గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తాం
ములకలపల్లి,వెలుగు: మండలంలోని గుండాలపాడు గ్రామానికి బీటీ రోడ్డు కోసం రూ.5 కోట్లు మంజూరైనట్లు అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. గురువారం గుండాలపాడు గ్రామంలో పలు శాఖల ఆఫీసర్లతో కలిసి పర్యటించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. మాజీ సర్పంచ్ కూతురికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. పోగల్లపల్లిలో అనారోగ్యంతో చనిపోయిన గజ్జల సందీప్ కుటుంబసభ్యులను పరామర్శించారు. తహసీల్దార్ వీరభద్రం, ఎంపీపీ మట్ల నాగమణి, ఎంపీడీవో చిన నాగేశ్వరావు, రైతుబంధు అధ్యక్షుడు నాగల వెంకటేశ్వరావు, సర్పంచ్ కారం కుమారి, ఎంపీటీసీ సరోజిని పాల్గొన్నారు.
ధనలక్ష్మిగా జగన్మాత
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీతాయారు అమ్మవారు ధనలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం అమ్మవారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత ఉత్సవమూర్తిని ధనలక్ష్మి రూపంలో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. మహానివేదన అనంతరం సామూహిక కుంకుమార్చన,లక్ష్మీ అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. ప్రాకార మండపంలో నిత్య కల్యాణం జరిగింది. చిత్రకూట మండపంలో శ్రీమద్రామాయణం అరణ్యకాండ పారాయణం చేశారు.
అన్నపూర్ణాదేవిగా పెద్దమ్మతల్లి
పాల్వంచ: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయంలో అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఆలయంలో సువర్ణ పుష్పార్చన, చక్రార్చనతో పాటు అమ్మవారికి రుద్రాభిషేకం, రుద్రహోమం నిర్వహించారు. మండలంలోని నరసమ్మ తల్లి ఆలయానికి చీరె, సారె సమర్పించారు.
కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత
ఎర్రుపాలెం, వెలుగు: కల్యాణలక్ష్మి పథకంతో తల్లిదండ్రులపై భారం తగ్గిందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు చెప్పారు. ఎర్రుపాలెం రైతువేదికలో మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతో కలిసి లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ తిరుమలచారి, ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచులు మొగిలి అప్పారావు, మోహనరావు, పురుషోత్తం రాజు, పద్మ, పుల్లారెడ్ది, ఎంపీటీసీలు మస్తాన్‌వలి, కిశోర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చావా రామకృష్ణ, సుధాకర్‌రెడ్డి, పంబి సాంబశివరావు పాల్గొన్నారు.
సీఎంఆర్ కంప్లీట్ చేయాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ఎఫ్‌సీఐకి లక్ష్యం మేరకు సీఎంఆర్ పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఎన్. మధుసూదన్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో అధికారులతో సీఎంఆర్ పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువులోగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో 1,96,000 మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటివరకు 1,59,000 మెట్రిక్ టన్నులు అందించినట్లు తెలిపారు. మిగిలిన 37 వేల మెట్రిక్ టన్నులను మిల్లర్లు త్వరగా అందించాలని సూచించారు. డీఎస్వో రాజేందర్, జిల్లా మేనేజర్ సోములు, మిల్లర్లు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: రోగులకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకాన్ని పెంచాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి, మాతా శిశు కేంద్రంలో చేసిన ఆపరేషన్లు, ఓపీ తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు పేదవాళ్లు వస్తారని, వారి వద్ద డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌వో డా. మాలతి పాల్గొన్నారు.
కేటీపీఎస్ లో పూర్తి స్థాయి విద్యుత్ ఉత్పత్తి
పాల్వంచ,వెలుగు: పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ఏడవ దశలో గురువారం 802 మెగావాట్ల ఉత్పత్తి నమోదైంది. వార్షిక మరమ్మతులలో భాగంగా 80 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపేశారు. బుధవారం రాత్రి విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరించగా పూర్తిస్థాయిలో ఉత్పత్తి కావడం విశేషం. యూనిట్ లో ఎలాంటి అవాంతరాలు లేవని చీఫ్ ఇంజనీర్ పి వెంకటేశ్వరరావు తెలిపారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి
మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ప్రజల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటుందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. గురువారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన హార్ట్ క్యాంప్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న జీవనవిధానం వల్ల గుండె సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. గతంలో 60 ఏళ్లు పైబడిన వారికే గుండె జబ్బులు వచ్చేవని, ప్రస్తుతం 40 ఏళ్ల వారికి కూడా వస్తున్నాయని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1.40 కోట్ల మంది గుండెపోటుతో చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలితో 80 శాతం వరకు గుండెపోటు సమస్యను నివారించవచ్చని తెలిపారు. జిల్లాకు క్యాన్సర్ కేర్ ఆసుప్రతి మంజూరైందని, రానున్న రోజుల్లో అన్ని రకాల వైద్య చికిత్సలు ఇక్కడే చేస్తారని చెప్పారు.
ప్రజారోగ్యంపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్న సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖలో 21 వేల పోస్టులను కొత్తగా మంజూరు చేశారని అన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, జిల్లాకు ఒక మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మెన్ కూరాకుల నాగభూషయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్, డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
పాల్వంచ,వెలుగు: విద్యుత్ సంస్థల్లో బీసీ ఉద్యోగులకు అన్ని కేటగిరీల్లో సీనియారిటీ ఆధారంగా ప్రమోషన్లు ఇవ్వాలని, లేకపోతే నిరవధిక సమ్మె చేపడతామని విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొమరవెల్లి రవీందర్ హెచ్చరించారు. గురువారం పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6 ,7 దశల చీఫ్ ఇంజనీర్లు రవీందర్ కుమార్, పలుకుర్తి వెంకటేశ్వర్లుకు వినతిపత్రాలు అందజేశారు. అంతకుముందు బీసీ అసోసియేషన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విద్యుత్ సంస్థల్లో బోర్డు సర్వీస్ రెగ్యులేషన్స్, ప్రభుత్వ ఉత్తర్వులు, సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలను పట్టించు కోవడంలేదని ఆరోపించారు. దీనిపై ఉద్యమించాలని నిర్ణయించారు. జెన్కో కార్యదర్శి ఎ రమాకాంత్, లైజన్ ఆఫీసర్ దొంతర బోయిన హరికృష్ణ, లింగం వినోద్, గడ్డి ఐలయ్య, బి రాంబాబు పాల్గొన్నారు.
రైల్వే లైన్ నిర్వాసితులకు బెస్ట్ ప్యాకేజ్
మణుగూరు, వెలుగు: మండలంలోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరా కోసం నిర్మిస్తున్న రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు మెరుగైన పరిహారం ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. ప్యాకేజీ కోసం రైల్వే లైన్ భూ నిర్వాసితులు పనులను అడ్డుకున్న నేపథ్యంలో గురువారం ఇల్లందు సింగరేణి గెస్ట్ హౌస్ లో అధికారులతో సమావేశమయ్యారు. భూములు కోల్పోతున్న రైతులకు ఇవ్వాల్సిన ప్యాకేజీపై సమీక్షించారు. వీలైనంత త్వరగా పరిహారం అందించి రైల్వే లైన్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, బీటీపీఎస్ సీఈ బిచ్చన్న, డీఎస్పీ ఎస్వీ రాఘవేందర్ రావు, జడ్పీటీసీ పోశం నరసింహారావు, సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ పి రవీందర్ రావు, తహసీల్దార్ నాగరాజు, సీఐ ముత్యం రమేశ్
పాల్గొన్నారు.
పోడు భూముల జోలికి వస్తే ఉరికించి కొడతాం
అశ్వారావుపేట, వెలుగు: పోడుభూముల జోలికి వస్తే ఫారెస్ట్ ఆఫీసర్లను ఉరికించి కొడతారని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. విలేకరులపై ఫారెస్ట్ అధికారుల దాడిని ఖండిస్తూ గురువారం ఎంపీడీవో ఆఫీసులో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ విలేకరులపై దాడి చేయడం సరైంది కాదన్నారు. తండాలు, ఆదివాసీ గ్రామాల పోడు సాగుదారులు ఏకమై ఉరికించి కొడతామని హెచ్చరించారు. మీడియాపై దురుసుగా ప్రవర్తించిన ఎఫ్ఎస్ఓ సంపత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బైక్ ర్యాలీ చేపట్టారు. ఎంపీపీ జల్లిపల్లి శ్రీరాంమూర్తి, న్యూ డెమోక్రసీ నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ చౌదరి పాల్గొన్నారు.
క్రెడిట్ సొసైటీ లోన్స్ ఇవ్వాలి
మణుగూరు, వెలుగు: మండలంలోని బీటీపీఎస్ ఫ్యాక్టరీలో పని చేస్తున్న ఉద్యోగులకు కేటీపీఎస్ ఎంప్లాయిస్ క్రెడిట్ సొసైటీలో లోన్స్ ఇవ్వాలని కార్మిక సంఘం(నెం:1535) లీడర్స్ కోరారు. గురువారం బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్నకు యూనియన్ సెంట్రల్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణ, జెన్కో ప్రెసిడెంట్ పి.రాములు వినతిపత్రం అందజేశారు. రీజియన్ ప్రెసిడెంట్ వి. ప్రసాద్, స్టేట్ లీడర్స్ అయిత వెంకటేశ్వర్లు, దానం నరసింహారావు, శ్రీధర్, అనిల్ పాల్గొన్నారు.
పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి
ములకలపల్లి,వెలుగు: అర్హులైన పేదలందరికీ రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. వీఆర్ఏల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, కార్యదర్శి వర్గ సభ్యుడు పోడియం వెంకటేశ్వర్లు, గౌరీ నాగేశ్వరరావు, మాలోత్ రావూజ, నిమ్మల మధు పాల్గొన్నారు.''
వ్యవసాయ మార్కెట్ కు 5 రోజులు సెలవులు
ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వచ్చే నెల 2 నుంచి 6 వరకు సెలవులు ఉన్న నేపథ్యంలో మార్కెట్ కు రైతులు వ్యవసాయ ఉత్పత్తులు తీసుకు రావద్దని గ్రేడ్–1 సెక్రటరీ రుద్రాక్ష మల్లేశం తెలిపారు. రైతులు, దడవాయిలు, గుమస్తాలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.
ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
పాల్వంచ,వెలుగు: తెలంగాణ ఉద్యమకారుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఫోరం నాయకులు ఎండీ మంజూర్
అలీ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద కరీంనగర్ లో నిర్వహించనున్న టీయూఎఫ్ 3వ ఆవిర్భావ సభ కరపత్రాలను రిలీజ్ చేశారు. ఎండీ మసూద్, బుడగం నాగేశ్వ రరావు, శ్రీపాద సత్య నారాయణ, హుస్సేన్, దేవదానం, గొడ్ల మోహన్ రావు, ఇజ్జగాని రవి, తాళ్లూరి సత్య నారాయణ, బొల్లం భాస్కర్, కుదురుపాక వెంకటేశ్వర్లు పాల్గొన్నా రు.
కట్నం కోసం వేధిస్తున్నారని కంప్లైంట్
పెనుబల్లి, వెలుగు: అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తున్నారని మండలంలోని యడ్లబంజర్ గ్రామానికి చెందిన జెగిని మౌనిక గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కల్లూరు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ వలసాల విజయలక్ష్మి, నరసింహారావు కొడుకు మణికృష్ణతో రెండేళ్ల క్రితం రూ.20 లక్షల నగదు, 4 ఎకరాల భూమి, రూ.3 లక్షల విలువైన బంగారం ఇచ్చి పెళ్లి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. మూడు నెలల తరువాత అదనంగా రూ. 25 లక్షల కట్నం తీసుకురావాలని గర్భవతి అని కూడా చూడకుండా ఇనుపరాడ్ తో కొట్టి చంపేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కింది.
పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలి
ములకలపల్లి,వెలుగు: అర్హులైన పేదలందరికీ రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. గురువారం మండలకేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. వీఆర్ఏల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పార్టీ మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు, కార్యదర్శి వర్గ సభ్యుడు పోడియం వెంకటేశ్వర్లు, గౌరీ నాగేశ్వరరావు, మాలోత్ రావూజ, నిమ్మల మధు పాల్గొన్నారు.
కిన్నెరసాని గేట్లు ఓపెన్
పాల్వంచ, వెలుగు: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పాల్వంచలోని కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తింది. ప్రాజెక్టులోకి 750 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. దీంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రెండు గేట్లను ఎత్తి 11 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు కోరారు.
నిలిచిన రాకపోకలు
చండ్రుగొండ: మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పోకలగూడెం శివారులో వాగు పొంగి బాల్యతండా, వెంకటయ్యతండా, సామ్యతండా, కరిశలబోడు, వంకనెంబరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం వరకు వరద ఉధృతి తగ్గకపోవడంతో ఇబ్బంది పడ్డారు.
సంబురంగా బతుకమ్మ వేడుకలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గురువారం బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలకు పూజలు చేసి ఆడిపాడారు. కొత్తగూడెం జడ్పీ ఆవరణలో జరిగిన వేడుకల్లో జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, జడ్పీ సీఈవో విద్యాలత పాల్గొని సందడి చేశారు.
- వెలుగు, నెట్వర్క్