ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

‘జనం తో మనం’ పాదయాత్ర లో మల్లికార్జున్‌రెడ్డి 

మోర్తాడ్, వెలుగు: తెలంగాణ ఉద్యమ సమయంలో కాళ్లకు స్లిప్పర్స్​వేసుకుని తిరిగిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని బీజేపీ నేత ఏలేటి మల్లికార్జున్ రెడ్డి ప్రశ్నించారు. ‘జనంతో మనం’ మహా పాదయాత్ర 4 వ రోజుఎర్గట్ల  మండలం దోంచంద గ్రామం నుంచి ప్రారంభమైంది.  ఈ యాత్రకు శుక్రవారం రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు సంబర్​ప్రభాకర్, కోరుట్ల నియోజకవర్గ ఇన్​చార్జి  డాక్టర్ వెంకట్ మద్దతు తెలిపారు. తడ్ పాకల్‌‌గ్రామంలో  మల్లికార్జున్​రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఓయూ స్టూడెంట్లు  ఉద్యమం చేస్తే వారి వెనక తిరిగి  ప్రశాంత్ రెడ్డి ఈ రోజు మంత్రి అయ్యాడని, ఉస్మానియా విద్యార్థులు నిరుద్యోగులై  మళ్లీ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ‘డబుల్’ ఇండ్లు, మూడెకరాల భూమి ఇస్తానని హామీలు ఇచ్చిన మంత్రి ఎవరికీ ఏమీ ఇవ్వకుండా  తాను మాత్రం  రెండంతస్తులు ఇల్లు కట్టుకొని రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ భూములు కొంటున్నారని విమర్శించారు.  తొర్తి గ్రామానికి చెందిన రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు  సల్ల రాజేశ్వర్‌  వార్డు మెంబర్​గాయత్రి మోడీ పాలనకు ఆకర్షితులై బీజేపీలో చేరారన్నారు.  వారికి మల్లికార్జున్‌రెడ్డి  కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.  జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, బీజేపీ ఏర్గట్ల మండల అధ్యక్షుడు  నారాయణ రెడ్డి,  బీజేపీ లీడర్లు  పాల్గొన్నారు.

లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో కంటివైద్య శిబిరం

పిట్లం, వెలుగు:  లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో సీహెచ్​సీలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.   ఈ శిబిరాన్ని క్లబ్​ ప్రసిడెంట్​ వెంకటరమణాగౌడ్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా  డాక్టర్​ హరికిషన్​   60 మందికి పరీక్షలు నిర్వహించారు.  తొమ్మిది మందికి ఆపరేషన్​ అవసరమని గుర్తించారు.  అనంతరం రమణాగౌడ్​ మాట్లాడుతూ వీరికి బోధన్​ లయన్స్​ హస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్​ చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్​  ట్రెసరర్​ డాక్టర్​ కిషన్​, పిట్లం మెడికల్​ ఆఫీసర్​ శివకుమార్, రోహిత్​కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

బాలరత్న అవార్డ్​కు తడపాకల్ స్టూడెంట్​

మోర్తాడ్ వెలుగు: ఏర్గట్ల మండలం లోని తడపాకల్ హైస్కూల్ టెన్త్  విద్యార్థి  డేగల వైష్ణవి బాల రత్న అవార్డ్ కు ఎంపికైనట్లు హెచ్​ఎం రాములు తెలిపారు. కమలకర కళా భారతి ట్రస్ట్ హైదరాబాద్​ వారు ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో నైపుణ్యం సాధించిన బాల బాలికలను గుర్తించి  అవార్డ్  అందిస్తారని చెప్పారు. హైదరాబాద్​లోని త్యాగరాయ గానసభలో  అవార్డు ప్రదానం ఉంటుందన్నారు.

