
- ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఓకే
- ప్రతిపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణ
న్యూఢిల్లీ: దేశంలో ముస్లిం ధార్మిక ఆస్తుల నిర్వహణ విధానంలో మార్పులు చేసేందుకు ఉద్దేశించిన వక్ఫ్ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఆమోదించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఓకే చెప్పింది.
ప్రతిపక్షాలు సూచించిన మార్పులను తిరస్కరించింది. సోమవారం జేపీసీ మీటింగ్అనంతరం ఆ వివరాలను కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ వెల్లడించారు. మొత్తం 44 సవరణలు చర్చకు వచ్చాయని, సభ్యులందరినీ మార్పులు సూచించాల్సిందిగా కోరామని తెలిపారు.
వీటిపై ఆరు నెలలపాటు సమగ్ర చర్చ జరిపినట్టు చెప్పారు. ఇదే చివరి సమావేశం అని పేర్కొన్నారు. మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికగా 14 సవరణలను కమిటీ ఆమోదించిందని వెల్లడించారు.
ప్రతిపక్షాలు కూడా మార్పులు సూచించాయని, ప్రతి సవరణను ఓటింగ్‌కు పెట్టామని తెలిపారు.. అయితే వారు సూచించిన సవరణలను సమర్థిస్తూ 10 ఓట్లు, వ్యతిరేకిస్తూ 16 ఓట్లు వచ్చాయని వివరించారు.
ప్రతిపక్ష ఎంపీల అసంతృప్తి
తాము సూచించిన మార్పులు తిరస్కరణకు గురికావడంపై ప్రతిపక్షాల ఎంపీలు అసంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరగలేదని ఆరోపించారు. తమ వాదనలను జగదాంబికా పాల్ వినలేదని, నియంతృత్వ ధోరణిలో వ్యవహరించారని తృణమూల్కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అన్నారు.
తాము ఊహించినట్టే జరిగిందని, తమను మాట్లాడేందుకూ అనుమతించలేదని తెలిపారు. కాగా, ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలు సరికాదని జగదాంబికా పాల్ పేర్కొన్నారు. మెజార్టీ అభిప్రాయలను కమిటీ ఆమోదించిందని వెల్లడించారు.
కాగా, మొత్తంగా జేపీసీ సూచించిన 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్ జరగనుంది. జనవరి 31న లోక్‌సభకు కమిటీ తుది నివేదిక అందజేయనున్నట్టు సమాచారం.