- సుదర్శన్‌రెడ్డి ఆశలపై నీళ్లు
- షబ్బీర్అలీకి నిరాశే
- విస్తరణలో చాన్స్ వచ్చేనా?
నిజామాబాద్, వెలుగు : తెలంగాణ కొత్త ప్రభుత్వంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చోటు దక్కలేదు. గురువారం రేవంత్ రెడ్డి సీఎంగా 12 మందితో తొలి కాంగ్రెస్ మంత్రివర్గం ఏర్పడింది. ఈకేబినెట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి చోటు దక్కవచ్చునని కాంగ్రెస్ నేతలు ఆశించారు. ఒక్కరికి కూడా పదవి లభించకపోవడంతో జిల్లా నేతలు, కార్యకర్తలు నిరాశ చెందారు.
సీనియరైనా మొండిచేయి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 4 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. బోధన్, నిజామాబాద్ రూరల్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోకవర్గాల్లో కాంగ్రెస్ గెలవగా.. సుదర్శన్‌రెడ్డి మినహా ముగ్గురు కూడా మొదటిసారి గెలిచినవారే. కాంగ్రెస్ సీనియర్‌నేత అయిన సుదర్శన్‌రెడ్డి నాలుగో సారి శాసనసభకు ఎన్నికయ్యారు.
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 1014 వరకు రాష్ట్ర కెబినేట్ లో ఉన్నారు. వై. ఎస్. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య మంత్రివర్గాల్లో వైద్య విద్యా శాఖ మంత్రిగా, కిరణ్కుమార్మంత్రివర్గంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పనిచేశారు. దీంతో ఆయనకు మంత్రివర్గంలో తప్పనిసరిగా బెర్త్ దక్కుతుందని భావించారు. ఆయన అనుచరులు, పార్టీ నాయకులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి పెద్ద ఎత్తున వెళ్లేందుకు సిద్దపడగా.. ఎవరూ రావద్దని ఉదయమే వారికి హైదరాబాద్‌నుంచి సమాచారం వచ్చింది.
దీంతో వారంతా నిరాశకు గురయ్యారు. కేబినెట్లో సీఎంతో పాటు ముగ్గురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రులు ఉండడంతో ఆయన అవకాశం చేజారిందనే వాదన వినిపిస్తోంది. కేబినెట్ ర్యాంకు ఉన్న మరో పదవేదైనా ఆయనకు ఇవ్వవచ్చునని చెప్తున్నారు.
మైనారిటీ కోటా వర్కవుట్ కాలే
కామారెడ్డి సీటును రేవంత్‌రెడ్డి కోసం వదులుకొని నిజామాబాద్ అర్బన్‌లో పోటీ చేసిన మాజీమంత్రి షబ్బీర్అలీకి పదవి లభిస్తుందని జోరుగా ప్రచారం జరిగింది. రేవంత్‌రెడ్డితో మొదటినుంచి షబ్బీర్ అలీకి మంచి సంబంధాలు ఉన్నాయి. పార్టీ హైకమాండ్ తో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. కాంగ్రెస్ నుంచి మైనారిటీ నేత ఎవరూ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించడంలేదు.
మైనారిటీలకు స్థానం కల్పించేందుకు సీనియర్ నాయకుడైన షబ్బీర్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత శాసనమండలికి పంపుతారని కాంగ్రెస్ శ్రేణుల్లో వినిపించింది. బుధవారం రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్ అలీ కూడా ఢిల్లీలో పార్టీ పెద్దలను కలవడం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. అయితే.. అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన మిగతా సీనియర్లను కాదని ఇప్పటికిప్పుడే పదవి కట్టబెట్టడంవల్ల సమస్యలు వస్తాయని భావించి షబ్బీర్‌కు అవకాశం ఇవ్వలేదని అంటున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో మంత్రివర్గం ఏర్పడలేదని, త్వరలోనే విస్తరణ ఉంటుందని చెప్తున్నారు. మంత్రిపదవి ఇవ్వలేని పక్షంలో పీసీసీ బాధ్యతలు కట్టబెట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు.