ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

కోటగిరి, వెలుగు: సీఎం కేసీఆర్ సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పాలన సాగిస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటైన పొతంగల్ మండల కేంద్రంలో శుక్రవారం స్పీకర్‌‌ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఓ వైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నారన్నారు. ఇక్కడి ప్రజల కోరిక మేరకే పొతంగల్‌ను మండలంగా ఏర్పాటు చేశామని చెప్పారు. బాన్సువాడ నియోజకర్గ అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం కేసీఆర్‌‌కు ఈ సందర్భంగా స్పీకర్‌‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో బాన్సువాడ టీఆర్‌‌ఎస్‌ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌‌రెడ్డి, జడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, డీసీసీబీ డైరెక్టర్ శాంతీశ్వర్ పటేల్, స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, మండల్ కో ఆప్షన్ మెంబర్‌‌ ఇస్మాయిల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు, ఆర్డీవో రాజేశ్వర్ పాల్గొన్నారు.

కేసీఆర్‌‌వి ఊకదంపుడు ఉపన్యాసాలు: మాజీ మంత్రి షబ్బీర్‌‌ అలీ

కామారెడ్డి, వెలుగు: సీఎం కేసీఆర్‌‌ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మోసగిస్తున్నాడని  మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్​నేత షబ్బీర్​అలీ విమర్శించారు. శుక్రవారం కామారెడ్డి మండలం నర్సన్నపల్లి, పాతరాజంపేటల్లో జరిగిన కాంగ్రెస్ జెండా అవిష్కరణ, రచ్చబండ ప్రోగ్రామ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్‌‌కు ప్రజలు రెండు సార్లు అధికారం కట్టబెడితే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు కేంద్రంపై నెపం మోపుతున్నారని విమర్శించారు. దొర గడిని బద్దలు కొట్టాల్సిన అవసరముందన్నారు. కేసీఆర్, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ప్రజలను వంచించారన్నారు. దేశ సంపదను నరేంద్ర మోడీ అదానీ, అంబానీలకు కట్టబెడితే, రాష్ట్రంలో  ​ హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న భూములను కేసీఆర్ తన బంధువులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో  రైతులకు రూ.2 లక్షల లోన్లు మాఫీ చేస్తామని, ధరణి పోర్టర్‌‌ను రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, పార్టీ రూరల్ ప్రెసిడెంట్ గూడెం శ్రీనివాస్​రెడ్డి, లీడర్లు ఇంద్రాకరణ్‌రెడ్డి,  చంద్రక్రాంత్‌రెడ్డి, కిషన్‌రావు, నర్సింహారెడ్డి, రవి పాల్గొన్నారు.  

రేపు జిల్లా స్థాయి యోగా పోటీలు

కామారెడ్డి, వెలుగు: ఈనెల 27న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్​నగర్ కాలనీ ఎస్ఎస్‌వై యోగా సెంటర్‌‌లో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు గడ్డం రాంరెడ్డి, పెట్టిగాడి అంజయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, పురుషులకు సీనియర్ విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. ఇందులో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారిని వచ్చే నెల 4న జరిగే  రాష్ట్ర స్థాయి పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు.

డబుల్ బెడ్‌ రూం ఇండ్లను కంప్లీట్ చేయండి

ఇందల్వాయి, వెలుగు: మండలంలోని ఇందల్వాయిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌ రూం ఇండ్లలో పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన ఇందల్వాయిలోని డబుల్​బెడ్‌ రూం ఇండ్లను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్లు, వైరింగ్, డ్రైనేజీ వంటి పనులను త్వరగా పూర్తి చేసి జనవరి15 లోపు ఇండ్లు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. జిల్లాలో 3,600 ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అనంతరం గ్రామస్తులు పోడు భూముల సమస్యను కలెక్టర్‌‌కు వివరించారు. ఆయన వెంట తహసీల్దార్ రోజా ఉన్నారు.

అర్హులందరినీ ఓటరు జాబితాలో చేర్చాలి

నిజామాబాద్ టౌన్: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. ఓటరు నమోదుపై శుక్రవారం కలెక్టర్‌‌ సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26, 27, డిసెంబర్ 3, 4వ తేదీల్లో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. సెల్‌ కాన్ఫరెన్స్‌లో అడిషనల్‌ కలెక్టర్లు చిత్రామిశ్రా, చంద్రశేఖర్, డీసీవో సింహాచలం, డీపీవో జయసుధ, జడ్పీ సీఈవో గోవింద్, డీఆర్డీవో చందర్ పాల్గొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: నిజామాబాద్‌ సీపీ నాగరాజు

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని నిజామాబాద్‌ సీపీ నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ అభివృద్ధి జరుగుతుందన్నారు. జిల్లాలో మహిళల రక్షణ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందు కోసం షీ టీమ్స్‌, మహిళా కేంద్రాలు, అంబాసిడర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీపీ అరవింద్‌బాబు, కామారెడ్డి ఏఎస్పీ రాజారత్నం, నిజామాబాద్ ఆర్మూర్ సీసీఎస్ ప్రభాకర్, వెంకటేశ్వర్, రమేశ్‌, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సప్న తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్‌కు ప్రశంస

నవీపేట్, వెలుగు: బ్లూకోర్ట్ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సీపీ నాగరాజు ప్రశంసించారు. నవిపేట్ పీఎస్‌ పరిధిలో 100 కాల్స్ ఇతర ఫిర్యాదు రాగానే సరైన సమయంలో స్పందిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేసిన శ్రీనివాస్ సమయ స్ఫూర్తిని అభినందించారు. కార్యక్రమంలో ఏసీపీ అర్వింద్ బాబు పాల్గొన్నారు. 