ఇష్టపడి చదివితే కష్టం ఉండదు

మాక్లూర్, వెలుగు: ప్రతి స్టూడెంట్​ ఇష్టపడి చదివితే కష్టం లేకుండా పాస్​ కావచ్చని ఎంపీపీ మాస్త ప్రభాకర్ అన్నారు.   మండలంలోని కేజీబీవీ స్కూల్లో స్టూడెంట్స్​కు డ్రెస్సులు పంపిణీ చేశారు.  ప్రభుత్వం స్టూడెంట్స్​కు కల్పిస్తున్న ఉచిత సౌకర్యాలను  ఉపయోగించుకొని,  బాగా చదువు కోవాలని చెప్పారు .  చదువుతో పాటు ఆట పాటలు, సామాజిక కార్యక్రమాలపై దృష్టి సారించాలని, అన్ని రంగాలలో అమ్మాయిలు ముందుండాలని  సూచించారు.  కార్యక్రమంలో ఎంపీడీఓ క్రాంతి, ఎంపీటీసీ వెంకటేశ్, ప్రిన్సిపాల్​ ప్రగతి, టీచర్లు, స్టూడెంట్స్​ పాల్గొన్నారు. ​

ఖోఖో స్టేట్‌ టీం కోచ్‌గా సుజాత

కామారెడ్డి, వెలుగు : ఈ నెల 20 నుంచి 24 వరకు మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌లో జరిగే 55వ నేషనల్‌ లెవల్‌ సీనియర్‌ ఖోఖో పోటీలకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ముగ్గురు పీఈటీలు ఎంపికయ్యారు. ఇందులో తెలంగాణ టీమ్‌ కోచ్‌గా కుద్వాన్‌పూర్‌ హైస్కూల్‌ పీఈటీ సుజాత, పురుషుల టీం మేనేజర్‌గా గండీమాసానిపేట పీఈటీ మహ్మద్‌ అతీకుల్ల, నేషనల్‌ అఫీషియల్‌గా బోధన్‌ బీబీనగర్‌ పీఈటీ సౌజన్య ఎంపికయ్యారు. ముగ్గురు పీఈటీల ఎంపిక పట్ల ఖోఖో అసోసియేషన్‌ ఉమ్మడి జిల్లా చైర్మన్‌ బిల్లా అనిల్, ప్రెసిడెంట్‌ భూమారెడ్డి, ట్రెజరర్‌ నోముల మధుసూదన్‌రెడ్డి, అర్గనైజింగ్‌ సెక్రటరీ నాగేశ్వర్‌రావు, కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ రంగా వెంకటేశ్వర్‌గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు.

కలెక్టరేట్ ఎదుట ధర్నా

నిజామాబాద్ టౌన్, వెలుగు: 300 జనాభా కలిగిన కాలనీలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అధిక జనాభా కలిగిన కాలనీల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని నాయకులు విమర్శించారు. సౌలతులు లేని కాలనీలు జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేకల రాజేందర్, శ్రీమాన్, ఎత్తిరి గంగారం, వెంకట్, సురేశ్, నర్సయ్య, బోధన్ రవి, బాలకృష్ణ, దేవ్ బాయ్ పాల్గొన్నారు.

భగ్గుమన్న బీజేపీ నేతలు

నెట్​వర్క్​, వెలుగు: ఎంపీ ధర్మపురి అర్వింద్ పై ఎమ్మెల్సీ కవిత అనుచిత వ్యాఖ్యలు, ఆయన ఇంటిపై టీఆర్ఎస్​కార్యకర్తలు చేసిన దాడిపై  ఉమ్మడి జిల్లా బీజేపీ నేతలు భగ్గుమన్నారు. జిల్లా వ్యాప్తంగా కవిత దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు.  నిజాంసాగర్ కెనాల్​ బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ ఎంపీకి  కవిత వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్​చేశారు.   తన తండ్రి కేసీఆర్ సీఎం అని,  ఏం చేసినా నడుస్తదన్న అహంభావంతో టీఆర్ఎస్​గుండాలచే ఎంపీ ఇంటిపై దాడి చేయించడం సిగ్గుచేటన్నారు. నందిపేట, బోధన్, కామారెడ్డి కేంద్రాల్లో బీజేపీ లీడర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. 

