నల్గొండ, వెలుగు: టీపీసీసీ కమిటీల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలకు సముచిత స్థానం దక్కింది. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, సామాజిక వర్గాలను పరిగణనలోకి తీసుకుని జిల్లా, రాష్ట్ర కమిటీలో చోటు కల్పించారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో నల్గొండ మినహా మిగిలిన 11 నియోజకవర్గాల నేతలకు పలు కమిటీల్లో చోటు లభించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సొంత నియోజకవర్గం నల్గొండకు చెందిన ఏ ఒక్కరికీ కమిటీల్లో స్థానం దక్కలేదు. జిల్లాకు చెందిన సీనియర్ లీడర్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, దామోదర్‌రెడ్డికి, వారి అనుచరులకు పెద్దపీట వేశారు. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ముద్ర కూడా కమిటీల్లో కనిపించింది. ఆయన ముఖ్య అనుచరులుగా చెప్పుకుంటున్న పలువురికి రాష్ట్ర కమిటీల్లో చోటు కల్పించారు.
సామాజిక సమీకరణాల ప్రకారం...
సామాజిక సమీకరణాల్లో భాగంగా గతంలో మాదిరిగా పాత వారినే తిరిగి జిల్లా అధ్యక్షులుగా నియమించారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా కేతావత్ శంకర్‌నాయక్, యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా కుంభం అనిల్‌కుమార్‌రెడ్డిని నియమించారు. వీరు గత ఆరేళ్ల నుంచి డీసీసీ పదవిలో కొనసాగుతుండగా, మరో రెండేళ్ల పాటు చాన్స్ ఇచ్చారు. శంకర్ నాయక్ దామరచర్ల ఎంపీపీగా, జడ్పీటీసీగా పనిచేశారు. కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి గత ఎన్నికల్లో భువనగిరి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సామాజిక సమీకరణాల ప్రకారం సూర్యాపేట బీసీలకే ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌కు మళ్లీ అవకాశం ఇస్తారని తెలుస్తోంది. డీసీసీ పదవి కోసం పటేల్ రమేశ్ కూడా తీవ్రంగానే ప్రయత్నించారు. వీరిద్దరి మధ్య పోటీ కారణంగానే ఎవరి పేరును ఫైనల్ చేయకుండా పెండింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. వీరితో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షుల లిస్ట్‌లో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురికి, జనరల్ సెక్రటరీ లిస్ట్‌లో 10 మందికి చోటు కల్పించారు.
ఉత్తమ్, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి ప్రయారిటీ
రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలకమైన కార్యానిర్వాహక కమిటీల్లో జిల్లా నుంచి పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ప్రయారిటీ ఇచ్చారు. దీంతో పాటు పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉత్తమ్, జానారెడ్డికి చోటు దక్కింది. ఈ రెండు కమిటీల్లోనూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి స్థానం లభించలేదు. తన రాజకీయ భవిష్యత్, కార్యచరణ ఏంటనేది వచ్చే ఎన్నికల్లోగా ప్రకటిస్తానని వెంకట్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. మునుగోడు ఎన్నికలప్పటి నుంచే వెంకట్‌రెడ్డి క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ వెంకట్‌రెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీడబ్ల్యూసీ కమిటీలో చోటు కల్పిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
రాష్ట్ర ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు వీరే...
పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కోదాడ మాజీ ఎమ్మెల్యే ఎన్.పద్మావతి, బండ్రు శోభారాణి, చామల కిరణ్‌రెడ్డి, డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్‌కు అవకాశం కల్పించారు. జనరల్ సెక్రటరీలుగా జానారెడ్డి, రేవంత్‌రెడ్డి అనుచరులకే ప్రయారిటీ ఇచ్చారు. దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, మునుగోడు నియోజకవర్గం నుంచి రాపోలు జయప్రకాశ్, పున్న కైలాశ్ నేత, చలమల్ల కృష్ణారెడ్డి, భువనగిరి నుంచి పొత్నక్ ప్రమోద్ కుమార్, ఆలేరు నుంచి బీర్ల అయిలయ్య, తుంగతుర్తి నుంచి అద్దంకి దయాకర్, సూర్యాపేట నుంచి పటేల్ రమేశ్‌రెడ్డి, మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీర్‌రెడ్డికి, నకిరేకల్ నుంచి కొండేటి మల్లయ్యకు అవకాశం కల్పించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న బత్తుల లక్ష్మారెడ్డికి ఎలాంటి పదవి దక్కలేదు.