్రత్యేకమైనా పశుపక్ష్యాదుల్లా, జంతువుల్లా తయారైంది. ఇక భవిష్యత్తులో ఉమ్మడి కుటుంబాలు కనిపించకపోవచ్చు. కజిన్స్‌ కూడా గుర్తు పట్టలేని పరిస్థితులు కూడా రావచ్చు. పూర్వం అన్నదమ్ములు, ముని మనుమలు, మనుమలు కూడా ఎంతో ప్రేమగా కలుసుకున్నప్పుడు పలుకరించుకునే వారు.  బంధుత్వానికి అంత ప్రాముఖ్యత ఉండేది. విలువ ఇచ్చేవారు కూడా. ఉద్యోగ రీత్యా, వృత్తుల రీత్యా, వర్తక వ్యాపారాల రీత్యా ఇతర ఊర్లలో స్థిరపడ్డా పెండ్లిళ్లలో కాని, చావులలో కాని కలుసుకునే వారు. మరి ఇప్పుడు ఆ బంధాలు ఎక్కడున్నాయి? సొంత అన్న దమ్ముల పిల్లలు కూడా ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నారు. ఇప్పటి యువతరం బంధుత్వానికి ఏమాత్రం విలువ ఇవట్లేదు. ఏది ఏమైనా సంపదలకు ఎంత విలువ ఇస్తున్నామో.. అనుబంధాలకు, బాంధవ్యాలకు అంతకన్నా ఎక్కువ విలువిచ్చి కాపాడుకోవాలి. 

పశువుల గతే మనుషులకు కూడా..

రోజులు గడుస్తున్న కొద్దీ, మానవ జీవితాలలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనుషుల్లో స్వార్థం పెరిగిపోయింది. డబ్బు సంపాదించాలనే ఆశ, ఆశయం విపరీతంగా పెరిగింది. కడుపున పుట్టిన బిడ్డలే కంటికి కనబడకుండా పోతున్నారు. ఓ ఆవు దూడను కంటుంది, ఆ లేగ దూడ తల్లిపాలు తాగినన్ని రోజులూ తన తల్లిని అంటిపెట్టుకొని, చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఓ మూడు నాలుగేళ్ల తర్వాత పాలు మరిచి, సొంతంగా గడ్డి మేసే స్థితికి వస్తుంది. అప్పుడు యజమాని ఆవును అమ్మినా, దూడను అమ్మినా వేరే పశువుల గుంపులో కలిసి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు మన బంధాలు కూడా అలాగే అయ్యాయని చెప్పవచ్చు. 

- మునిగంటి శతృఘ్నాచారి, 
కార్యదర్శి, రాష్ట్ర బీసీ సంఘం.