అర్వింద్​ ఇంటిపై దాడి అప్రజాస్వామికం

ఖండించిన బీజేపీ జిల్లా నేతలు

నిజామాబాద్/మోర్తాడ్/ఆర్మూర్, వెలుగు: రాష్ట్రంలో ఎంపీ అర్వింద్​కే రక్షణ లేకపోతే సామా న్యుల పరిస్థితి ఏమిటని? టీఆర్ఎస్​పాలనలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  ధన్​పాల్​సూర్యనారా యణ అన్నారు. నిజామాబాద్​ధర్నాచౌక్​లో శుక్ర వారం సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దిష్టి బొమ్మ  దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ ఇంటిపైన దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. టీఆర్ఎస్​దాడులకు బీజేపీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలు  ఓట్లు వేస్తే అర్వింద్ గెలిచారని దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయిన  కవితకుఎంపీని విమర్శించే నైతికహక్కు లేదని  విమ ర్శించారు.  దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో అర్వింద్​ పై పోటీ చేసి గెలవాలని సవాల్​విసిరారు. కవిత కాంగ్రెస్​నేతలతో టచ్​లో ఉన్న విషయాన్ని ఎంపీ చెప్పారని, కానీ ఆమె అర్వింద్​ ఇంటిపై దాడి చేయించడం హత్యకు కుట్ర చే యడమేనని ఆరోపించారు. దాడిచేసిన వారిని  వెంటనే శిక్షించాలని డిమాండ్​ చేశారు. వడ్డి మోహన్ రెడ్డి, గద్దె భూమన్న,  జిల్లా    రాజశేఖ ర్​రెడ్డి, లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, న్యాలం రాజు, పంచారెడ్డి లింగం, స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నీలాంబరిని తలపించిన కవిత..

ఎంపీ అర్వింద్​పై ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరు ‘నర్సింహ’ సినిమాలో నీలాంబరి క్యారెక్టర్​ను తలపించిందని , దీంతో ఆమె ఎంత ప్రస్టేషన్​లో ఉందో అర్థమవుతోందని  బీజేపీ నేత ఏలేటి మల్లికార్జునరెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన దాడి  మల్లికార్జున్ రెడ్డి  ఖండించారు. పాదయాత్రలో ఉన్న ఆయన బట్టాపూర్​ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కవిత ప్రెస్​మీట్​ముగియగానే ఎంపీ ఇంటిపై దాడి చేయడం వెనుక ఆమె హస్తం ఉందన్నారు.  

కవితవి దిగజారుడు మాటలు..

ఎంపీ అర్వింద్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రెస్​ మీట్ పెట్టి మాట్లాడారని, ప్రతిగా ఖండించాల్సింది పోయి..  ఎంపీని చెప్పుతో కొడతా అంటూ కవిత  అసభ్యకరంగా మాట్లాడడం, ఆయన ఇంటిపై దాడి చేయించడం ఆమె దిగజారుడు తనానికి నిదర్శనమని బీజేపీ లీడర్​ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఎంపీ అర్వింద్  కు ప్రాణాపాయం ఉందని హై సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  

బీజేపీ గెలుపునకు కార్యకర్తల కృషే కీలకం

లింగంపేట్, వెలుగు: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, విజయం సాధించేందుకు  బూత్​ స్థాయి  కార్యకర్తలే కీలకంగా పని చేయాలని  బీజేపీ ఎల్లారెడ్డి ఇన్​చార్జి బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. లింగంపేట్​లో శక్తికేంద్రాల ఇంచార్జి లు, ముఖ్యనేతలతో శుక్రవారం ఆయన సమావేశం నిర్వహించారు.   కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గడప గడపకూ తీసుకెళ్లాలని  చెప్పారు.  అనంతరం ఎల్లారెడ్డి అసెంబ్లీ కన్వీనర్​గా ఎంపికైన లింగారావును   సన్మానించారు.  కార్యక్రమంలో జిల్లా  జనరల్​ సెక్రెటరీ మర్రి బాపురెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మురళీ, దేవెందర్​, మండల  అధ్యక్షుడు  దత్తురాం, రాంచందర్​   పాల్గొన్నారు. 

పేదలకు చదువును దూరం చేసే కుట్ర

కామారెడ్డి, వెలుగు: కొత్త జాతీయ విద్యా విధానం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా,  పేద విద్యార్థులకు విద్యను దూరం చేసేలా ఉందని  ఎస్​ఎఫ్​ఐ స్టేట్​ వైస్​ ప్రెసిడెంట్​ తాటికొండ రవి వివరించారు.  ఎస్​ఎఫ్​ఐ ఆధ్వర్యంలో   కామారెడ్డి డిగ్రీ కాలేజీలో  నూతన విద్యా విధానం 2020- ఒక పరిశీలన అనే ఆంశంపై శుక్రవారం సెమినార్​ జరిగింది.  ఈ కార్యక్రమంలో తాటికొండ రవి మాట్లాడుతూ..   కార్పోరేట్​ విద్యా విధానాన్ని పెంచి పొషించేలా కేంద్ర ప్రభుత్వం  జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెడుతోం దన్నారు.   ఈ కార్యక్రమంలో  ఎస్​ఎఫ్​ఐ జిల్లా ప్రెసిడెంట్​ ముదాం అరుణ్​, ప్రతినిధులు  సతీశ్​, అల్తాఫ్,  అవినాష్​,  రాహుల్​, వేణు , స్టూడెంట్స్​ పాల్గొన్నారు.  

పోలీస్ స్టేషన్ తనిఖీ

నవీపేట్, వెలుగు: స్థానిక పోలీస్​ స్టేషన్​ను   ఏసీపీ వెంకటేశ్వర్ శుక్రవారం తనిఖీ చేశారు.అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  గ్రామాల్లో పేకాట, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా  పెట్రోలింగ్ నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.  పక్కనే మహారాష్ట్ర ఉన్నందున అక్కడి నుంచి వచ్చే వారిపై ప్రతే క నిఘా ఉంచాలన్నారు. ఆయన వెంట నార్త్ రూరల్ సీఐ. నరహరి, ఎస్. ఐ. రాజిరెడ్డి , ఏఎస్​ఐలు  మోహన్ రెడ్డి, యాదగిరి గౌడ్ లు ఉన్నారు.

హమాలీల కూలి పెంచాలి

బాన్సువాడ, వెలుగు : హమాలీల కూలి రేట్లు పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్‌ రాములు డిమాండ్‌ చేశారు. బాన్సువాడ తహసీల్దార్‌ ఆఫీస్‌లో శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సిమెంట్‌, ఫర్టీలైజర్స్‌, ఇతర షాపుల ఓనర్లకు హమాలీ  రేట్లు పెంచడంతో పాటు, ఇతర బెనిఫిట్స్‌ కూడా కల్పించాలని కోరారు. హమాలీ రేట్లు పెంచే వరకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఆ సంఘం డివిజన్‌ కన్వీనర్‌ డి.శంకర్, ఎం.రాజు, శివాజీ, సీహెచ్‌.రాములు, మొగులయ్య, రామగౌడ్, ఆర్.హన్మాండ్లు, పాల్గొన్నారు. అనంతరం రేట్లను నిర్ణయిస్తూ తీర్మానం చేశారు. 

బోధన్‌లో పోలీసు కవాత్​

బోధన్, వెలుగు : బోధన్‌ ఏసీపీ కిరణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పోలీసులు పట్టణం లో కవాత్​ నిర్వహించారు. టౌన్‌ పీఎస్‌ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్, గవర్నమెంట్‌ హాస్పిటల్, పోస్టాఫీస్‌, రేంజల్‌ బేస్‌, శక్కర్‌నగర్‌ చౌరస్తా, కొత్త బస్టాండ్‌, అనిల్‌ టాకీస్‌ చౌరస్తా మీదుగా అంబేద్కర్​చౌరస్తా మీదుగా సాగింది. కార్యక్రమంలో టౌన్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌ రాజ్‌, ఏస్సైలు, స్పెషల్‌పార్టీ పోలీసులు పాల్గొన్నారు.

ఆయిల్‌పామ్‌తో అనేక లాభాలు

బాన్సువాడ, వెలుగు : ఆయిల్‌పామ్‌  సాగుతో అనేక లాభాలు ఉంటాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పోచారం గ్రామంలో శుక్రవారం ఆయన ఆయిల్‌పామ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ ఒక్కసారి నాటితే 30 ఏళ్ల పాటు పంట వస్తుందన్నారు. ఇందులో అంతర్‌ పంట కూడా సాగు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ జిల్లా అధ్యక్షుడు పోచారం భాస్కర్‌రెడ్డి, కామారెడ్డి అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రమోహన్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు బాన్సువాడ అయ్యప్ప ఆలయ కమిటీ ట్రెజరర్‌ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పలువురు మాలధారులు స్పీకర్‌ను కలిశారు. ఈ నెల 21న అయ్యప్ప ఆలయంలో నిర్వహించే శివపార్వతుల కల్యాణానికి హాజరుకావాలని కోరారు. స్పీకర్‌ను కలిసిన వారిలో సాయిలు, శేఖర్‌గౌడ్‌, ధనగారి శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.