టాస్క్​ఫోర్స్‌ కమిటీ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలి

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో ప్రైమరీ స్కూళ్లలో ఫౌండేషన్ లిటరసీ అండ్​న్యూమరసీ ( ఎఫ్ఎల్ఎన్​) ప్రోగ్రామ్‌ అమలుపై టాస్క్​ఫోర్స్ కమిటీని నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్ కామారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ వై.సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం టీపీటీఎఫ్​జిల్లా కమిటీ మీటింగ్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్‌‌కే డిగ్రీ కాలేజీలో జరిగింది. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రైమరీ స్కూళ్లలో టీచర్లను భయపెడుతూ టాస్క్​ఫోర్స్ పర్యవేక్షణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. జనరల్​సెక్రటరీ అనిల్‌కుమార్‌‌ మాట్లాడుతూ పాలకులు టీచర్ల బదిలీలు చేపట్టకుండా సాకులు చెబుతున్నారన్నారు.  ప్రతినిధులు టి.హన్మండ్లు, నాగబూషణం, కె.నళినిదేవి, మీనాభూషణ్, రూప్​సింగ్, లింగం, లక్ష్మి, చక్రపాణి, విజయశ్రీ, నరేంద్ర ప్రసాద్, పి.అంజయ్య పాల్గొన్నారు.  

బీజేపీలో చేరిన కాంగ్రెస్‌ లీడర్లు

పిట్లం, వెలుగు: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు. శుక్రవారం బిచ్కుంద మండలం చిన్న దేవాడకు చెందిన 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ప్రెసిడెంట్​ అరుణతార సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి పార్టీలోకి స్వచ్ఛందంగా చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిచ్కుంద పార్టీ ప్రెసిడెంట్ కిష్టారెడ్డి, బీజేవైఎం మండల ప్రెసిడెంట్ శెట్పల్లి విష్ణు, చిన్న దేవాడ బూత్ ప్రెసిడెంట్​హనుమాండ్లు, పత్తి రమేశ్‌, రాజు పటేల్, తరుణ్ పాల్గొన్నారు.

ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి 

నిజాంసాగర్ (ఎల్లారెడ్డి), వెలుగు: మండలంలోని బూర్గుల్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని కొందరు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారని బుధవారం గ్రామానికి చెందిన 50 మంది  రైతులు శుక్రవారం బాన్సువాడ ఆర్డీవో  ఆఫీస్‌లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన 448 సర్వే నంబర్‌‌లో ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వైకుంఠ ధామం, పల్లె పకృతి వనం ఏర్పాటు కోసం రెవెన్యూ ఆఫీసర్లు కేటాయించారు. అయిదే దీనిని గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు సాగు కోసం చదువు చేస్తున్నారని, అడ్డుకున్న పంచాయతీ సభ్యులపై దాడులకు దిగుతున్నారని అందులో పేర్కొన్నారు. గతంలో తహసీల్దార్‌‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించా లని  కోరారు.

టీఆర్‌‌ఎస్‌ను తరిమికొట్టాలి

వేల్పూర్, వెలుగు: రాష్ట్రంలో కరెంట్‌, బస్‌ చార్జీలు పెంచిన టీఆర్ఎస్‌ను రాబోయే రోజుల్లో తరిమికొట్టాలని బీజేపీ నేత డాక్టర్ ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన చేపట్టిన జనంతో మనం పాదయాత్ర 11వ రోజు వేల్పూర్‌ ‌మండలం అమీనాపూర్‌ నుంచి సాహెబ్‌పేట్‌, జానకంపేట్‌, నడుకుడ, కొత్తపల్లి, వాడి వరకు కొనసాగింది. టీఆర్‌‌ఎస్‌ అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఎస్సీ, బీసీ కార్పొరేషన్ లోన్ల ఊసే ఎత్తడం లేదన్నారు. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్‌ మాఫియా పెరిగిపోయిందని ఆరోపించారు. వీరు టీఆర్ఎస్ నాయకులు మద్దతుతో రెచ్చిపోతున్నారన్నారు. యాత్రలో బాల్కొండ అసెంబ్లీ కన్వీనర్ మల్కన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్, వెల్పూర్‌ మండల అధ్యక్షుడు రమేశ్‌, ప్రధాన కార్యదర్శి భాను చందర్‌ తదితరులు ఉన్నారు.

బాధితులకు న్యాయం చేస్తాం..

పిట్లం, వెలుగు: నేషనల్ హైవే 161లో భూములు కోల్పోయిన బాధితులకు న్యాయం చేస్తామని డీపీవో శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం బాధితులు వినతి మేరకు హైవేలో కోల్పోయిన భూములను స్పాట్‌కు వెళ్లి పరిశీలించారు. అనంతరం పంచాయతీలోని రికార్డునుల తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేషనల్ హైవే 161లో భూములు కోల్పోయిన వారికి పరిహారం అందించారని, అయితే కొంత మంది బాధితులు తమకు సరైన పరిహారం రాలేదని కలెక్టర్‌‌కు ఫిర్యాదు చేశారని చెప్పారు. కలెక్టర్ ఆదేశాలతో భూముల పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు.  బాధితులకు న్యాయం జరిగేలా పూర్తి నివేదికను కలెక్టర్‌‌కు అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో జీపీ సెక్రటరీ యాదగిరి, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.